TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

2028లో బీజేపీతో బీఆర్‌ఎస్ పొత్తు ఉండదు.. కేటీఆర్ క్లారిటీ..!

Published on: Wed Sep 16, 2026 8:08PM

2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్‌ఎస్‌ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. హర్యానాలోని సోనిపట్‌లో ఉన్న ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో “ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్: ది స్టోరీ ఆఫ్ ఎ స్టార్టప్ స్టేట్” అనే అంశంపై కేటీఆర్‌ ప్రత్యేక ఉపన్యాసం ఇచ్చారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొని రాజకీయాలు, పాలన, సాంకేతికత తదితర అంశాలపై వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

2028 ఎన్నికల్లో బీజేపీతో బీఆర్‌ఎస్‌ పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా అని ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు.. “బీజేపీతో ఎలాంటి పొత్తు ఉండదు” అని కేటీఆర్‌ తేల్చి చెప్పారు. డీలిమిటేషన్‌పై కూడా కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా లోక్‌సభ స్థానాలను దామాషా ప్రకారం పెంచితే డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వడంలో బీఆర్‌ఎస్‌కు అభ్యంతరం లేదన్నారు. ప్రస్తుతం లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాలకు 24 శాతం ప్రాతినిధ్యం ఉందని.. మొత్తం స్థానాలను దామాషా ప్రకారం పెంచితే బిల్లుకు మద్దతు ఇస్తామని తెలిపారు.

కృత్రిమ మేధస్సు, సాంకేతిక మార్పులపై స్పందించిన కేటీఆర్‌.. ప్రతి పెద్ద సాంకేతిక పరివర్తన సమయంలోనూ ఆందోళనలు వ్యక్తమయ్యాయని అన్నారు. ఏఐ విషయంలోనూ అదే జరుగుతోందని.. మార్పును స్వీకరించి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని విద్యార్థులకు సూచించారు. తన ఉపన్యాసంలో తెలంగాణ అభివృద్ధి నమూనాను “నిర్దిష్టత, అవకాశాలు” అనే రెండు భావనలతో కేటీఆర్‌ వివరించారు. మౌలిక వసతులు, విశ్వసనీయమైన ప్రజా సేవలతో ప్రజలకు స్థిరమైన వాతావరణాన్ని కల్పించడంతో పాటు.. ఇన్నోవేషన్‌, వ్యవస్థాపకతకు అనుకూలమైన ఎకోసిస్టమ్‌ను ప్రభుత్వం నిర్మించాలని అన్నారు.

సాగునీరు, వ్యవసాయం, తాగునీరు, విద్యుత్‌ రంగాల్లో తెలంగాణ చేపట్టిన కార్యక్రమాలను కేటీఆర్‌ వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రస్తావిస్తూ.. కరువు ప్రభావిత ప్రాంతాలకు గోదావరి జలాలను తరలించాలనే సవాలుకు ఇంజినీరింగ్‌ పరిష్కారంగా ఆయన అభివర్ణించారు. తెలంగాణలో వరి ధాన్యం ఉత్పత్తి 2014–15లో సుమారు 44.4 లక్షల టన్నులు ఉండగా.. 2023–24లో 168.8 లక్షల టన్నులకు పెరిగిందని కేటీఆర్‌ తెలిపారు.

రాష్ట్రంలోని ఇన్నోవేషన్‌ ఎకోసిస్టమ్‌పై మాట్లాడుతూ.. టీ-హబ్‌, వీ-హబ్‌, టీ-వర్క్స్‌, టాస్క్‌ వంటి సంస్థల పాత్రను వివరించారు. ఇంక్యుబేషన్‌ నుంచి మార్కెట్‌కు సిద్ధమైన సంస్థగా ఎదిగిన స్కైరూట్‌ను తెలంగాణ ఇన్నోవేషన్‌ వ్యవస్థకు ఉదాహరణగా ప్రస్తావించారు. పరిమితులను సమస్యలుగా కాకుండా.. నిరంతరం నేర్చుకుంటూ, మెరుగుపడుతూ వాటిని అధిగమించే దిశగా పనిచేయాలని విద్యార్థులకు కేటీఆర్‌ సూచించారు. అనంతరం విద్యార్థులు రాజకీయాలు, ప్రజా విధానాలు, డీలిమిటేషన్‌, ఏఐ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై ప్రశ్నలు అడిగారు.

 

 

 

[ KTR, KT Rama Rao, BRS, BJP, Telangana Politics, Telangana Elections 2028, BRS BJP Alliance, KTR Statement, Delimitation, Lok Sabha Seats, Telangana Assembly Elections, O P Jindal Global University, Innovation in Governance, KTR Lecture ]