నన్ను, నా కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు.. అదృశ్య వ్యక్తులు ఎవరో తేల్చండి : కొండా సురేఖ
Published on: Sun Aug 23, 2026 10:42AM
.webp)
టీపీసీసీ క్రమశిక్షణా కమిటీకి మంత్రి కొండా సురేఖ లేఖ..!
తనను, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని పలువురు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు సమన్వయంతో వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న ‘అదృశ్య వ్యక్తులు’ ఎవరో నిష్పాక్షికంగా గుర్తించి, వారిపై పార్టీ క్రమశిక్షణా నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవిని కోరారు. క్రమశిక్షణా కమిటీ తనకు జారీ చేసిన నోటీసుకు ఇప్పటికే వివరణ ఇచ్చానని సురేఖ తెలిపారు.
అయినప్పటికీ పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఒకే తరహాలో తనపై, తన కుటుంబంపై విమర్శలు చేయడం అనుమానాలకు తావిస్తోందన్నారు. క్రమశిక్షణా కమిటీ విచారణ కొనసాగుతున్న సమయంలోనే తనపై బహిరంగ విమర్శలు చేయడం, రాజకీయ భవిష్యత్తుపై తీర్పులు ఇవ్వడం, చర్యలు తీసుకోవాలని మీడియా ముందు డిమాండ్ చేయడం ద్వారా కమిటీ స్వతంత్ర నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం జరిగిందా అనే అంశాన్ని కూడా పరిశీలించాలని ఆమె కోరారు.
పార్టీ నాయకత్వం, క్రమశిక్షణా నియమావళిపై తనకు పూర్తి గౌరవం ఉందని పేర్కొన్న సురేఖ.. సీనియర్ బీసీ మహిళా నాయకురాలిగా తనపై సామూహికంగా విమర్శలు వస్తున్నా పార్టీ నాయకత్వం మౌనం వహించడం ఆందోళన కలిగిస్తోందని లేఖలో పేర్కొన్నారు. పార్టీ ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, మహిళా సాధికారత, బలహీన వర్గాల ఆత్మగౌరవానికి కట్టుబడి వున్న పార్టీ అని, ఆ విలువలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై పార్టీ క్రమశిక్షణా నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి సురేఖ కోరారు.
Konda Surekha, CM Revanth Reddy, Telangana Congress, Konda Susmitha, TPCC, Congress MLAs Ultimatum, TPCC Disciplinary Committee, MP Mallu Ravi


