కింగ్ సన్ సిండ్రోమ్..చేతులారా కొడుకులను నాశనం చేసే ఈ సమస్య గురించి ఎంతమందికి తెలుసు.!
Published on: Mon Sep 21, 2026 10:04AM
కింగ్ సన్ సిండ్రోమ్..చేతులారా కొడుకులను నాశనం చేసే ఈ సమస్య గురించి ఎంతమందికి తెలుసు.!

భారతీయ కుటుంబాల్లో తరచూ వినిపించే ఒక మాట నా కొడుకు అందరిలాంటివాడు కాదు, వాడు ఏ తప్పూ చేయడు అని. పిల్లలపై ప్రేమ, నమ్మకం ఉండటం ఎంతో మంచి విషయమే. కానీ ఆ ప్రేమే గుడ్డిదై, కొడుకు చేసే ప్రతి తప్పునూ కప్పిపుచ్చుతూ, అతడిని ఎలాంటి బాధ్యతలూ లేకుండా పెంచినప్పుడు అది ఒక పెద్ద సమస్యగా మారుతుంది. సమాజంలో దీనినే కింగ్ సన్ సిండ్రోమ్ అని పిలుస్తున్నారు. ఇది వైద్యపరమైన వ్యాధి కాకపోయినప్పటికీ, మన పెంపకంలో ఉన్న ఒక పెద్ద లోపమని మానసిక నిపుణులు, సామాజిక విశ్లేషకులు చెబుతున్నారు. దీని గురించి వివరంగా తెలుసుకుంటే..
ఈ పరిస్థితికి ప్రధాన కారణం..
చిన్నతనం నుంచే వివక్షతో కూడిన పెంపకం మొదలవ్వడమే కింగ్ సన్ సిండ్రోమ్ కు ప్రధాన కారణం. ఇంట్లోని ఆడపిల్ల చిన్నప్పటి నుంచే వంటింటి పనుల్లో సాయం చేయడం, ఇంటి బాధ్యతలను నేర్చుకోవడం చూస్తుంటాం. అదే సమయంలో మగపిల్లాడికి తాగడానికి నీళ్ల గ్లాసు కూడా చేతికి అందిస్తారు. అతడు ఇంట్లో ఎంతో ప్రత్యేకమైనవాడని, ఇంటికి దీపమని, అతడు ఏ పని చేయాల్సిన అవసరం లేదనే భావనను చిన్నప్పటి నుంచే అతడి మనస్సులో నాటుతారు. కొడుకు అడిగిన ప్రతి చిన్న కోరికను వెంటనే తీరుస్తూ, ఎప్పుడూ కాదు అనే మాటను వినకుండా పెంచుతారు.
పర్యవసానం..
కొడుకును ఇలా పెంచడం వల్ల మొదట్లో తల్లిదండ్రులకు తాము కొడుకుపై ఎంతో ప్రేమను చూపిస్తున్నామని అనిపించవచ్చు. కానీ నిజానికి అతడిని సమాజంలో స్వతంత్రంగా బతికేందుకు పనికిరాకుండా తయారుచేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ఈ వాతావరణంలో పెరిగిన అబ్బాయిల్లో ప్రపంచమంతా తమ చుట్టూనే తిరుగుతుందనే అహంకారం లేదా భావన ఏర్పడుతుంది. వీరు తమ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం నేర్చుకోరు. పెద్దయ్యాక బయటి ప్రపంచంలోకి వెళ్లినప్పుడు ఆఫీసులో బాస్ ఇచ్చే విమర్శలను గానీ, స్నేహితుల భిన్నాభిప్రాయాలను గానీ, జీవితంలో ఎదురయ్యే ఏ రకమైన విమర్శను, వ్యతిరేకతను గానీ తట్టుకోలేరు. చిన్న చిన్న సమస్యలకే తీవ్ర ఒత్తిడికి లోనై త్వరగా ఓటమిని ఒప్పేసుకోవడం లేదా సమస్య నుండి తప్పించుకోవడం చేస్తారు.
కింగ్ సన్ సిండ్రోమ్ ప్రభావం ఎప్పుడు బయటపడుతుందంటే..
కింగ్ సన్ సిండ్రోమ్ ప్రభావం సాధారణంగా పెళ్లి తర్వాతే బయటపడుతుంది. ఇలాంటి ఆలోచనా విధానంతో పెరిగిన అబ్బాయిలు తమకు భాగస్వామి కావాలని అనుకోరు, బదులుగా తమను చూసుకోవడానికి భార్య రూపంలో మరో తల్లి కావాలని కోరుకుంటారు. తల్లి ఎలాగైతే తమ తప్పులను, తమ సోమరితనాన్ని, తమ నిర్లక్ష్యాన్ని భరిస్తూ, తప్పులను క్షమిస్తూ, అన్ని పనులనూ చేసిపెట్టిందో, భార్య కూడా అలాగే చేయాలని ఆశిస్తారు. కానీ నేటి కాలంలో అమ్మాయిలు స్వతంత్రంగా, తెలివిగా ఆలోచిస్తున్నారు. వారు దాంపత్య జీవితంలో సమానత్వాన్ని, గౌరవాన్ని కోరుకుంటున్నారు. భర్త నుంచి ఇలాంటి బాధ్యతారాహిత్యం ఎదురైనప్పుడు విభేదాలు మొదలై, చాలా కుటుంబాల్లో బంధాలు తెగిపోవడానికి లేదా విడాకులకు ఈ మనస్తత్వమే కారణమవుతోంది.
పరిష్కారం ఏమిటి?
ఈ సమస్యకు పరిష్కారం ఇంట్లోనే మొదలవ్వాలి. తల్లిదండ్రులు ప్రేమకు, అతిగా ముద్దు చేయడానికి మధ్య ఉన్న తేడాను గుర్తించాలి. ఇంట్లోని కూతురుకు ఎలాంటి పెంపకాన్ని, సంస్కారాన్ని అందిస్తున్నారో, కుమారుడికి కూడా అదే విధంగా నేర్పించాలి. కొడుక్కు కూడా బాధ్యతలు నేర్పించాలి. . ఏడవడం లేదా భావోద్వేగాలను వ్యక్తపరచడం బలహీనత కాదని అతడికి అర్థమయ్యేలా చెప్పాలి. అన్నింటికంటే ముఖ్యంగా, అతడు ఏదైనా తప్పు చేసినప్పుడు వెనుకేసుకు రాకుండా, చేసిన తప్పుకు బాధ్యత వహించడం చిన్నతనం నుంచే నేర్పించాలి. అప్పుడే సమాజానికి, కుటుంబానికి ఉపయోగపడేలా మగపిల్లలు బాధ్యాతాయుతంగా ఉంటారు.
*రూపశ్రీ.


