TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కొలికపూడి వర్సెస్ బాలకోటయ్య: టీడీపీ హైకమాండ్ సీరియస్..ఉపేక్షించబోమంటూ వార్నింగ్.!

Published on: Wed Oct 7, 2026 3:40PM

తిరువూరు తెలుగుదేశం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీరు పట్ల పార్టీ హైకమాండ్ మరో సారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పార్టీ పరువు తీసేలా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అలాగే..  రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు ఛైర్మన్ పోతుల బాలకోటయ్యను కూడా మందలించింది. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, పోతుల బాలకోటయ్య మధ్య విభేదాలు రచ్చకెక్కిన నేపథ్యంలో అధిష్ఠానం రంగంలోకి దిగింది.

  ఈ ఇద్దరు సీనియర్ నేతలూ  బహిరంగంగా   విమర్శలు, ప్రతివిమర్శలకు పాల్పడటంపై హైకమాండ్ సీరియస్ అయ్యింది. వీరి వ్యవహార తీరు పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగేలా ఉందని అభిప్రాయపడింది.  వీరిరువురి మధ్యా విభేదాలు రచ్చకెక్కడానికి కారణం,  ఎస్సీ వర్గానికి చెందిన పీఈటీని ఎమ్మెల్యే కొలికపూడి తన ఇంటికి పిలిపించి దూషించారని, దాడి చేశారని పోతుల బాలకోటయ్య పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేయడమే.

అయితే ఈ ఆరోపణలను కొలికపూడి శ్రీనివాసరావు ఖండించారు. తనపై బాలకోటయ్య కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అసత్య ఆరోపణలతో తన రాజకీయ జీవితాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని కొలికిపూడి అన్నారు. ఈ వివాదం ఇరువురి మధ్యా విమర్శలు, ప్రతి విమర్శలు దారి తీసింది. వీరి విభేదాలపై మీడియా కూడా విస్తృతంగా కథనాలు ప్రచారం చేసింది. ప్రచురించింది.  

ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇద్దరు నేతలతో వేర్వేరుగా సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. పార్టీ కార్యాలయంలో పోతుల బాలకోటయ్యతో భేటీ అయిన ఆయన, అలాగే కొలికపూడి శ్రీనివాసరావు నివాసానికి   వెళ్లి ఆయనతో చర్చించారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలకు పార్టీ అధిష్టానం తరఫున గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఎవరికైనా వ్యక్తిగత విభేదాలు లేదా మనస్పర్థలు ఉంటే వాటిని బహిరంగంగా కాకుండా అంతర్గతంగా సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. 

అంతేకానీ, ఈ వ్యక్తిగత గొడవలను రెండు వేర్వేరు ఎస్సీ ఉప కులాల మధ్య కుల తగాదాలుగా లేదా ఘర్షణలుగా మార్చడానికి ప్రయత్నిస్తే మాత్రం పార్టీ పరంగా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఇలాంటి బాధ్యతారాహిత్యమైన ప్రవర్తనను తెలుగుదేశం పార్టీ ఏమాత్రం సహించబోదని పల్లా శ్రీనివాసరావు  విస్పష్టంగా చెప్పారు. ప్రజాక్షేత్రంలో పార్టీ పరువుకు, కీర్తి ప్రతిష్టలకు ఏమాత్రం నష్టం కలిగించేలా ప్రవర్తించినా ఉపేక్షించేది లేదనిహెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి బహిరంగ విమర్శలకు పాల్పడకుండా ఇరువర్గాలు సంయమనం పాటించాలని, క్రమశిక్షణతో మెలగాలని హెచ్చరించారు. 

[Kolikapudi VS Pothul, Kolikipudi Srinivasa Rao, Pothula Balakotayya, TDP High Command, Palla Srinivasa Rao, Tiruvuru MLA, Telugu One]