కర్నాటకలో బీజేపీ నేత కిడ్నాప్..టీడీపీ ఎమ్మెల్యేపై కేసు.!
Published on: Tue Sep 1, 2026 12:22PM
.webp)
కార్నాటక రాజధాని బెంగళూరులో వ్యాపారవేత్త, నాయకుడి కిడ్నాప్ వ్యవహారంలో ఏపీకి చెందిన తెలుగుదేశం ఎమ్మెల్యేపై కేసు నమోదు కావడం సంచలనంగా మారింది.బీజేపీ నాయకుడు, వ్యాపారవేత్త అయిన రవిప్రకాష్ అపహరణ ఉదంతం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వ్యవహారం ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటకలో కూడా రాజకీయవర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెడితే.. బాధితుడు డాక్టర్ రవిప్రకాష్ బెంగళూరు కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుండటంతో పాటు బిజెపిలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయనను శనివారం (ఆగస్టు29) నాలుగు వాహనాల్లో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఈ మేరకు ఆయన భార్య సబీనా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ప్రాథమిక ఆధారాల మేరకు మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, ఆయన కుమారుడు రవికుమార్‌తో పాటు మరొకరిని నిందితులుగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు.
.webp)
బెంగళూరు రాజరాజేశ్వరినగర్ ప్రాంతంలో ఉన్న 4 ఎకరాల స్థలానికి సంబంధించిన క్రయవిక్రయాలు, భూవివాదాలే ఈ కిడ్నాప్ కు కారణమని ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు పోలీసులు చెబుతున్నారు. ఇలా ఉండగా తనపై వస్తున్న ఆరోపణలను మైదుకూరు ఎమ్మెల్యే ఖండించారు. తమకు ఈ స్థిరాస్తి తగాదాలతోనూ, డాక్టర్ రవిప్రకాష్ కిడ్నాప్ తోనూ ఎటువంటి సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. చట్టపరమైన విచారణకు తాను అన్ని విధాలుగా సహకరిస్తామననీ, అనవసరంగా తమ పేరును ఈ వివాదంలోకి లాగుతున్నారని పుట్టాసుధాకర్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే డాక్టర్ రవిప్రకాశ్ కిడ్నాప్ జరిగిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెంగళూరు పోలీసులు ఈ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ ను ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఇలా ఉండగా డాక్టర్ రవి ప్రకాష్ కిడ్నాప్ కు గురికాలేదనీ, ఒక కేసు విషయంలో మైదుకూరు పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారనీ అంటున్నారు. ఏది ఏమైనా రెండు రాష్ట్రాల సరిహద్దు పరిధిలో చోటుచేసుకున్న ఈ కిడ్నాప్ శాంతిభద్రతలపరంగా, రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు జరిగింది అరెస్టా లేక కిడ్నాపా అన్న విషయంలో మైదుకూరు పోలీసులు, అంశంపై కర్ణాటక పోలీసులు స్పష్టతనివ్వాల్సి ఉంది.
[Kidnap Case on Putta Sudhakar Yadav, , Bengaluru Police, BJP Leader Ravi Prakash, Mydukur TDP MLA, Telugu One]


