నా బిడ్డ మాట్లాడితే నాకు ఎందుకు శిక్ష..?... మంత్రి కొండా సురేఖ హాట్ కామెంట్స్..!
Published on: Wed Sep 2, 2026 5:35PM

నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
తనను వద్దు అని చెప్పే అధికారం నాకు లేదు.. తన జీవితం తన ఇష్టం..!
ఢిల్లీ మీడియా చిట్‌చాట్‌లో మంత్రి కొండా సురేఖ హాట్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో స్పందించారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనపై చర్యలు తీసుకోవద్దని కోరారు. మహిళలు స్వతంత్రంగా బతకాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెబుతున్నారని, తన కుమార్తె మాట్లాడిన అంశానికి తనను బాధ్యురాలిని చేయడం సరికాదని అన్నారు. తనపై చర్యలు తీసుకుంటే బీసీలు ఏకమవుతారని కొండా సురేఖ వ్యాఖ్యానించారు. “నా బిడ్డ మాట్లాడితే నాకు ఎందుకు శిక్ష వేస్తారు..? నా కూతురు మాట్లాడిన దానికి నాపై చర్యలు తీసుకోవద్దు” అని ఆమె పేర్కొన్నారు.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది. ఆమెను వద్దని చెప్పే అధికారం నాకు లేదు.. తన జీవితం తన ఇష్టం అని మంత్రి కొండా సురేఖ అన్నారు. తాను బీసీ మహిళా మంత్రినని.. తన భర్త మున్నూరు కాపు, తాను పద్మశాలి కులానికి చెందినవారినని తెలిపారు. తమ కులానికి 16 శాతం ఓట్లు ఉన్నాయని పేర్కొన్నారు. తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని స్పష్టం చేశారు. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండానే తన శాఖను సమర్థంగా నిర్వహిస్తున్నానని అన్నారు.
ఒకవైపు కర్ణాటక కాంగ్రెస్‌లో ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా లేరంటూ ఆందోళన జరుగుతోందని.. మరోవైపు తనపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా షోకాజ్ నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తనపై ప్రెస్‌మీట్లు పెట్టిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వెనుక ఎవరున్నారో తనకు తెలుసని కొండా సురేఖ అన్నారు. అధిష్ఠానం కూడా ఈ విషయాలను ఆలోచించాలని సూచించారు.
మీనాక్షి మేడంకు తాను చెప్పాల్సిందంతా చెప్పానని తెలిపారు. తనకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం తప్పని అన్నారు. తనపై ఏమైనా చర్యలు తీసుకోవాలంటే ఏఐసీసీనే తీసుకోవాలని.. తాను ఏఐసీసీ సభ్యురాలినని కొండా సురేఖ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కే.సీ. వేణుగోపాల్ అపాయింట్‌మెంట్ తనకు దొరకలేదని తెలిపారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశానని, తనపై వచ్చిన అంశాలపై ఆయనకు వివరణ ఇచ్చానని చెప్పారు.“
నాపై చర్యలు తీసుకునే ముందు సీఎం రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలి” అని కొండా సురేఖ అన్నారు. పదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని రేవంత్‌రెడ్డి ఎలా చెబుతారని ప్రశ్నించారు. అలాగే మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, భట్టి విక్రమార్క భార్యకు సంబంధించిన కమీషన్ల అంశాలపై కూడా చాలా ఫిర్యాదులు వచ్చాయని ఆమె వ్యాఖ్యానించారు.
“ఆ ఫిర్యాదులపై ఎందుకు మాట్లాడటం లేదు?” అని ప్రశ్నించారు. చాలామంది రెడ్లు మాట్లాడిన సందర్భాల్లో వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని కొండా సురేఖ ప్రశ్నించారు. తన విషయంలో మాత్రమే చర్యల అంశాన్ని తెరపైకి తీసుకురావడం ఏమిటని ఆమె నిలదీశారు. మంత్రి కొండా సురేఖ తాజా వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు, నేతల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలపై మరోసారి చర్చకు దారితీశాయి.
Konda Surekha Delhi visit, CM Revanth Reddy, Congress high command, AICC Mallikarjun Kharge, Konda Susmita comments, Telangana cabinet reshuffle 2026, Telangana politics news, K.C. Venugopal, Meenakshi Natarajan


