కోనసీమ కొబ్బరి: రైతులకు భలే ధమాకా.. నష్టాల పరంపర నుంచి లాభాల బాట.!
Published on: Thu Oct 1, 2026 6:04PM

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ ప్రాంతంలో కొబ్బరి సాగు చేస్తున్న రైతుల మోముల్లో చాలా కాలం తరువాత సంతోషం కనిపిస్తోంది. ఏళ్ల తరబడి వ్యత్యాసాలు, గిట్టుబాటు ధర లేకపోవడం, తీవ్రమైన ఒడుదొడుకులు, ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటూ వస్తున్న ఉద్యాన రైతులలో ప్రస్తుతం మార్కెట్‌లో కొబ్బరి ధర పెరగడం జోష్ నింపింది . కొద్ది రోజుల వ్యవధిలోనే కొబ్బరికాయల ధరలుఅనూహ్య వేగంతో పెరగడంతో కొబ్బరి రైతుల్లో ఆనందం వెల్లి విరుస్తోంది. ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రంలోని పలు ప్రధాన మార్కెట్లలో కొబ్బరి ధరలు పుంజుకోవడం, అదీ పండుగ సీజన్ సమీపిస్తున్న తరుణంలో కొబ్బరికి మార్కెట్లో పెరిగిన డిమాండ్ రైతుల మోముల్లో చిరునవ్వులు పూయిస్తోంది.
ముఖ్యంగా అపరకేరళగా పిలవబడే కోనసీమ కొబ్బరి రైతులకు ఈ మారిన మార్కెట్ పరిస్థితులు కాసుల పంట పండిస్తున్నాయి. స్థానిక మార్కెట్ నిపుణులు, వ్యాపార వర్గాల సమాచారం ప్రకారం, కొబ్బరికాయల ధరలు రికార్డు స్థాయి మార్కు ను తాకాయి. నెల రోజుల క్రితంతో పోల్చి చూస్తే ప్రస్తుతం మార్కెట్‌లో కొబ్బరి ధరలు రెట్టింపు అయ్యాయి. గతంలో వెయ్యి కొబ్బరికాయల ధర తొమ్మిది వేల రూపాయల ఉండేది. అది ఇప్పుడు రెట్టింపైంది. అంటే పద్దెనిమిది వేల రూపాయలకు చేరడం గమనార్హం. కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే ధరలు ఈ స్థాయిలో రెట్టింపు కావడం గత కొన్నేళ్లలో ఇదే మొదటిసారి అంటున్నారు. కేవలం టోకు మార్కెట్లలోనే కాకుండా రిటైల్ మార్కెట్లలో కూడా ఒక్కో కొబ్బరికాయ ధర నలభై నుంచి యాభై రూపాయల వరకు పలుకుతుండటంవినియోగదారులకు ఒకింత భారమే అయినా.. ఏళ్ల తరబడి నష్టాల భారాన్ని మోస్తున్న కొబ్బరి రైతులకు మాత్రం ఇది నిస్సందేహంగా ఆర్థిక వెసులు బాటు చేకూరుస్తుంది.

కేవలం ఎండు కొబ్బరి లేదా పాత నిల్వలే కాకుండా, కొత్త కొబ్బరి, పచ్చికాయలు చివరాఖరికి కురిడీ కొబ్బరి ధరలు కూడా పెరిగి పరిస్థితి ఆశావహంగా మారింది. ఏటా పండుగల సమయాల్లో దేశవ్యాప్తంగా పూజా కార్యక్రమాలు, గృహప్రవేశాలు, ప్రత్యేక ఉత్సవాలు అధికంగా జరగడం వల్ల కొబ్బరికి ఉండే సహజమైన గిరాకీ ఒక్కసారిగా ఊపందుకుంది. దీనికి తోడు వాతావరణ మార్పుల కారణంగా గత సీజన్లలో దిగుబడులు తగ్గడం కూడా ప్రస్తుత ధరల పెరుగుదలకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. కొత్త కొబ్బరితో పాటు వివిధ రకాల గ్రేడింగ్‌లలో లభించే కొబ్బరికాయలకు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ మార్కెట్ల నుంచి భారీ స్థాయిలో ఆర్డర్లు వస్తున్నాయి. వ్యాపారులు సైతం కోనసీమ నుంచి ఇతర రాష్ట్రాలకు సరుకును తరలించేందుకు పోటీ పడుతుండటంతో కొబ్బరి రైతులకు పండుగ వచ్చినట్లుగా మారింది.
ధరలు భారీగా పెరిగినప్పటికీ, రవాణా రంగంలో వ్యయాలు రైతులు, వ్యాపారులకు ఒకింత భారంగా ఉన్నాయని అంటున్నారు. కోనసీమ నుంచి తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఇతర ప్రధాన నగరాలకు కొబ్బరికాయలను లారీలలో రవాణా చేయడానికి అయ్యే కిరాయిలు ఎంతకాదన్నా మోయలేనంతగా ఉన్నాయంటున్నారు. ఒక లారీ రవాణా కోసం సుమారు పాతిక నుంచి ముప్ఫై వేల రూపాయల వరకు రవాణా ఛార్జీలు చెల్లించాల్సి వస్తోందని అంటున్నారు. కోటిపల్లి, నరసాపురం రైల్వే లైన్ పూర్తయితే.. కొబ్బరి రైతులకు రవాణా వ్యయాలు భారీగా తగ్గుతాయంటున్నారు. అన్నిటికీ మించి కొనసీమ ప్రధాన కేంద్రం అమలాపురం నుంచి ముఖద్వారమైన రావుల పాలెం వరకూ సింగిల్ రోడ్డు కారణంగా రవాణ సమయం కూడా ఎక్కువ అవుతోందంటున్నారు.

కొన్నేళ్ల కిందటి వరకు కోనసీమ కొబ్బరి రైతులు ఇబ్బందులతోనే సహజీవనం చేసిన పరిస్థితి. తమిళనాడు, కేరళ ప్రాంతాల నుంచి వచ్చే కొబ్బరితో తీవ్రమైన పోటీ ఎదురుకావడం, మార్కెట్లో సరఫరా పెరిగి ధరలు అకస్మాత్తుగా ధరలు పడిపోవడం వంటి కారణాలతో వరుసగా నష్టాల పాలయ్యారు. పెట్టుబడి ఖర్చులు కూడా చేతికి అందక ఎంతోమంది రైతులు ఉద్యాన పంటల నిర్వహణపై ఎందుకన్న నిర్వేదంలోకి వెళ్లిపోయారు. కొబ్బరి తోటలను కాపాడుకోవడం భారంగా మారిందని, అంబాజీపేటలో ఉన్న కొబ్బరి పరిశోధనా స్థానం నుంచి కూడా కొబ్బరి దిగుబడి పెరగడానికి కావలసిన సలహాలూ, సూచనలూ పెద్దగా అందని పరిస్థితి. ఒక కొబ్బరి తోటలలో అంతర్ పంటల విషయం కూడా రైతులకు ఎటువంటి ప్రోత్సాహం కనిపించలేదు.
ఆ పరిస్థితి మారి ఇప్పుడు కొబ్బరి ధరలు పెరగడం కేవలం రైతులకు మాత్రమే కాకుండా, ఈ రంగాన్ని నమ్ముకుని జీవిస్తున్న వేలాది మంది శ్రామికులకు మేలు చేస్తోంది. కోనసీమలోని పలు నిల్వ కేంద్రాలు, మార్కెట్ యార్డులలో కొబ్బరికాయల దింపు, ఒలవడానికి, వాటిని గ్రేడింగ్ చేయడానికి పెద్ద సంఖ్యలో కూలీలు శ్రమిస్తుంటారు. రోజూ వందలాది కాయలను ఒలిచే ఈ కార్మికులకు ఇప్పుడు కూలి గిట్టుబాటు అయ్యే పరిస్థితి వచ్చింది. ఇది నిస్సందేహంగా స్థానిక గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుదలకు దోహదం చేస్తుంది. ఇక కొబ్బరి పీచు, చిప్పలు, సంబంధిత ఇతర ఉప ఉత్పత్తుల పరిశ్రమలకు కూడాఈ పరిస్థితి ఊతమిస్తోంది.
[Konaseema Coconut Prices Hike, Andhra Pradesh Coconut Market Rate, Coconut Price Doubled in One Month, Festival Demand Coconut Rates, Konaseema Farmers Rejoice, Telugu One]


