అమృత్ సర్ లో పట్టపగలే కాల్పుల కలకలం: సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ మ్యాడ్ సింధు హత్య.!
Published on: Sun Oct 4, 2026 7:37AM

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో పట్టపగలు జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, మేకప్ ఆర్టిస్ట్ మధుసూదన్ సంధు అలియాస్ మ్యాడ్ సంధు ను పట్టపగలు కాల్పులు జరిపి హత్య చేశారు. సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉంటూ లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్న మ్యాడ్ సంధు హత్య పంజాబ్ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
.webp)
శనివారం సాయంత్రం సమయంలో మ్యాడ్ సంధు తన కారును శుభ్రం చేయించుకునేందుకు లోహర్కా రోడ్‌లోని ఒక కార్ వాష్ షాప్‌కు వెళ్లారు. అదే సమయంలో మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆయనపై అతి సమీపం నుంచి విచక్షణారహితంగా కాల్పులు జరిపి క్షణాలలో పరారయ్యారు. దుండగుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి కుప్పకూలిన మ్యాడ్ సంధును వెంటనే స్థానికులు, కుటుంబ సభ్యులు సమీపంలోని ఓ ప్రైవెట్ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ మ్యాడ్ సంధు తుది శ్వాస విడిచారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి, అక్కడ లభించిన ఖాళీ బుల్లెట్ షెల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.

హత్యకు గల అసలు కారణాలు ఏమిటనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఘటనా స్థలానికి సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు, మృతుడి కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో మేకప్ ఆర్టిస్ట్రీకి సంబంధించి విభిన్నమైన కంటెంట్‌ను షేర్ చేస్తూ మంచి పాపులారిటీ తెచ్చుకున్న మ్యాడ్ సంధు, గతంలో తన వస్త్రధారణ, కొన్ని వీడియోల కారణంగా వివాదాలలో ఇరుక్కున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన ఈ హత్యకు పాత కక్షలు, వ్యక్తిగత వివాదాలు కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
[Madhusudan Sandhu, Mad Sandhu Murder, Amritsar Shooting, Punjab Crime, Social Media Influencer Murder, Telugu One]


