ఫేస్ క్రీమ్ వాడితే కిడ్నీలు డ్యామేజ్..అసలేం జరిగిందంటే.!
Published on: Mon Nov 23, 2026 1:40PM

అందంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు? ముఖంపై చిన్న మొటిమ వచ్చినా.. చర్మంపై నల్లటి మచ్చ కనిపించినా అమ్మాయిలు ఆందోళన చెందుతారు. అలాంటిది కొద్ది రోజుల్లోనే తెల్లగా మారిపోతారంటూ సోషల్ మీడియాలో కనిపించే ప్రకటనలు ఎదురైతే ఇంకేమైనా ఉందా? వాటిని నమ్మి ఎన్నో ఉత్పత్తులు కొనుగోలు చేస్తుంటారు. కానీ అందం కోసం చేసే చిన్న ప్రయత్నం ప్రాణాల మీదకు తెస్తే..? కేరళలో వెలుగుచూసిన ఓ బాలిక ఉదంతం ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది.
సోషల్ మీడియా ప్రకటనకు ఆకర్షితురాలై..!
కేరళలోని మలప్పురానికి చెందిన 17 ఏళ్ల బాలిక కూడా అందంగా కనిపించాలనే ఆశతో ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చే వీడియోలను చూసి ఆకర్షితురాలైంది. ఆ వీడియోల్లో ప్రచారం చేసిన ఫెయిర్‌నెస్ క్రీమ్‌ను వాట్సాప్ ద్వారా ఆర్డర్ చేసింది. ముఖంపై మచ్చలు, మొటిమలు తగ్గి చర్మం తెల్లగా మారుతుందన్న ఆశతో దాదాపు ఏడాది పాటు ఆ క్రీమ్‌ను ఉపయోగించింది. కానీ తనకు తెలియకుండానే ఆ క్రీమ్ రూపంలో విషాన్ని శరీరంలోకి పంపించుకుంటున్నానని ఆమె ఊహించలేకపోయింది.
అందం మాటున కిడ్నీలకు విషం.!
కొంతకాలానికి ఆమె కాళ్లకు వాపులు రావడం మొదలైంది. రక్తపోటు పడిపోవడం, తరచూ స్పృహ తప్పిపోవడం వంటి సమస్యలు వెంటాడాయి. మొదట ఏదో చిన్న ఆరోగ్య సమస్య అనుకున్నా.. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో ఆమెకు 'మెంబ్రానస్ నెఫ్రోపతి' అనే తీవ్రమైన మూత్రపిండాల వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. అందంగా కనిపించాలన్న ఆ చిన్నారి ఆశ.. చివరకు కిడ్నీల ఆరోగ్యాన్నే ప్రమాదంలోకి నెట్టింది.
క్రీమ్‌లో 12,500 పీపీఎం మెర్క్యురీ.!
అసలు ఆమెకు ఈ వ్యాధి ఎందుకు వచ్చిందన్న కోణంలో వైద్యులు పరిశీలించగా విస్తుపోయే నిజం బయటపడింది. బాలిక రక్త నమూనాలతో పాటు ఆమె వాడిన క్రీమ్‌ను ప్రయోగశాలలో పరీక్షించగా ప్రమాదకర స్థాయిలో పాదరసం (మెర్క్యురీ) ఉన్నట్లు తేలింది. సాధారణంగా సౌందర్య ఉత్పత్తుల్లో మెర్క్యురీ పరిమితి ఒక పీపీఎం లోపు ఉండాలి. కానీ ఆమె ఉపయోగించిన క్రీమ్‌లో ఏకంగా 12,500 పీపీఎం మెర్క్యురీ ఉన్నట్లు గుర్తించారు. అంటే అనుమతించిన పరిమితి కంటే వేల రెట్లు అధికం. అందం కోసం ముఖానికి రాసుకున్న క్రీమ్‌లో ఇంతటి విషపూరిత రసాయనం ఉండటమే ఈ ఘటన తీవ్రతను తెలియజేస్తోంది.
తెల్లదనం వెనుక దాగున్న విషాదం.!
చర్మానికి రంగునిచ్చే మెలనిన్ ఉత్పత్తిని తగ్గించి త్వరగా తెల్లగా మారుస్తామనే ఉద్దేశంతో కొన్ని అక్రమ తయారీ సంస్థలు ఇలాంటి క్రీముల్లో మెర్క్యురీని కలుపుతుంటాయి. అయితే ఇది చర్మానికే కాదు.. శరీరంలోని కీలక అవయవాలకూ ప్రమాదకరం. చర్మం ద్వారా శరీరంలోకి చేరిన పాదరసం మూత్రపిండాల వడపోత వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఫలితంగా మూత్రం ద్వారా ప్రొటీన్లు బయటకు పోవడం, కాళ్లు, చీలమండల్లో వాపులు రావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. నాడీ వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది.
తల్లిదండ్రులకు హెచ్చరిక.. ఆన్లైన్ క్రీములపై నిఘా.!
ఈ ఘటనపై బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ స్పందించి కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించింది. మరోవైపు సోషల్ మీడియా వేదికగా ఎలాంటి ధ్రువీకరణ లేకుండా సౌందర్య ఉత్పత్తులను విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా యువతులు, టీనేజర్లు సోషల్ మీడియాలో వచ్చే ఆకర్షణీయమైన ప్రకటనలకు మోసపోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కొద్ది రోజుల్లోనే చర్మ రంగు మారుస్తామనే హామీలను నమ్మి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి క్రీములు కొనుగోలు చేయకూడదని సూచిస్తున్నారు. చర్మ సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించాలే తప్ప.. సొంత నిర్ణయాలతో ప్రయోగాలు చేయకూడదని స్పష్టం చేస్తున్నారు. ముఖంపై తెల్లదనం కోసం ప్రయత్నిస్తే.. జీవితంలో చీకట్లు కమ్ముకోవాల్సిన పరిస్థితి రావొద్దు. అందం కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టకూడదన్న గుణపాఠాన్ని ఈ బాలిక ఉదంతం ప్రతి ఒక్కరికీ గుర్తుచేస్తోంది.
ఇది కూడ చదవండి: ఐఏఎస్ లు ప్రేక్షకపాత్రకు పరిమితమౌతున్నారా: తెలుగువన్ ఇంటలెక్చువల్ టాక్ షోలో చర్చ.!
[ Kidney damage from face cream, Mercury Poisoning, Kerala Girl Kidney Disease, Membranous Nephropathy, Toxic Cosmetics ]


