TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సీఎం రేసులో నేను లేను: KTR సంచలన వ్యాఖ్యలు.!

Published on: Wed Sep 30, 2026 7:40PM

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చకు తెరలేచింది. రాష్ట్రంలో ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' అంటే రాజమౌళి సినిమా కాదు.. రీకాల్, రిగ్రెట్, రివోల్ట్ (Recall, Regret and Revolt) పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా టుడే సదస్సులో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఓటేసిన ప్రజలు ఇప్పుడు తమ నిర్ణయాన్ని తీవ్రంగా పునరాలోచిస్తున్నారని, ఆ పశ్చాత్తాపం క్రమంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు దిశగా మారుతోందని ఆయన విశ్లేషించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఏకంగా 420కిపైగా హామీలను గుప్పించిందని, అధికారంలోకి వచ్చాక అందులో ఒక్కదాన్ని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయిందని కేటీఆర్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజల్లో కాంగ్రెస్ పాలనపై తీవ్రమైన అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తమవుతున్నాయని తెలిపారు.

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో రాబోయేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రానున్న కాలంలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధోష్టించడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ఇక బీజేపీతో పొత్తు ఉంటుందనే ప్రచారాన్ని కేటీఆర్ పూర్తిగా కొట్టిపడేశారు. గత 26 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో తాము ఎప్పుడూ బీజేపీతో పొత్తు పెట్టుకోలేదని, 2014, 2018, 2023 ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేశామని స్పష్టం చేశారు. సైద్ధాంతికంగా తమ పార్టీ బీజేపీకి ఎప్పుడూ వ్యతిరేకమని, అలాంటప్పుడు ఆ పార్టీతో పొత్తు ప్రశ్ననే ఉత్పన్నం కాదని తేల్చిచెప్పారు.

ఇదే సమయంలో దేశంలో చర్చనీయాంశంగా మారిన డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) అంశంపై కూడా కేటీఆర్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. జనాభా నియంత్రణను అత్యంత సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు జనాభా ఆధారిత డీలిమిటేషన్ పెద్ద శాపంగా మారుతుందని ఆయన హెచ్చరించారు. దేశ జనాభాలో దక్షిణాది రాష్ట్రాల వాటా గతంలో సుమారు 24 శాతంగా ఉండగా, అది ఇప్పుడు 19 శాతానికి పడిపోయిందని గుర్తుచేశారు. కేవలం పార్లమెంట్ సీట్లను మాత్రమే పెంచుకుంటూ పోతే సరిపోదని, చట్టసభల్లో సీట్లు పెంచాలనుకుంటే అసెంబ్లీ స్థానాలను కూడా ఎందుకు పెంచడం లేదని కేవలం లోక్‌సభ సీట్ల పెంపు వెనుక ఉన్న ఆంతర్యాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా నిలదీశారు.

మహిళా రిజర్వేషన్లను ప్రస్తుత 543 లోక్‌సభ స్థానాల్లో ఎందుకు తక్షణమే అమలు చేయడం లేదని ప్రశ్నించిన ఆయన, దామాషా ప్రకారం అన్ని స్థానాలను పెంచితేనే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. అస్సాం, జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ సీట్లను పెంచిన కేంద్రం.. తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ రాజకీయ ప్రభావం తక్కువగా ఉండటం వల్లే సీట్ల పెంపును పట్టించుకోవడం లేదన్న అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కూడా కేంద్రం పూర్తిగా అమలు చేయలేదని, రేవంత్ రెడ్డి మాత్రం ఢిల్లీ పెద్దలకు దాసోహమంటూ తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు.

 

 

 

[ KTR, RRR political pitch, Congress govt, KCR comeback, BRS party, constituency delimitation, CM Revanth reddy, KCR, BJP, Telangana, Telugu One, Telugu News ]