యోగి సర్కార్ @ 10 ఇయర్స్: బుల్ డోజర్, లా అండ్ ఆర్డర్, అటాచ్ మెంట్లు.!
Published on: Fri Oct 30, 2026 3:07PM

భారతీయ రాజకీయాలు, పాలనా పరమైన మార్పులలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం దేశవ్యాప్తంగా ప్రత్యేక చర్చకు కేంద్ర బిందువుగా నిలుస్తూ వస్తోంది. ఒక రాష్ట్రంలో అధికార మార్పు జరిగినప్పుడు అక్కడి శాంతిభద్రతల యంత్రాంగం ఏ విధంగా పునర్నిర్మితమౌతుంది. పాలనా విధానాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయి అనేదానికి గత పదేళ్ల యూపీ ప్రయాణం ఒక లైవ్ ఎగ్జాంపుల్ గా నిలుస్తుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం దశాబ్దం కిందట అధికారంలోకి వచ్చిన నాటి నుంచి లా అండ్ ఆర్డర్‌ను ప్రాధాన్య అంశంగా మలుచుకుంటూ ముందుకు సాగింది. సమాజంలో పాతుకుపోయిన మాఫియా సామ్రాజ్యాలు, గ్యాంగ్‌స్టర్ నెట్‌వర్క్‌లు, వ్యవస్థీకృత నేరాల మూలాలను కదిలించడమే లక్ష్యంగా ప్రభుత్వం కఠిన చర్యలు అమలు చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో అనేక సాహసోపేత నిర్ణయాలు, వివాదాస్పద పరిణామాలు కూడా చోటుచేసుకున్నాయి.
సరిగ్గా ఇదే నేపథ్యంలో, సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత, ప్రముఖ రాజకీయ నాయకుడు అజమ్ ఖాన్‌కు చెందిన మౌలానా మహమ్మద్ అలీ జౌహర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న రాంపూర్‌లోని జౌహర్ యూనివర్సిటీకి సంబంధించిన పదకొండొందల డైబ్భై కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఎఈడీ అటాచ్ చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఇది కేవలం ఒక విద్యాసంస్థకు, ఒక వ్యక్తికి సంబంధించిన ఆర్థిక పరమైన ఆరోపణల కేసు మాత్రమే కాదనీ, గడచిన పదేళ్లుగా రాష్ట్రంలో నడుస్తున్న ఒక ప్రత్యేక పాలనా విధానానికి, దాని చుట్టూ అల్లుకున్న రాజకీయ ప్రశ్నలకు ప్రతీకగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర చరిత్రను పరిశీలిస్తే, నేరం, రాజకీయం రాష్ట్రంలో ఒకదానితో ఒకటి విడదీయరాని విధంగా కలిసిపోయాయనే విమర్శలు బలంగా ఉన్నాయి. గతంలో, అంటే తొంభై దశకంలో, రెండు వేల ప్రారంభ సంవత్సరాల్లో రాష్ట్రంలో వరుస గ్యాంగ్వార్లు, భూ ఆక్రమణలు, ప్రభుత్వ టెండర్లలో కుట్రలు, అక్రమ నిర్మాణాలు సర్వసాధారణంగా జరిగేవని ప్రజలు, నిపుణులు తరచూ ఆరోపిస్తుండేవారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తులకు రాజకీయాల్లో పెద్దపీట వేయడం జరుగుతోందనే ఆరోపణలు ప్రతిపక్షాల నుంచి, ప్రముఖ మీడియా సంస్థల నుంచి గట్టిగా వినిపించేవి.
అయితే, 2017 మార్చి 19వ తేదీన యోగి ఆదిత్యనాథ్ యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచే రాష్ట్రంలో ఈ రాజకీయ, సామాజిక సమీకరణాలు వేగంగా మారుతూ వచ్చాయి. నూతన ప్రభుత్వం కొద్ది రోజుల్లోనే శాంతిభద్రతల పరిరక్షణే తమ ప్రథమ కర్తవ్యమని ప్రకటించడమే కాకుండా, ఆచరణలోనూ దానిని కఠినంగా అమలు చేయడం ప్రారంభించింది. సంఘటిత నేరాలకు పాల్పడే ముఠాలు, గ్యాంగ్స్టర్లు, ఎలాంటి భయం లేకుండా చట్టాన్ని ఉల్లంఘించే వ్యక్తులపై పోలీసు యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. నేర మార్గాల ద్వారా అక్రమంగా సముపార్జించిన ఆస్తులను గుర్తించి వాటిని జప్తు చేయడం, చట్టవిరుద్ధంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేయడం వంటి చర్యలుజోరందుకున్నాయి.
ఈ పదేళ్ల కాలంలో ఈ రకమైన చర్యలకు ప్రతీకగా బుల్డోజర్ యాక్షన్ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ బుల్డోజర్ సంస్కృతి, అక్రమ ఆస్తుల కూల్చివేతల ప్రక్రియ ప్రజల్లో భిన్నమైన స్పందనలను తెచ్చిపెట్టింది. ప్రభుత్వ చర్యలను సమర్థించే ఒక వర్గం ప్రజలు ఇది కఠినమైన, సమర్థవంతమైన పాలనకు సంకేతంగా అభివర్ణించగా, మరికొన్ని వర్గాలు, పౌరహక్కుల సంఘాలు ఇవి సరైన న్యాయపరమైన ప్రక్రియను అతిక్రమించి చేపట్టిన చర్యలుగా విమర్శించాయి. అయినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వెనకడుగువైయకుండా నేరాలు, నేరస్తులపై జీరో టాలరెన్స్ విధానాన్ని తీవ్రతరం చేసింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో జరిగిన వివిధ పోలీసు ఎన్కౌంటర్లు, భారీ అరెస్టులు, ఆస్తుల జప్తులకు సంబంధించి ప్రభుత్వ వర్గాలు అధికారిక గణాంకాలను విడుదల చేశాయి. జూలై 2025లో వెలువడిన పోలీసు శాఖ గణాంకాల ప్రకారం, 2017 నుంచి సుమారు 14,973 ఎన్కౌంటర్ ఆపరేషన్లు జరిగాయని, వీటి ద్వారా మొత్తం 30 వేల 694 మంది నిందితులు అరెస్టయ్యారని, ఈ ఎదురుకాల్పుల్లో 238 మంది నేరస్థులు ప్రాణాలు కోల్పోయారని వెల్లడైంది. అలాగే మార్చి 2025 నాటికి రాష్ట్రంలో ఆర్గనైజ్డ్ క్రైమ్‌కు పాల్పడిన వ్యక్తుల నుంచి సుమారు 14 వేల 200 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఆస్తులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం ఈ కఠిన చర్యల ఫలితంగా రాష్ట్రంలో నేరాల రేటు గణనీయంగా తగ్గిపోయింది.
2016వ సంవత్సరంతో పోల్చి చూస్తే మార్చి 2025 నాటికి రాష్ట్రంలో దోపిడీ కేసులు 84.41 మేరకు తగ్గాయి. అలాగే సాధారణ దొంగతనాల కేసులు 77.43 శాతం తగ్గుముఖం పట్టాయి. ఇవి ప్రభుత్వం
అధికారికంగా విడుదల చేసిన గణాంకాలు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2023 నివేదిక ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో లక్ష జనాభాకు దాదాపు 335.3 కాగ్నిజబుల్ నేరాలు నమోదయ్యాయని, ఇది దేశంలోని జాతీయ సగటు 448.3తో పోలిస్తే చాలా తక్కువ. మహిళల భద్రతను కాపాడే దిశగా ప్రభుత్వం యాంటీ రోమియో స్క్వాడ్ల ఏర్పాటు, మిషన్ శక్తి కార్యక్రమం, మహిళా సహాయ కేంద్రాలు, క్షేత్రస్థాయిలో మహిళా పోలీసుల నియామకం వంటి అనేక చర్యలను విస్తృతం చేసింది. పోలీసు శాఖలో కమిషనరేట్ వ్యవస్థను బలోపేతం చేయడం, అత్యాధునిక సైబర్ క్రైమ్ యూనిట్లను ఏర్పాటు చేయడం, అత్యవసర సమయాల్లో వేగంగా స్పందించేలా సాంకేతిక ఆధారిత పోలీసింగ్ విధానాన్ని తీసుకురావడం వంటి సంస్కరణలు రాష్ట్రంలో శాంతిభద్రతల రూపురేకలను మార్చేశాయని ప్రభుత్వం చెబుతోంది. ఇలాంటి అనేక పరిణామాల నడుమ వెలుగులోకి వచ్చిన అత్యంత వివాదాస్పదమైన, సంచలనాత్మకమైన తాజా అధ్యాయమే రాంపూర్‌లోని మహమ్మద్ అలీ జౌహర్ యూనివర్సిటీకి సంబంధించిన ఈడీ దర్యాప్తు, ఆస్తుల అటాచ్మెంట్. సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు అజమ్ ఖాన్ వ్యవస్థాపకుడిగా వ్యవహరించి, నియంత్రిస్తున్న మౌలానా మహమ్మద్ అలీ జౌహర్ ట్రస్ట్ ద్వారా ఈ భారీ విశ్వవిద్యాలయం నిర్వహించబడుతోంది. ఈ యూనివర్సిటీకి చెందిన విస్తారమైన భూములు, అత్యాధునిక భవనాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రాథమికంగా 1 వేల 170 కోట్ల రూపాయలుగా విలువగట్టి అటాచ్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది.
ఈ యూనివర్సిటీ నిర్మాణ ప్రక్రియలో వెచ్చించిన భారీ నిధులకు సంబంధించి 426.46 కోట్లకు ఎలాంటి చట్టబద్ధమైన ఆధారాలు, స్పష్టమైన రికార్డులు లేవని ఈడీ గట్టిగా ఆరోపిస్తోంది. మొత్తం నిర్మాణ వ్యయంలో రూ. 72.63 కోట్లకు మాత్రమే సరైన చట్టబద్ధమైన మూలాలు, లెక్కలు ఉన్నాయని, మిగతా నిధులన్నీ అక్రమ మార్గాల ద్వారా మళ్లించబడ్డాయని దర్యాప్తు సంస్థ తన ప్రాథమిక నివేదికలో పేర్కొంది. ప్రజా ప్రయోజనాల నిమిత్తం కేటాయించాల్సిన ప్రభుత్వ నిధులు, సామగ్రిని ఇష్టానుసారంగా ఈ విశ్వవిద్యాలయ నిర్మాణానికి మళ్లించారనేది దర్యాప్తు వాదన. ఈడీ దర్యాప్తులో వెలుగు చూసిన మరిన్ని సంచలనాత్మక వివరాల ప్రకారం, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ చేపట్టిన కొన్ని అధికారిక నిర్మాణ ఒప్పందాల విలువలో దాదాపు 30 నుంచి 40 శాతం వరకు నిధులను లేదా నిర్మాణ సామగ్రిని ఈ యూనివర్సిటీ పనులకు అక్రమంగా మళ్లించారు. ఇది సుమారు 186 కోట్ల వరకూ ఉంటుందని అంటున్నారు.
అంతేకాకుండా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి 6.6 కోట్ల విలువైన పనులను నేరుగా ఈ క్యాంపస్ లోపల నిర్వహించారని దర్యాప్తులో తేలింది. మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మంజూరైన పండాల్ నిర్మాణం, ఓబీసీ బాలుర వసతి గృహం, అలాగే ఆసుపత్రి బ్లాక్ వంటి నిర్మాణాల కోసం ప్రభుత్వం రూ. 23.41 కోట్లు కేటాయించగా, ఆ తర్వాత ఆ పండాల్స్ వినియోగానికి సంబంధించిన నిబంధనలను, యాజమాన్య హక్కులను అక్రమంగా మార్చుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇవే కాకుండా, ఎనిమీ ప్రాపర్టీ కిందకు వచ్చే సుమారు 45 ప్లాట్లు, దాదాపు 34 ఎకరాల భూమిని ఈ విశ్వవిద్యాలయం కోసం నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమించుకున్నారంటూ జిల్లా పరిపాలన యంత్రాంగం అందించిన నివేదికలను కూడా ఈడీ తన ఎఫ్ఐఆర్ లో ప్రధానంగా ప్రస్తావించింది. ఈ విస్తృతమైన మనీ లాండరింగ్ దర్యాప్తు కేవలం ఒక్కరితో ఆగిపోకుండా, మొత్తం 26 వేర్వేరు ఎఫ్ఐఆర్ల ఆధారంగా ప్రారంభమైందని ఈడీ స్పష్టం చేసింది. స్థానిక రైతుల నుంచి వారి జీవనాధారమైన వ్యవసాయ భూములను బలవంతంగా, బెదిరింపుల ద్వారా ఈ యూనివర్సిటీ కోసం లాక్కున్నారనే ఆరోపణలు ఆ ఎఫ్ఐఆర్లలో స్పష్టంగా నమోదు అయ్యాయి. కేవలం ఈ ఒక్క కేసే కాకుండా, అజమ్ ఖాన్, ఆయనకు సన్నిహితంగా ఉండే మరికొందరిపై నమోదైన మరో 28 ఎఫ్ఐఆర్లపై కూడా తాము విచారణ జరుపుతున్నట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి.
ఆర్థికపరమైన అక్రమాలు, నిధుల గోల్‌మాల్‌కు సంబంధించిన పక్కా సమాచారాన్ని, డాక్యుమెంట్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఎప్పటికప్పుడు ఉత్తరప్రదేశ్ పోలీసు శాఖకు అందించడం జరిగిందని, దాని ఆధారంగానే రాష్ట్ర స్థాయిలో మరిన్ని చట్టపరమైన చర్యలు వేగవంతం అయ్యాయనీ ఈడీ పేర్కొంది. ఈ మొత్తం పరిణామాలు రాజకీయ, సామాజిక, మీడియా వర్గాల్లో పూర్తిగా భిన్నమైన కోణాల్లో విశ్లేషణలు వెలువడ్డాయి. ఇది ఒక మాఫియా రాజ్యానికి పాడిన చరమగీతంగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గత ప్రభుత్వాల హయాంలో పదవులను అడ్డం పెట్టుకుని, నేర మార్గాల ద్వారా అక్రమంగా సంపాదించిన ఆస్తులు, ప్రజాధనాన్ని దోచుకున్న విధానాలు ఇప్పుడు చట్టం ముందు తలవంచాల్సి వచ్చిందని అంటున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేసిన ఎన్కౌంటర్లు, ఆస్తుల జప్తులు, చట్టవిరుద్ధ కట్టడాల కూల్చివేతలు సమాజంలో శాంతిభద్రతలను నెలకొల్పడంలో, ప్రజల్లో భయాన్ని తొలగించడంలో కీలక పాత్ర పోషించాయని చ. జీరో టాలరెన్స్ విధానం కారణంగానే నేరస్థులు తలదాచుకోవడానికి కూడా వీలు లేని వాతావరణం ఏర్పడిందని ప్రచారం చేస్తున్నాయి. మరోవైపు, ప్రతిపక్ష పార్టీలు, పౌరహక్కుల సంఘాల నుంచి దీనిపై విరుద్ధమైన వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ చర్యలు, ఈడీ దర్యాప్తులు, ఎన్కౌంటర్లు, కూల్చివేతలు అన్నీ కూడా పారదర్శకమైన న్యాయ ప్రక్రియను సరిగ్గా పాటిచడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. . పోలీసులు, దర్యాప్తు సంస్థలు చూపించే గణాంకాలు నేరాల నియంత్రణను సూచించవచ్చని, కానీ ఏ ఒక్క కేసైనా సరే చట్టబద్ధమైన విచారణకు లోబడి, నిందితులకు తమ వాదన వినిపించే అవకాశం దక్కాలని విపక్షాలు అంటున్నాయి. జౌహర్ యూనివర్సిటీ కేసులోనూ ఈడీ అటాచ్మెంట్లపై ప్రతిపక్షాలు ఇదే వాదనను వినిపిస్తున్నాయి.
చట్టపరంగా నేరం రుజువు కాకముందే కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇలాంటి సంస్థలను లక్ష్యంగా చేసుకుంటున్నారని, విచారణ పూర్తిగా నిష్పక్షపాతంగా జరగాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇక సామాజిక కోణంలో పరిశీలిస్తే.. ఈ కేసుకు సంబంధించిన మరొక ముఖ్యమైన పొర కూడా స్పష్టంగా కనిపిస్తోంది. రాంపూర్ ప్రాంతంలో మైనారిటీ రాజకీయ ప్రాతినిధ్యానికి ప్రతీకగా ఎదిగిన అజమ్ ఖాన్‌కు చెందిన ప్రముఖ విద్యా సంస్థపై ఈ స్థాయిలో చర్యలు తీసుకోవడం ఆ ప్రాంత ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఒక విద్యా సంస్థపై ఈ రకమైన చర్యలు అక్కడ చదువుకుంటున్న వందలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ఏ విధంగా ప్రభావితం చేస్తాయనేది స్థానికుల నుంచి వస్తున్న ప్రధాన ప్రశ్న. మరోవైపు, చట్ట వ్యతిరేకంగా ప్రజా ఆస్తులను ఆక్రమించి విద్యా సంస్థలను నడిపితే ఎవరైనా సరే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేననే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తోంది. ఈ రెండు పరస్పర విరుద్ధమైన భావనల మధ్య నిజా నిజాలు ఏంటనేది రాబోయే రోజుల్లో దర్యాప్తు సంస్థల నివేదికలు, న్యాయస్థానాల తీర్పులపైనే పూర్తిగా ఆధారపడి ఉంటుంది.
మీడియా, సోషల్ మీడియా రంగాల పాత్రను గమనిస్తే, గత కొద్ది సంవత్సరాలుగా బుల్డోజర్ అనే పదం కేవలం ఒక యంత్రం పేరుగా కాకుండా ఒక రాజకీయ బ్రాండ్లా మారిపోయింది. ప్రధాన స్రవంతి టెలివిజన్ చర్చల్లో, సోషల్ మీడియా వేదికల్లో కూల్చివేతల తాలూకు దృశ్యాలు, పోలీసుల ఎన్కౌంటర్ల సంఖ్యలు, ప్రభుత్వ జప్తు చేసిన ఆస్తుల విలువలు ప్రధాన హెడ్లైన్లుగా మారుతుంటాయి. కొన్ని మీడియా మాధ్యమాలు ప్రభుత్వ చర్యలను ఒక చారిత్రక విజయంగా, సాహసోపేత నిర్ణయంగా వర్ణిస్తుండగా, మరికొన్ని సంస్థలు ప్రక్రియలో ఉన్న లోపాలను, పౌర హక్కుల ఉల్లంఘనలను, మానవీయ కోణాలను ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తున్నాయి. ఈడీ అటాచ్మెంట్లు వంటి ఆర్థిక నేరాలకు సంబంధించిన సున్నితమైన కేసుల్లో డాక్యుమెంట్లు, ఆర్థిక లావాదేవీల లెక్కలు, ట్రస్టుల నిబంధనలను ఎలాంటి వక్రీకరణలు లేకుండా ప్రజలకు అర్థమయ్యే రీతిలో చేరవేయాల్సిన బాధ్యత మీడియాపై ఉంది.
అందుకు భిన్నంగా కేవలం సంచలనాత్మకమైన హెడ్లైన్ల కోసం పాకులాడి అసలైన వాస్తవాలు మరుగున పడిపోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మొత్తం పరిణామాల ప్రభావం ప్రధానంగా రెండు విభిన్న స్థాయిలలో సమాజంపై స్పష్టంగా కనిపిస్తోంది. మొదటిది ప్రత్యక్ష నేర నివారణ, శాంతిభద్రతల స్థాయి. దోపిడీలు, దొంగతనాలు తగ్గాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నప్పటికీ, సామాన్య ప్రజల్లో భద్రతా భావం ఎంతవరకు పాతుకుపోయింది, ఎఫ్ఐఆర్ల నమోదులో పారదర్శకత ఎంత ఉంది అనే అంశాలు కూడా అంతే ముఖ్యమైనవి. గణాంకాలు ఒక్కటే శాంతిభద్రతల నాణ్యతకు పూర్తి కొలమానం కాలేవని, బాధితులకు తక్షణ న్యాయం అందడం, న్యాయ ప్రక్రియ వేగవంతం కావడం అత్యంత అవసరమని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.
రెండోది రాజకీయ, వ్యవస్థాగత స్థాయి. అజమ్ ఖాన్‌కు సంబంధించిన విద్యా సంస్థపై ఈడీ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం రాబోయే ఎన్నికల రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసే అంశంగా మారింది. అధికార పక్షానికి ఇది చట్టం ముందు అందరూ సమానులే అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే అస్త్రంగా మారగా, ప్రతిపక్షానికి మాత్రం ఇది పూర్తిగా రాజకీయ ప్రతీకార రాజకీయాలకు నిదర్శనంగా కనిపిస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరుల మధ్య జరుగుతున్న చర్చల్లో అత్యంత కీలకంగా మారుతున్న ప్రశ్న ఏమిటంటే.. విశ్వవిద్యాలయ ఆస్తులు నిజంగానే ఎలా ఏర్పడ్డాయి, అందులో ప్రజా వనరులు, ప్రభుత్వ నిధులు ఏ స్థాయిలో దుర్వినియోగం అయ్యాయి అనేదే. ఈ నిర్దిష్ట ప్రశ్నలకు ఎటువంటి అనుమానాలకు తావులేకుండా స్పష్టమైన సమాధానాలు లభించాలంటే దర్యాప్తు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ముందుకు సాగాలి. అధికార పక్షం చేసే ఆరోపణలు, ప్రతిపక్షాలు వినిపించే ప్రతివాదనలు రెండూ కూడా బహిరంగంగా, నిబంధనలకు లోబడి విచారణకు గురికావాలి. ఒకవైపు చట్టం తన పని తాను చేసుకుంటూ పోవాలనే బలమైన కోరిక ప్రజల్లో ఏ విధంగా ఉందో, మరోవైపు ఏ ఒక్కరికీ కూడా అన్యాయం జరగకుండా సరైన న్యాయ ప్రక్రియ అమలు కావాలనే ఆకాంక్ష కూడా అంతే స్థాయిలో ఉంది. ఈ రెండు అంశాల సమ్మిళితమే ఒక నిజమైన పాలనా మార్పును సుస్థిరం చేస్తుంది.
మొత్తంగా పరిశీలిస్తే, 2017 నుంచి 2026 వరకు గడిచిన ఈ దశాబ్ద కాలంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర లా అండ్ ఆర్డర్ స్వరూపంలో ఊహించని విధంగా భారీ మార్పులు సంభవించాయి. ఎన్కౌంటర్లు, బుల్డోజర్ల ద్వారా అక్రమ నిర్మాణాల తొలగింపు, పెద్ద ఎత్తున ఆస్తుల జప్తులు, పోలీసు యంత్రాంగం యొక్క సాంకేతిక ఆధునీకరణ ఇవన్నీ కూడా ఈ దశాబ్దపు పాలనా శైలికి ప్రధాన గుర్తులుగా నిలిచాయి. అదే సమయంలో, ప్రతి ప్రభుత్వ చర్య వెనుక కూడా రాజ్యాంగబద్ధమైన న్యాయ ప్రక్రియ సక్రమంగా నడుస్తోందా అనే కోణంలో వస్తున్న ప్రశ్నలు కూడా అంతే ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. రాంపూర్‌లోని జౌహర్ యూనివర్సిటీ కేసు ఈ రెండు భిన్నమైన కోణాలను ఒకే సమయంలో సమాజం ముందుంచుతోంది. ఈ విశ్వవిద్యాలయ నిర్మాణానికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి, ప్రభుత్వ వనరులు ఏమైనా దుర్వినియోగం అయ్యాయా అనే అంశాలపై రాబోయే రోజుల్లో న్యాయస్థానం మరియు దర్యాప్తు సంస్థలు పూర్తి స్పష్టతను ఇస్తాయి. అటువంటి అధికారిక సమాధానాలు వెలువడే వరకు ఇవి తీవ్రమైన ఆరోపణలుగానే మిగిలిపోతాయిగానీ, రాష్ట్రంలో ఒక దశాబ్ద కాలంగా నడుస్తున్న పాలనా పరమైన పెద్ద మార్పు మాత్రం కాదనలేని వాస్తవంగా చరిత్రలో నిలిచిపోతుంది.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా https://TeluguOne.com పోర్టల్‌ను అనుసరించండి, మీ స్నేహితులతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.
[Law and order in Uttar Pradesh, Yogi Adityanaths governance, Azam Khan, Jauhar University, ED attachment, Telugu One]


