రైల్వేలో సరికొత్త రికార్డ్: దేశంలోనే తొలి ఎల్ఎన్‌జీ రైలు ప్రారంభం.!
Published on: Sun Sep 27, 2026 5:09PM

భారతీయ రైల్వే రంగంలో సరికొత్త చరిత్రకు తెరలేచింది. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా దేశంలోనే మొట్టమొదటి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG) రైలును కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్‌లోని సబర్మతి రైల్వే స్టేషన్‌లో పచ్చజెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. ఆధునిక సాంకేతికతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన ఈ సరికొత్త ఇంధన రైలుతో ప్రపంచంలోనే ఈ టెక్నాలజీ కలిగిన అత్యున్నత నాలుగు దేశాల సరసన భారత్ సగర్వంగా నిలిచింది. ఈ ప్రతిష్టాత్మక ప్రారంభోత్సవ వేడుకలో భాగంగా సుమారు రూ. 1,500 కోట్ల విలువైన పలు కీలక రైల్వే అభివృద్ధి ప్రాజెక్టులను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విశేష సభలో అమిత్ షా మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ రైల్వే వ్యవస్థ సమూలంగా మారిపోయిందని కొనియాడారు. గత 12 ఏళ్ల పాలనా కాలంలో ప్రధాని మోదీపై ఎ ఒక్కరూ అవినీతి ఆరోపణలు చేయలేకపోయారని, అభివృద్ధి శైలి దేశానికి దిశానిర్దేశం చేస్తోందని స్పష్టం చేశారు.

ఈ సరికొత్త ఎల్‌ఎన్‌జీ రైలు అనేక ప్రత్యేకతలను సంతరించుకుంది. ప్రధానంగా ఈ ప్రత్యేక రైలు ఎల్‌ఎన్‌జీ మరియు డీజిల్ రెండింటిపై నడిచే విధంగా రూపొందించబడింది. దీనివల్ల డీజిల్ వినియోగం సుమారు 40 శాతం వరకు తగ్గుతుందని అధికారులు వెల్లడించారు. పర్యావరణానికి ముప్పుగా మారే ఉద్గారాలను తగ్గించడంతో పాటు, భారీగా ఇంధన ఖర్చులను ఆదా చేయడమే లక్ష్యంగా ఈ వినూత్న ఎల్‌ఎన్‌జీ రైలును పట్టాలెక్కించారు. కేవలం ఇంధన ఆదానే కాకుండా, ముంబయి నుంచి వడోదర వరకు చేపట్టిన మొట్టమొదటి లాంగ్ డబుల్ స్టాక్ కంటైనర్ రైలు ట్రయల్ రన్ కూడా విజయవంతంగా పూర్తయినట్లు హోంమంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా రవాణా రంగాన్ని పరుగులు పెట్టించేందుకు మొత్తం 11 వేల కిలోమీటర్ల రైలు కారిడార్‌ను నాలుగు ట్రాక్‌ల అత్యాధునిక నెట్‌వర్క్‌గా మారుస్తున్నట్లు ఆయన సభముఖంగా ప్రకటించారు.
2014లో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో రవాణా రంగ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ప్రత్యేక సరకు రవాణా కారిడార్, రాపిడ్ రైల్ సిస్టమ్ మరియు అత్యాధునిక హంగులతో కూడిన రైల్వే స్టేషన్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టి ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తన సుదీర్ఘ పాలనలో కుంభకోణాలు, అవినీతి తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని అమిత్ షా తీవ్రస్థాయిలో విమర్శించారు. అర్థరహిత విమర్శలు మాని, అభివృద్ధి పనులపై గణాంకాలతో చర్చకు రావాలని హస్తం పార్టీకి ఆయన గట్టి సవాల్ విసిరారు. అత్యాధునిక హైడ్రోజన్ సాంకేతికత, ఎల్‌ఎన్‌జీ రైళ్ల ప్రవేశం భవిష్యత్తులో భారతీయ రైల్వేను గ్రీనెస్ట్ అండ్ క్లీనెస్ట్ నెట్‌వర్క్‌గా నిలపడంలో కీలకపాత్ర పోషిస్తాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ సరికొత్త రైల్వే ప్రాజెక్టులు గుజరాత్ ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా ప్రయాణికులకు, సరకు రవాణా రంగానికి ఎంతో ప్రయోజనకరంగా మారనున్నాయి.
[ LNG train, Amit Shah, Sabarmati railway station, India first LNG train, Gujarat rail projects, Indian Railways, PM MODI, Telugu One, Telugu News ]


