కోనసీమ ప్రజల చిరకాల స్వప్పం: కోటిపల్లి, నరసాపురం రైల్వేలైన్.. సాకారం దిశగా ముందడుగు.!
Published on: Sun Sep 27, 2026 9:55AM

కోనసీమ ప్రజల చిరకాల స్వప్నం కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ నిర్మాణం విషయంలో కీలక ముందడుగు పడింది. ఈ రైల్వే లైన్ నిర్మాణం విషయంలో తీవ్ర జాప్యంపై కోనసీమ జెన్‌జీ రాష్ట్రపతి కార్యాలయానికి చేసిన ఫిర్యాదుతో.. కోటిపల్లి, నర్సాపురం రైల్వేలైన్ విషయంలో కదలిక మొదలైంది. జెన్ జీ ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం ఈ అంశంపై రైల్వే శాఖ, ఆంధ్రప్రదేశ్ సీఎంఓకు నోట్ పంపింది.
కోటిపల్లి, నరసాపురం రైల్వే ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగి పాతికేళ్లు గడిచినా నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మిగిలిపోవడంపై ఆందోళన వ్యక్తం చేసిన జెన్ జీ. ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగి సుమారు 25 ఏళ్లు గడిచినా నిర్మాణం పూర్తికాకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. రైల్వే ప్రాజెక్టు కోసం కోనసీమలో విద్యార్థులు, యువత చేపట్టిన ధర్నాలకు సంబంధించిన వార్తల క్లిప్పింగ్‌లు, వీడియోలను జత చేస్తూ రాష్ట్రపతి కార్యాలయానికి ఫిర్యాదు చేసింది.
ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందా అని కోనసీమ ప్రజలు ఎదురుచూస్తున్నారని, సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడం ప్రాంత అభివృద్ధిపై ప్రభావం చూపుతోందని ఆ ఫిర్యాదులో వివరించింది. నిరుద్యోగం కారణంగా కోనసీమ యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తోందని ఆ ఫిర్యాదులో పేర్కొంది.

దీనిపై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం రైల్వే శాఖ, ఆంధ్రప్రదేశ్ సీఎంఓకు నోట్ పంపినట్లు తమకు సమాచారం అందిందని కోనసీమ జెన్‌జీ ప్రతినిధులు తెలిపారు. ఇదే అంశంపై రైల్వే శాఖ, సీఎంఓ ప్రతినిధులు తమను సంప్రదింనట్లు తెలిపారు. కోటిపల్లి, నరసాపురం రైల్వే లైన్ నిర్మాణం పూర్తయితే కోనసీమ ప్రాంతానికి రవాణా, వాణిజ్యం, పర్యాటక రంగాల్లో మెరుగైన అనుసంధానం కలిగే అవకాశం ఉందని అన్నారు.
[Kotipalli Narsapuram Railway Line, Konaseema GenZ, Rashtrapathi Bhavan Response, AP Railway Projects Delay, Konaseema District, CMO, Telugu One]


