కోనసీమ రైల్వే లైన్ నిర్మాణం: భూ సేకరణకు రూ.100 కోట్లు.. దశాబ్దాల కల సాకారం దిశగా తొలి అడుగు.!
Published on: Sat Oct 3, 2026 3:58PM

దశాబ్దాలుగా కోనసీమ జనం ఓ కల కంటున్నారు. అపర కాశ్మీరం లాంటి కోనసీమలో రైలు కూత వినాలనీ, పట్టాలపై ఛుక్ ఛుక్ అంటూ పరుగులు తీస్తున్న రైలును చూడాలని. కల అయితే కంటున్నారు కానీ దశాబ్దాలుగా ఆ కల కళ్లగానే మిగిలిపోయింది. ఆ కల సాకారం దిశగా ఇప్పుడు తొలి అడుగు పడింది. కోనసీమ రైల్వే లైన్ నిర్మాణానికి వంద కోట్ల రూపాయలు మంజూరయ్యాయి.
.webp)
ఒక్క సారి కోనసీమ ప్రజల రైలు కూత ఆశ గురించి ఒక్క సారి అవలోకనం చేసుకుంటే.. కోనసీమ కేంద్రం అమలాపురం. కోనసీమ మొత్తానికీ అది ఒకప్పుడూ, ఇప్పుడూ కూడా విద్యా కేంద్రమే. ఇప్పుడంటే ప్రైవేటు కాలేజీలు పుంఖాను పుంఖాలుగా వచ్చాయి కానీ, ఒకప్పుడు కోనసీమ మొత్తానికీ ఒకే ఒక్క పెద్ద కాలేజీ ఉండేది. అదే శ్రీకోనసీమా భానోజీ రామర్స్ కాలేజీ. ఐదే వేలకు పైగా విద్యార్థులు ఏటా అక్కడ విద్యనభ్యసించేవారు. రెండు షిప్టులుగా ఆ కాలేజీ నడిచేది.
ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే.. అంత పెద్ద కాలేజీ... ఇంటర్ కాలేజియేట్ టోర్నమెంట్ల కోసం కాకినాడ, రాజమహేంద్రవరం వంటి పట్టణాలకు, ఇప్పుడంటే అవి నగరాలు కానీ అప్పట్లో పట్టణాలే. అలా క్రీడా పోటీల కోసం రాజమహేంద్రవరం, కాకినాడ వెళ్లిన కోనసీమ క్రీడాకారులు.. మైదానంలో పోటాపోటీగా పోటీ జరుగుతున్న సమయంలో రైలు కూత వినిపిస్తే అచ్చెరువుగా వింటూ నిలబడిపోయేవారు. ఒకింత విడ్డూరంగా అనిపించినా ఇది నిజం. కోనసీమకు రైలు అన్నది ఐదు దశాబ్దాలుగా ఊరిస్తూ వస్తున్న ఆశ.

ఇంత కాలానికి కోనసీమ రైల్వే లైన్ ప్రాజెక్టు పట్టాలెక్కుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకునిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద తొలి విడతగా 100 కోట్ల రూపాయలు విడుదల చేసింది. మాజీ లోక్‌సభ స్పీకర్ దివంగత నేత జి.ఎం.సి. బాలయోగి 75వ జయంతి సందర్భంగా ఈ నిధుల విడుదలకు సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. ఈ నిధులను నేరుగా అమలాపురం ఆర్డీవో ఖాతాలో జమ చేయనుండటంతో భూసేకరణ ప్రక్రియఇంకెంత మాత్రం జాప్యం లేకుండా ముందుకు సాగుతుందని పరిశీలకులు అంటున్నారు.
.webp)
కాగా కోనసీమ రైల్వే లైన్ నిర్మాణానికి వంద కోట్ల రూపాయలు విడుదలతో ఈ ప్రాంత ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. నిధుల విడుదల వార్త తెలియగానే అమలాపురం గడియార స్తంభం సెంటర్ వద్ద కోనసీమ జేఏసీ ఆధ్వర్యంలో స్థానికులు భారీ ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ చొరవ వల్ల ఉభయగోదావరి జిల్లాల మధ్య ప్రయాణ సౌలభ్యం మెరుగుపడటమే కాకుండా, స్థానిక ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
[konaseema Railway Line, Kotipalli Narsapur Railway, AP Railway Project, Land Acquisition Funds, Amalapuram, Andhra Pradesh, Telugu One]


