బొల్లారం ఆయుధాల చోరీలో మాజీ హవల్దార్ అరెస్ట్..!
Published on: Fri Sep 11, 2026 6:09PM
.webp)
నల్లమలలో సోదాలు.. కౌకూర్, యాప్రాల్, అచ్చంపేటలో ఆయుధాల కోసం గాలింపు..!
బొల్లారం ఆర్మీ హెడ్‌క్వార్ట ర్స్‌లోని ఆయుధాల భద్రతా గదుల నుంచి తుపాకులు, మందు గుండు సామగ్రి మాయ మైన కేసులో కీలక పరిణామం చోటుచేసు కుంది. ఈ కేసులో మాజీ ఆర్మీ హవల్దార్ ఉప్పుతోళ్ల మల్లేష్ అలియాస్ రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. బొల్లారం పోలీసులు, హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్, మల్కాజిగిరి కమిషనరేట్ ఎస్‌ఓటీ బృందాలు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టి మల్లేష్‌ను అదుపులోకి తీసుకున్నాయి. ఆగస్టు 30, 31 తేదీల మధ్య అర్ధరాత్రి బొల్లారంలోని 20వ బెటాలియన్, మద్రాస్ రెజిమెంట్ పరిధిలోని ఆయుధాల భద్రతా గదుల నుంచి తుపాకులు, మందుగుండు సామగ్రి చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు.
ఆగస్టు 31 తెల్లవారుజామున ఆయుధాలు కనిపించకపోవడాన్ని ఇన్‌చార్జి వినోద్‌కుమార్ నాయక్ గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బొల్లారం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చోరీకి గురైన ఆయుధాల జాబితా పోలీసులను ఆందోళనకు గురిచేసింది. మొదటి భవనం నుంచి ఏడు పిస్తోళ్లు, 13 మ్యాగజైన్లు, నాలుగు ఏకే-203 రైఫిళ్లు, 5.56 ఎంఎం క్యాలిబర్‌కు సంబంధించిన మందుగుండు సామగ్రితోపాటు మరికొన్ని ఆయుధాలు మాయమైనట్లు గుర్తించారు. రెండో భవనం నుంచి కూడా కొన్ని ఆయుధాలు, బుల్లెట్లు కనిపించకుండా పోయినట్లు పోలీసులు తెలిపారు.
ఇంత భారీగా ఆయుధాలు భద్రతా గదుల నుంచి ఎలా బయటకు వెళ్లాయన్నదానిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. తొలుత బయట వ్యక్తుల కంటే ఆయుధాల భద్రత, వినియోగం గురించి పూర్తి అవగాహన ఉన్న లోపలి వ్యక్తుల పాత్రపైనే అనుమానం వ్యక్తమైంది. ఆయుధాలను క్రమం తప్పకుండా వినియోగించే 16 మంది సిబ్బంది వివరాలను పరిశీలించడంతోపాటు సెలవులో ఉన్న 54 మంది సైనికుల కదలికలను కూడా పోలీసులు ఆరా తీశారు. సర్వీసు నుంచి బయటకు వెళ్లిన ఏడుగురు పెన్షన్ ఔట్ సిబ్బందిని విచారించారు. ఈ క్రమంలో ఎన్‌సీవో వినోద్‌కుమార్, బల్లి మధు సహా పలువురిని విచారించినప్పటికీ కీలక ఆధారాలు లభించలేదు.
సాంకేతిక ఆధారాలు, వేలిముద్రలు, డాగ్ స్క్వాడ్ సహాయంతో దర్యాప్తు కొనసాగించగా మాజీ హవల్దార్ ఉప్పుతోళ్ల మల్లేష్‌పై పోలీసుల అనుమానం బలపడింది. 37 ఏళ్ల మల్లేష్ 2010లో భారత సైన్యంలో చేరారు. 20వ బెటాలియన్, మద్రాస్ రెజిమెంట్‌లో సుమారు 16 ఏళ్లపాటు సేవలందించారు. ఈ ఏడాది జూన్ 30న సర్వీసు నుంచి రిటైర్ అయ్యారు. ముందస్తు రిటైర్మెంట్ కారణంగా అసంతృప్తితోనే ఆయుధాల చోరీకి పాల్పడి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. రెండు నెలల క్రితం సెలవుపై వచ్చిన మల్లేష్ హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నట్లు సమాచారం.
మల్లేష్ స్వస్థలమైన నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమల ప్రాంతంలోని ఉడుమిల్లలోని ఇంట్లోనూ పోలీసులు సోదాలు నిర్వహించారు. అక్కడ పలు మోడళ్ల తుపాకులు లభించినట్లు సమాచారం. వాటిలో బొల్లారం నుంచి చోరీకి గురైన ఆయుధాలు ఏవో గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు కౌకూర్, యాప్రాల్, అచ్చంపేట ప్రాంతాల్లోనూ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని దాచినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి.

అయితే ఈ ఆయుధాల చోరీ వెనుక మరేదైనా పెద్ద నెట్‌వర్క్ ఉందా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. చోరీ చేసిన ఆయుధాలను ఎక్కడికి తరలించారు? వాటిని ఎవరికి ఇవ్వాలనుకున్నారు? మల్లేష్‌కు మరెవరైనా సహకరించారా? ఆయుధాలకు డ్రగ్ మాఫియాతో ఏమైనా సంబంధం ఉందా? అనే కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మల్కాజిగిరి పోలీస్ జోన్, హైదరాబాద్ సిటీ పోలీస్ టాస్క్‌ఫోర్స్, మల్కాజిగిరి ఎస్‌ఓటీ, లా అండ్ ఆర్డర్ పోలీసులు, తెలంగాణ స్టేట్ ఇంటెలిజెన్స్ విభాగాలు సమన్వయంతో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ఆధారంగా మల్లేష్‌ను గుర్తించి సెప్టెంబర్ 11న అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఆయుధాల చోరీకి దారితీసిన పరిస్థితులు, చోరీ చేసిన ఆయుధాలను ఎక్కడెక్కడికి తరలించారు, ఈ వ్యవహారంలో ఇంకెవరైనా సహకరించారా అన్న విషయాలపై పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.
[ Madras Army Regiment, Weapons theft case, Bollaram, Retired Army Officer, Mahabub Nagar, Nagarkurnool, Crime news, Minister Rajnath Singh,Telugu One, Telugu News ]


