5 నిమిషాల్లో 80 మంది ఉద్యోగాలు హుష్ కాకీ.!
Published on: Sat Sep 19, 2026 3:34PM

కార్పొరేట్ రంగంలో ఉద్యోగుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతున్న తీరుకు మరో నిలువెత్తు నిదర్శనమీ సంఘటన. అమెరికాకు చెందిన ఒక ప్రముఖ ఫైనాన్షియల్ సంస్థ భారత్‌లో పనిచేస్తున్న కస్టమర్ సర్వీస్ టీమ్‌పై వేటు వేసింది. సాయంత్రం వేళ ప్రశాంతంగా తమ షిఫ్ట్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు హఠాత్తుగా ఒక మీటింగ్ ఇన్విటేషన్ వచ్చింది. ఆన్-లైన్‌లో లాగిన్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఆ ఉద్యోగుల జీవితాలు పూర్తిగా తలకిందులైపోయాయి. రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో అత్యవసరంగా పంపిన ఆ గూగుల్ మీట్ లింక్ ద్వారా 80 మంది భారతీయలను ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేశారు. కేవలం ఐదు నిమిషాల వ్యవధిలో సాగిన ఈ వర్చువల్ సమావేశంలో.. కస్టమర్ సపోర్ట్ టీమ్ మొత్తాన్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు యాజమాన్యం బాంబు పేల్చింది. ఈ హఠాత్ పరిణామంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైన ఉద్యోగులు, తమ భవిష్యత్తు ఏమిటో ఆందోళనలో ఉన్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఆ టీమ్‌లో పనిచేసిన బాధితుడు సోషల్ మీడియా వేదిక అయిన రెడ్డిట్ ద్వారా పంచుకున్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికాలోని ఒక ప్రముఖ బ్యాంక్‌కు చెందిన సపోర్ట్ కార్యకలాపాలను భారత్ నుంచి నిర్వహిస్తున్నారు. అయితే.. సాయంత్రం 6:30 గంటలకు షిఫ్ట్ ప్రారంభించి పనిలో నిమగ్నమైన తమకు, రాత్రి వేళ ఒక్కసారిగా ఈ షాకింగ్ వార్త తెలిందని పేర్కొన్నారు. కేవలం 5 నిమిషాల వ్యవధి కలిగిన ఆ గూగుల్ మీట్ కాల్ ఒక్కటే ఏకంగా 80 కుటుంబాలను రోడ్డున పడేసిందన్నారు. రాత్రింబవళ్లు తేడా లేకుండా కంపెనీ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తే.. చివరకు కనీస ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా ఇలా అర్ధంతరంగా ఉద్వాసన పలకడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశాడా బాధితుడు.
.webp)
ఉన్నపళంగా ఉద్యోగం కోల్పోవడంతో ఇప్పుడు మరో ఉద్యోగం ఎలా వెతుక్కోవాలో పాలుపోవడం లేదని, ఈ క్లిష్ట పరిస్థితి ఎవరికీ రాకూడదని బాధితులు వాపోతున్నారు. అసలు అంతమందిని ఒక్కసారిగా తొలగించడానికి కారణం ఏమిటనే దానిపై కూడా కంపెనీ వివరణ ఇవ్వలేదు. ఇండియన్ టీమ్ నుంచి తమకు ఆశించిన స్థాయిలో అవుట్‌పుట్ రావడం లేదని కంపెనీ భావించి ఈ వేటు వేసిందని అంటున్నారు. అమెరికాలోని ప్రధాన టీమ్‌తో పోల్చుకుంటూ మన ఉద్యోగుల పనితీరును తక్కువ చేసి చూపడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు.
అయితే ఈ లేఆఫ్స్ వివాదంపై సంబంధిత అమెరికన్ సంస్థ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగుల తొలగింపునకు అనుసరిస్తున్న ఇటువంటి క్రూరమైన పద్ధతులు, మానవతా విలువలకు తిలోదకాలు ఇస్తున్న తీరుపై ప్రస్తుతం సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
[Layoffs, Indian Customer Service Team, 80 Employees Laid Off, Five Minute Google Meet Call, Corporate Job Cuts]


