TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

లోకం మాధవి.. జనసేనకి మ‌రో త‌ల‌నొప్పి!

Published on: Thu Apr 9, 2026 9:18AM

లోకం మాధ‌వి మిరాకిల్ అక్ర‌మాల ప‌రిస్థితి ఏంటి?  ఆమె ప‌ద‌వికి గండం ఏర్ప‌డ‌నుందా? ఈసీ వ‌ర‌కూ చేరిన ఈ ఆరోప‌ణ‌ల ప్ర‌భావం ఎంత మేర‌కు ఉండొచ్చు? జ‌న‌సేన‌కు ఇది మ‌రో త‌ల‌నొప్పి కానుందా?  అన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాలలో జోరుగా సాగుతోంది.

ఔను నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం  మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశ మయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి   చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే..  ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్ప‌టికే అర‌వ‌శ్రీధ‌ర్  వ్య‌వ‌హారంతో సతమతమౌతున్న జనసేనకు ఇప్పుడు లోకం మాధవిపై వచ్చిన అవినీతి వ్యవహారాలు మరో తలపోటుగా పరిణమించాయని అంటున్నారు.  

జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి గెలిచారు.  ఆమెకు చెందిన మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ చుట్టూ ముసురుతున్న వివాదాలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ వ్యవహారం ఆమె పదవికి ఎసరుపెడుతుందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.  లోకం మాధవిపై ప్రధానంగా రెండు రకాల ఆరోపణలు వస్తున్నాయి. మొద‌టిది భూ ఆక్రమణలు.  భోగాపురం సమీపంలో మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సంస్థ కోసం కేటాయించిన భూముల్లో అక్రమాలకు పాల్పడ్డారని, ప్రభుత్వ భూములను నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్నారని ఫిర్యాదులు అందాయి. ఇక రెండోది ఎన్నికల అఫిడవిట్ వివాదం. ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తులు, కంపెనీ లావాదేవీలు, బకాయిల వివరాలను తప్పుగా లేదా అసంపూర్తిగా చూపించారనేది మ‌రో ఆరోప‌ణ‌. 

  వైసీపీ నాయకులు, కొందరు సామాజిక కార్యకర్తలు ఆమె అఫిడవిట్‌లో సమాచారాన్ని దాచారంటూ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.  అఫిడవిట్‌లో ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.  

ఇంత‌కీ ఆమె పదవికి గండం ఉందా? అంటే..  ప్రస్తుతానికి లోకంమాధవి పదవికి వచ్చిన తక్షణ ముప్పు ఏమీ లేదంటున్నారు.  లోకం మాధవిపై వచ్చిన ఆరోపణలపై  అంతర్గత విచారణ జరిగే అవకాశం ఉందంటున్నారు. ఇక పోతే మాధవి ఈ ఆరోపణలను నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నారు. ఇవి రాజకీయ కక్ష సాధింపుతో చేస్తున్న ఆరోపణలనీ,  తన సంస్థలన్నీ నిబంధనల ప్రకారమే నడుస్తున్నాయని ఆమె చెబుతున్నారు. 

 ఇక ఈ విషయంలో   జనసేన పార్టీకి మాత్రం ఒకింత  ఇబ్బందికరమైన పరిణామంగానే చెప్పాలి.  పవన్ కళ్యాణ్ ఎప్పుడూ అవినీతి రహిత రాజకీయాలు అని చెబుతుంటారు. అటువంటిది ఆయన పార్టీ ఎమ్మెల్యేపై ఇలాంటి ఆరోపణలు రావడం ప్రత్యర్థులకు.. మ‌రీ ముఖ్యంగా వైసీపీకి ఒక విమర్శనాస్త్రంగా మారుతుంది. ఒకవేళ విచారణలో ప్రాథమిక ఆధారాలు దొరికితే, పార్టీ పరంగా ఆమెపై చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ పై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.  గతంలో అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ పదవులను కోల్పోయిన ఉదాహరణలు ఉన్నాయి.

కానీ, మిరాకిల్ సంస్థల వ్యవహారం కార్పొరేట్ లావాదేవీలతో ముడిపడి ఉన్నందున, అందులోని సాంకేతిక అంశాలను విశ్లేషించడానికి సమయం పడుతుంది. ఈ వివాదం ఆమె రాజకీయ భవిష్యత్తును దెబ్బతీస్తుందా లేదా? అనేది రాబోయే విజిలెన్స్ నివేదికలు, కోర్టు విచారణలపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇది లోకం మాధవికి మరియు జనసేన పార్టీకి ఒక రాజకీయ సవాల్ లాంటిదేనంటున్నారు పరిశీలకులు.