ఆ రోజుల్లోనే రెబెల్.. శ్రీరామానుజుల జీవిత చరిత్ర ఇదే..
Published on: Wed Feb 9, 2022 4:49PM
ఇప్పుడు దారులన్నీ ముచ్చింతల్ వైపు బారులు తీరుతున్నాయి. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వైభవోపెతంగా నిర్వహిస్తున్న శ్రీరామానుజ ఆచార్య సహస్రాబ్ది వేడుకలను తిలకించేందుకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తున్నారు. ఈ వేడుకలలో భాగంగా నిర్మించిన దివ్య, భవ్య ఆధ్యాత్మిక సమతాకేంద్రం ఆస్తిక, నాస్తికపరులు అందరినీ ఆకర్షిస్తోంది. సమతా కేంద్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన 216 అడుగుల ‘సమతామూర్తి’ రామానుజాచార్యుల భారీ పంచలోహ విగ్రహం ఆధ్యాత్మిక భారతీయ సమాజాన్ని తమవైపునకు తిప్పుకుంటోంది.
ప్రధాని నరేంద్ర మోడీ మొదలు అనేక మంది ప్రముఖులు, సమతా మూర్తి శ్రీ రామానుజుల గురించి ఎన్నో విషయాలు అవిష్కరించారు. అయితే, దురదృష్టవశాత్తు... భారతీయ సమాజ నిర్మాణంలో స్పూర్తివంతమైన పాత్రను పోషించిన మహనీయులను మన చరిత్ర మరిచి పోయింది. అందువలన, మన తరానికి ఆ మహనీయుని గురించి, తెలుసుకునే అవకాశం అంతగా లేక పోయింది. అయినా, ఆలాంటి ఎందరో మహనీయులు.. శతాబ్దాలు గడిచిన ఇంకా ఈనాటికీ స్పూర్తి ప్రదాతలుగా నిలుస్తున్నారు. అలాంటి మహనీయుల్లో శంకరాచార్య, రామానుజాచార్య వంటి వారెందరో ..ఉన్నారు.
శంకరాచార్య, రామానుజాచార్య భిన్న దారుల్లో నడిచినా ఆ ఇద్దరి గమ్యం ఒక్కటే..కాలమే దూరం. శంకరాచార్య నిర్యాణం చెందిన 300 సంవత్సరాలకు శ్రీ రామానుజాచార్య క్రీ.శ. 11వ శతాబ్దిలో జన్మించారు. శంకరాచార్య జ్ఞాన మార్గాన పయనిస్తే, రామానుజాచార్య భక్తి మార్గంలో పయనించారు. ఆయా కాలాలలో ఆ ఇద్దరు మహనీయులు, తత్కాల సమాజంలో శిఖర సమానులుగా నిలిచారు.
రామానుజుల జీవితంలోకి తొంగి చూస్తే వెయ్యేళ్ల ముందుచూపు కనిపిస్తుంది. రామానుజాచార్య తమిళనాడులోని పెరుబుఘురం (భూత్పూర్)లో జన్మిచారు. తండ్రి అసురి కేశవ్, తల్లి కాంతిమతి. ఆమె శ్రీశైల పూర్వ స్వామీజీ సోదరి, యమునాచార్య మనవురాలు. అప్పటి ఆచార వ్యవహారాలు, సంప్రదాయాల ప్రకారం రామానుజుల వారికి 8వ ఏట ఉపనయనం అయింది. అప్పుడే విద్యాబోధన మొదలైంది. తొలి గురువు, తండ్రి కేశవ్ దీక్షితులు. చిన్న తనం నుంచే రామానుజులవారు, ఏక సంగ్రాహి. ఏ విషయం అయినా ఒకసారి వింటే చాలు.. మళ్ళీ వినవలసిన అవసరం ఉండేది కాదు.
రామానుజులకు చిన్న తనంలోనే వివాహం అయింది. వివాహం అయిన కొద్దిరోజులకే తండ్రి మరణించడంతో వారి సంసారం పెరుబుఘురం నుంచి కంచికి చేరింది. రామానుజుల వారి కుటుంబం అక్కడే స్థిరపడింది. అక్కడే రామానుజుల జీవితం మలుపు తీసుకుంది. కంచి శంకరాచార్య శిష్యులలో యాదవ ప్రకాశ ప్రధముడు. యాదవ ప్రకాశ దగ్గర రామానుజులు శిష్యరికం చేశారు. అయితే, గురు శిష్యుల మధ్య విబేధాలు రావడంతో రామానుజులు, కొద్దికాలానికే కొత్త బాటలో ప్రస్థానం ప్రారంభించారు.
యాదవ ప్రకాశ దృష్టిలో భగవంతుడు, సంపూర్ణ లోప రహితుడు.. నిరాకార నిర్గుణ స్వరూపుడు.. బ్రహ్మ మినహా జీవ, నిర్జీవ సృష్టి మొత్తం మిధ్య. యాదవ ప్రకాశ దగ్గర వేదాలు, ఉపనిషతులు అభ్యసిస్తున్న సమయంలోనే రామానుజులు తన గురువు విశ్వాసాలతో విభేదించారు. చివరకు గురువు ఆగ్రహానికి గురై ఇంటికి చేరారు. అప్పటి నుంచి రామానుజులు స్వీయ విద్యాభ్యాసం సాగించారు. రామానుజుల జీవితంలో ఇదొక ఘట్టం అయితే, వారు కాంచీపురం స్వామిని కలిసిన తదుపరి ఘట్టమే ఈ రోజుకు కూడా వారిని మన మధ్య సమతామూర్తి (స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ) గా నిలిపింది.
కాంచీపురం స్వామి శూద్రుడు. తల్లి ‘శబ్రి’ (అంటరాని కులం).. అయినా కాంచీపురం స్వామి వైష్ణవ సంప్రదాయంలో విశేష స్థానం సంపాదించారు. వైష్ణవ సమాజం ప్రధాన ఆచార్యులు యమునాచార్య ప్రధాన శిష్యులు ఐదుగురిలో ఒకరిగా ప్రసిద్ధి చెందారు. ఒక సందర్భంలో కాంచీపురం స్వామీ కాళ్లు పట్టేందుకు రామానుజులను అనుమతించలేదు. బ్రాహ్మణులు శూద్రుల కాళ్ళు పట్టరాదని, కాంచీపురం స్వామి అభ్యంతరం చెప్పారు. ఈ సందర్భంగా రామానుజులు ‘యజ్ఞోపవీతం ధరించినంత మాత్రానే ఎవరూ బ్రాహ్మణులు కారు. హరిని పూజించే వారే బ్రాహ్మణులు అంటూ.. ఆనాటి వ్యవస్థలో ఒక విప్లవానికి శ్రీకారం చుట్టారు. అక్కడి నుంచి రామానుజులు, కాంచీపురం స్వామి మధ్య బంధం బలపడింది.
రామానుజాచార్య పాండిత్య ప్రతిభ వైష్ణవ సంప్రదాయ ప్రధాన ఆచార్యులు యమునాచార్యను చేరింది. తమ తదనంతరం రామానుజులు వైష్ణవ సంప్రదాయ ప్రధాన పూజారి కావాలని ఆకాంక్షించారు. చివరకు రామానుజులు యమునాచార్య ఆశించిన విధంగా వైష్ణవ సంప్రదాయ ప్రధాన పూజారిగా బాధ్యతలు స్వీకరించారు. యమునాచార్య అప్పగించిన మూడు బాధ్యతలు ( 1.వేదాంత మూలాలపై వ్యాఖ్యానం రాయడం.. 2.తమిళ భాషలో ఆళ్వార్ల కీర్తనలు సంకలనం చేసి ఐదవ వేదంగా ప్రచారం చేయడం.. 3.విష్ణు పురాణాన్ని స్వరభరితం చేయడం) స్వీకరించారు. ఆ తర్వాత సన్యాసిగా మారారు. కంచి వదిలి శ్రీరంగం చేరుకొని, యమునాచార్య వదిలి వెళ్ళిన గురు స్థానాన్ని స్వీకరించారు. వైష్ణవ సంప్రదాయాన్ని సంరక్షించడంతో పాటు, సమాజంలోని అన్ని వర్గాలను దగ్గర చేసి సమతామూర్తిగా నిలిచారు.. వెయ్యేళ్ల తర్వాత ఇదిగో ఇప్పుడిలా విగ్రహ రూపంలో సమతాస్పూర్తిని శాశ్వతంగా చాటుతున్నారు.


