TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

Mahadev Betting App: స్కామ్‌లో కీలక వ్యక్తి అరెస్ట్..!

Published on: Thu Sep 24, 2026 8:48PM

మహదేవ్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో కింగ్‌పిన్‌, వాంటెడ్‌ నిందితుడిగా ఉన్న అభిషేక్‌ కుమార్‌ను సీబీఐ అరెస్ట్‌ చేసింది. దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన అతడిని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగగానే అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సీబీఐ దర్యాప్తులో అభిషేక్‌ కుమార్‌ ‘మహదేవ్‌ బుక్‌’ పేరుతో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, జూద కార్యకలాపాల నిర్వహణలో కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. బెట్టింగ్‌ ప్యానళ్ల సమన్వయం, నిధుల సేకరణలో అతడి పాత్ర ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.అంతేకాదు.. బెట్టింగ్‌, జూద కార్యకలాపాల ద్వారా వచ్చిన అక్రమ సొమ్ముతో దుబాయ్‌లో స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు సీబీఐ గుర్తించినట్టు తెలిపింది. 

అరెస్టు అనంతరం అభిషేక్‌ వద్ద నుంచి కీలక ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.మహదేవ్‌ యాప్‌ ప్రధాన ప్రమోటర్లుగా దర్యాప్తు సంస్థ పేర్కొంటున్న సౌరభ్‌ చంద్రకర్‌, శుభమ్‌ సోనీతో కలిసి అభిషేక్‌ కుమార్‌ పనిచేసినట్లు సీబీఐ వెల్లడించింది. యాప్‌ నిర్వహణ, బెట్టింగ్‌ ప్యానళ్ల వ్యవహారంలో అతడి క్రియాశీల పాత్రపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అరెస్టు అనంతరం అభిషేక్‌ కుమార్‌ను సీబీఐ హైదరాబాద్‌లోని స్థానిక కోర్టులో హాజరుపరిచింది. అక్కడి నుంచి మూడు రోజుల ట్రాన్సిట్‌ రిమాండ్‌ పొందిన అధికారులు అతడిని రాయ్‌పూర్‌కు తరలించారు. అనంతరం రాయ్‌పూర్‌ కోర్టులో హాజరుపరచగా.. రెండు రోజుల పోలీస్‌ కస్టడీకి కోర్టు అనుమతించింది.మహదేవ్‌ యాప్‌ కేసుకు సంబంధించి ఛత్తీస్‌గఢ్‌లో నమోదైన 13 ఎఫ్‌ఐఆర్‌లు సీబీఐకి బదిలీ అయ్యాయి. 

ఈ కేసులో ఇప్పటివరకు సుమారు 100 మంది నిందితులపై 8 ఛార్జిషీట్లు దాఖలు చేసినట్లు సీబీఐ వెల్లడించింది.ఈ కేసుల్లో ప్యానల్‌ ఆపరేటర్లు, హవాలా నిర్వాహకులు, ప్రభుత్వ ఉద్యోగులు తదితరులపై కూడా కేసులు నమోదయ్యాయి. పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది.మహదేవ్‌ యాప్‌ ప్రధాన ప్రమోటర్లను భారత్‌కు రప్పించేందుకు సీబీఐ చర్యలు కొనసాగిస్తోంది. ఇప్పటివరకు 7 రెడ్‌ కార్నర్‌ నోటీసులు, 2 ఎక్స్‌ట్రడిషన్‌ ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు తెలిపారు. మరో ఇద్దరు నిందితులకు సంబంధించి అప్పగింత ప్రక్రియ కొనసాగుతోంది.మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ ద్వారా జరిగిన అక్రమ కార్యకలాపాలపై దర్యాప్తును కొనసాగిస్తున్న సీబీఐ.. ఈ వ్యవహారంలో భాగమైన వ్యక్తులతోపాటు అక్రమ బెట్టింగ్‌ ద్వారా వచ్చిన నేరపూరిత ఆస్తులను గుర్తించడంపైనా ప్రత్యేకంగా దృష్టి సారించింది.

 

 

[ Mahadev Betting App Scam, Online betting, Abhishek Kumar, CBI, Saurabh Chandrakar, Shubham Soni, Raipur Court, Chhattisgarh,Telugu One, Telugu News ]