కిమ్ జోంగ్ ఉన్ కోమాలో ఉన్నారా.. వైరల్ ప్రచారం వెనుక అసలు నిజమేంటి.?
Published on: Tue Oct 20, 2026 12:55PM

అంతర్జాతీయ రాజకీయాల్లో ఎప్పుడూ అత్యంత ఉత్కంఠను రేకెత్తించే ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితిపై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెను దుమారం రేగుతోంది. నార్త్ కొరియాను తన గుప్పిట్లో పెట్టుకుని, ఉక్కుపాదంతో పాలిస్తున్న 42 ఏళ్ల నియంత కిమ్ జోంగ్ ఉన్ తీవ్ర అనారోగ్యం పాలయ్యారంటూ వస్తున్న వార్తలు అంతర్జాతీయంగా కలకలం సృష్టిస్తున్నాయి. ప్రముఖ బ్రిటన్ మీడియా సంస్థ కథనం ప్రకారం.. కిమ్‌కు తీవ్రమైన బ్రెయిన్ హెమరేజ్ (మెదడులో రక్తస్రావం) సంభవించిందని, దీనివల్ల ఆయన అకస్మాత్తుగా కోమాలోకి జారుకున్నారని తెలుస్తోంది.
దేశంలో తగినంత అత్యాధునిక వైద్య వసతులు లేకపోవడం వల్ల లేదా అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆయనను అత్యవసరంగా చైనా రాజధాని బీజింగ్‌కు తరలించినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు. చైనాలోని ప్రముఖ 'పీకింగ్ యూనియన్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రి' నిపుణుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించిందంటూ సోషల్ మీడియా వేదికగా రకరకాల ఊహాగానాలు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఈ అనూహ్య పరిణామాల వెనుక చైనా డెమోక్రసీ పార్టీ (సీడీపీ) ఛైర్మన్ వాంజున్ క్సీ చేసిన సంచలన సోషల్ మీడియా పోస్టులు ప్రధాన కారణంగా నిలిచాయి.
కిమ్ జోంగ్ ఉన్ అక్టోబర్ 13న వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా 81వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన నూతన క్షిపణి ప్రదర్శనశాలను సందర్శించిన తర్వాతే బహిరంగ వేదికలపై కనిపించలేదని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఆ తర్వాత నుంచి ఆయనకు సంబంధించిన ఎలాంటి అధికారిక ఫోటోలు లేదా వీడియోలు బయటకు రాకపోవడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. మరోవైపు, ఉత్తర కొరియా ప్రభుత్వ అధికారిక ఆంగ్ల వార్తా పత్రిక 'పాంగ్యాంగ్ టైమ్స్' వెబ్సైట్ అకస్మాత్తుగా మూతపడటం, గ్లోబల్ వెబ్సైట్ ట్రాకర్లు సైతం దీని సర్వర్లు డౌన్ అయినట్లు ధ్రువీకరించడంతో అంతర్జాతీయంగా తీవ్ర గందరగోళం నెలకొంది.

ఏదైనా అత్యంత కీలకమైన, దేశాధినేతకు సంబంధించిన పెద్ద వార్తను ప్రకటించే ముందే ఇలాంటి అధికారిక వెబ్సైట్లను నిలిపివేయడం ఆ దేశంలో సాధారణమని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇదిలాఉంటే, కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యం క్షీణించిందన్న వార్తల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఉత్తర కొరియాలో ఎలాంటి అంతర్గత కల్లోలాలు లేదా అస్థిరత తలెత్తితే ఎదుర్కొనేందుకు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) నార్తర్న్ థియేటర్ కమాండ్‌ను లెవెల్-3 హై అలర్ట్‌లో ఉంచినట్లు, సైనికుల సెలవులను సైతం రద్దు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అణు ఆయుధాలు కలిగిన ఒక దేశాధినేత ఆరోగ్యంపై స్పష్టత లేకపోవడం ఆసియా ఖండంతో పాటు ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది.
గతంలోనూ 2020 సంవత్సరంలో కిమ్ కొన్ని వారాల పాటు కనిపించకపోవడంతో ఇదే విధంగా అనేక మరణ వార్తలు, కోమా రూమర్లు తెరపైకి వచ్చాయి. అయితే, ఇప్పటివరకు ఉత్తర కొరియా ప్రభుత్వం గానీ, అధికారిక ప్యాంగాంగ్ వర్గాలు గానీ ఈ తాజా వార్తలను ధ్రువీకరించడాని కానీ, ఖండించడానికి కానీ ముందుకు రాకపోవడం గమనార్హం. త్వరలోనే అక్కడి ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోతే ఈ అనిశ్చితి మరింత ముదిరే ప్రమాదం ఉందని అంతర్జాతీయ రాజకీయ పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరణించారంటూ ప్రచారం జరుగుతున్న వేళ.. ఆయనకు సంబంధించిన కొత్త ఫొటోలను ఆ దేశం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ఫొటోలు ఆసక్తికరంగా మారాయి.
[ Kim Jong Un, North Korea dictator, brain hemorrhage, coma rumors, Pyongyang times down, Beijing medical treatment, KCNA, Telugu One, Telugu News ]


