TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆగమశాస్త్ర సంప్రదాయాలు పాటించాల్సిందే: ఆలయాల్లో అన్యమతస్థుల ప్రవేశంపై కోర్టు తీర్పు.!

Published on: Mon Nov 2, 2026 8:58AM

దేవాలయాల ప్రవేశాలు, ఆగమ శాస్త్ర సంప్రదాయాలకు సంబంధించి మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ వెలవరించిన తీర్పు పలు వివాదాలకు చెక్ పెట్టింది. హిందూ దేవాలయాలలో అన్యమతస్థుల ప్రవేశాలకు సంబంధించి  పాటించాల్సిన నిబంధనలను తేటతెల్లం చేసింది. అన్యమతస్తులు.. వారి హోదా, పదవి వంటి వాటితో సంబంధం లేకుండా.. ఆలయ ధ్వజ స్తంభం దాటి ముందుకు వెళ్లాలంటే విశ్వాస ప్రకటనపై సంతకం చేయాల్సిందే అని కుండబద్దలు కొట్టింది.   ఆలయ ప్రవేశ చట్టాలు,సంప్రదాయాలు కచ్చితంగా అమలు చేయాల్సిందేనని హైకోర్టు మధురై బెంచ్ విస్పష్ట తీర్పు ఇచ్చింది. 

గతంలో   దేశ ప్రధాని ఇందిరాగాంధీకి  పూరీ జగన్నాథ ఆలయ ద్వారాలు తెరుచుకోకపోవడానికి కారణం,  ఆమె పార్శీ మతస్తుడిని వివాహం చేసుకోవడమే. ఆగమశాస్త్రం ప్రకారం గుడిలోకి హిందూయేతరులకు ప్రవేశం లేదు. అందుకే దేశ ప్రధానిగా ఉండి కూడా ఇందిరా గాంధీ ఆ ఆగమశాస్త్ర నియమాలకు తలవంచారు.  
అయితే ఆ తరువాత కాలంలో తిరుమల, మధురై వంటి  ఆలయాలలో ప్రవేశాలకు సంబంధించి ఆగమశాస్త్ర విరుద్ధంగా పలు వివాదాలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మధురైకి చెందిన తంగం వెంకటేశ్ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం ((పిల్) విచారణ సందర్భంగా మద్రాసు హైకోర్టు మధురై బెంచ్ కీలక తీర్పు వెలువరించింది.  తమిళనాడులోని ఆగమ సంప్రదాయాలను అనుసరించే దేవాలయాల్లో అన్య మతస్థులకు ఆలయ ప్రవేశం లేదని కోర్టు విస్పష్టంగా పేర్కొంది. వారు ఆలయంలోకి ప్రవేశించాలంటే దేవుడిపై విశ్వాసం ప్రకటించాలనీ, దేవుడిపై నమ్మకం, గౌరవం ఉందని తెలుపుతూ అంగీకరపత్రంపై సంతకం పెట్టి తీరాలని కుండబద్దలు కొట్టింది.  ప్రతి ఆలయంలోనూ దీనికి సంబంధించిన బోర్డులను ప్రముఖంగా ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

మంత్రులు, ప్రజాప్రతినిధులు అయినంత మాత్రాన వారికి ఆలయ నిబంధనలను ఉల్లంఘించే అధికారం లేదని కోర్టు తన తీర్పులో విస్పష్టంగా పేర్కొంది. గతంలో కొన్ని దేవాలయాల్లో నిబంధనలకు విరుద్ధంగా కొందరు ప్రజాప్రతినిధులు ప్రవేశించడంపై వచ్చిన వివాదాలను న్యాయమూర్తులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. చట్టం ముందు అందరూ సమానులేనని, అధికారంలో ఉన్నారనే కారణంతో ఆగమ సంప్రదాయాలను ఉల్లంఘించడం కూడదని పేర్కొంది. 

అయితే ఈ తీర్పు అన్ని మతాల ప్రజలపై లేదా అన్ని ఆలయాలపై సంపూర్ణ నిషేధం విధిస్తుందని భావించరాదని కోర్టు స్పష్టం చేసింది. అయ్యప్ప స్వామి, షిర్డీ సాయిబాబా వంటి క్షేత్రాలకు అన్ని మతాల భక్తులు పెద్దఎత్తున వెళ్లే సంప్రదాయం ఉందనీ, విశ్వాస ప్రకటన నిబంధన ఆ ఆలయాలకు వర్తించదని స్పష్టం చేసింది.   ఆగమ శాస్త్ర నిబంధనలు పాటించే  ఆలయాల పరిధిలో  ఈ నియమాలు వర్తిస్తాయని తెలిపింది. ఆలయాల పవిత్రతను కాపాడే దిశగా మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఈ తాజా తీర్పు,  సంప్రదాయాలు, నిబంధనల అమలు విషయంలో అధికారులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని ఎత్తి చూపుతోంది. 

[Madras High Court Madhurai Bench On Temple Entry,  Tamil Nadu Temples Agama Rules, High Court Verdict, Temple Entry dDeclaration, Telugu One]