హాస్వాంగ్ 20 ప్రదర్శన: కిమ్ జోంగ్ ఉన్ వ్యూహమేంటి.?
Published on: Tue Oct 13, 2026 7:05PM

అమెరికా ప్రధాన భూభాగాన్ని సులభంగా చేరగల సామర్థ్యం ఉందని ఉత్తర కొరియా గర్వంగా చెబుతున్న అత్యంత శక్తివంతమైన హ్వాసాంగ్-20 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ఇప్పుడు ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వచ్చే నెలలో చైనా వేదికగా జరగనున్న ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సులో ట్రంప్‌ను కిమ్ జోంగ్ ఉన్ కలిసే అవకాశం ఉందనే వార్తలు జోరుగా వినిపిస్తున్న వేళ ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ బల ప్రదర్శన నిర్వహించారు.
సరిగ్గా అమెరికా అగ్రనేతతో దౌత్యపరమైన చర్చలు జరగవచ్చనే సంకేతాలు వెలువడుతున్న తరుణంలో, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కొత్తగా ప్రారంభించిన రక్షణ పరిశ్రమ మ్యూజియంలో హ్వాసాంగ్-20 విధ్వంసక క్షిపణిని ప్రదర్శించడం సంచలనంగా మారింది. ఈ క్షిపణి ప్రదర్శనను కేవలం ఒక సాధారణ సైనిక శక్తి ప్రదర్శనగా మాత్రమే కాకుండా, భవిష్యత్తులో అమెరికాతో జరిగే ఉన్నత స్థాయి చర్చల్లో తన బలాన్ని పెంచుకునేందుకు కిమ్ వ్యూహాత్మక ఎత్తుగడగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
.webp)
గత ఏడాది జరిగిన సైనిక కవాతులో తొలిసారిగా వెలుగులోకి వచ్చిన ఈ హ్వాసాంగ్ 20 క్షిపణి ఘన ఇంధనంతో పనిచేసే అత్యాధునిక దీర్ఘశ్రేణి క్షిపణి వ్యవస్థగా గుర్తింపు పొందింది. తాజా మ్యూజియం ప్రదర్శనలో ఈ క్షిపణితో పాటు దాని మొబైల్ ప్రయోగ వాహనాన్ని కూడా అధికారులు ఉంచారు. ముఖ్యంగా ఈ క్షిపణి ప్రయోగ వాహనం ముందు భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక నమూనాలో బహుళ వార్‌హెడ్‌ల వ్యవస్థ ఉన్నట్లు ఉత్తర కొరియా డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఫోరం ప్రధాన కార్యదర్శి తెలిపారు. మ్యూజియంలో ప్రదర్శించిన ప్రపంచ పటంలో ఈ క్షిపణి పరిధిని కేవలం అమెరికా ప్రధాన భూభాగమే కాకుండా మధ్యప్రాచ్యం, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా వరకు విస్తరించి ఉన్నట్లు చూపించారు.
అయితే ఇదంతా ఉత్తర కొరియా స్వయంగా అంచనా వేసుకున్నదేనని రక్షణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఒక క్షిపణికి సంబంధించిన నమూనాను ప్రదర్శించడం వేరు, దాని వాస్తవ సామర్థ్యాలను కఠినమైన పరీక్షల ద్వారా నిరూపించడం వేరు అంటూ, హ్వాసాంగ్ 20కి సంబంధించి ఇంకా అనేక సాంకేతిక అంశాలపై స్పష్టత రావాల్సి ఉందని చెబుతున్నారు.
సాధారణంగా ఒకే క్షిపణి ద్వారా బహుళ వార్‌హెడ్‌లను వేర్వేరు లక్ష్యాల దిశగా ప్రయోగించే అధునాతన సాంకేతికతను సొంతం చేసుకోవడం ఏ అణ్వాయుధ దేశానికైనా వ్యూహాత్మకంగా కీలకం. ఒకవేళ హ్వాసాంగ్ 20లో ఈ బహుళ వార్‌హెడ్‌ల వ్యవస్థ పూర్తిగా విజయవంతమైతే, అది శత్రు దేశాల క్షిపణి రక్షణ వ్యవస్థలకు పెను సవాళ్లను విసురుతుంది. అయినప్పటికీ, కేవలం ప్రదర్శనలో కనిపించిన చిత్రాల ఆధారంగా ఈ క్షిపణి ఎంతవరకు కచ్చితత్వంతో పనిచేస్తుందనే దానిపై కచ్చితమైన అంచనాకు రాలేమని నిపుణులు అంటున్నారు. మరోవైపు.. ట్రంప్‌తో జరిగే భెటీకి, ఈ ఆయుధ ప్రదర్శనకు ప్రత్యక్ష సంబంధం ఉందని ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. నవంబర్‌లో జరిగే చైనా పర్యటనలో ట్రంప్‌ను కలిసే అవకాశంపై అమెరికా అధినేత సానుకూలంగా స్పందించినప్పటికీ, అధికారిక షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. ఏది ఏమైనప్పటికీ, అంతర్జాతీయ ఆంక్షలను ధిక్కరిస్తూ ఉత్తర కొరియా తన అణ్వాయుధ, క్షిపణి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తుండటం ప్రపంచ శాంతికి పెద్ద పరీక్షగా మారుతోంది.
[Kim Jong Un Donald Trump Meet November, Hwasong 20 Missile, North Korea ICBM, Nuclear capabilities, Telugu One]


