TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఖరగ్ పూర్, అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే.. ఉత్తరాంధ్ర ఏజెన్సీకి మహర్దశ.!

Published on: Tue Aug 25, 2026 10:52AM

ఆంధ్రప్రదేశ్ రవాణ్య వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునీకరించే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్ పూర్ నుండి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కలుపుతూ ప్రతిపాదించిన 1,107 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే కారిడార్ ఉత్తరాంధ్ర కు కొత్త అభివృద్ధి మార్గం కాబోతున్నది.  తూర్పు, దక్షిణ భారత్  ను అనుసంధానించే ఈ  ప్రాజెక్టు..  ఏపీలోని  గిరిజన ఏజెన్సీ ప్రాంతాల ఆర్థిక స్వరూపాన్ని మార్చే శక్తి కానుంది. 

ఈ  నేషనల్ కారిడార్ లో అత్యధిక భాగం ఆంధ్రప్రదేశ్ గుండా  సాగుతుంది. మొత్తం 1,107 కిలోమీటర్ల పొడవు కలిగిన ఈ ఎక్స్‌ప్రెస్ వేలో  457 కిలోమీటర్ల మేర  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోనే ఉంది. దీనికోసం సుమారు  32 వేల కోట్ల రూపాయలు వ్యయం చేయనున్నారు.  అమరావతి రాజధాని నగరానికి తూర్పు భారత రాష్ట్రాలైన ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లతో నేరుగా అత్యంత వేగవంతమైన రవాణా అనుసంధానాన్ని ఏర్పరచడమే ఈ నాలుగు లేన్ల గ్రీన్ ఫీల్డ్ రహదారి ముఖ్య ఉద్దేశం.

అయితే, ఈ రహదారి ప్రాజెక్టు  సాధారణ మౌలిక సదుపాయాల కల్పనకు మాత్రమే పరిమితం కాదు. ఉత్తరాంధ్ర   ఏజెన్సీ జిల్లాలకు జవసత్వాలను ఇచ్చే ఆర్థిక సంజీవని.  ప్రతిపాదిత  మార్గం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు,  అరకు లోయ, పాడేరు, చింతపల్లి కొండల మధ్య నుంచి కోస్తా   వైపు సాగుతుంది.  దట్టమైన అడవులు, ఎత్తైన కొండచరియలతో కూడిన ఈ గిరిజన  భూమిలో ఆధునిక ప్రమాణాలతో కూడిన నాలుగు లేన్ల ఎక్స్‌ప్రెస్ వే  నిర్మాణం.. రవాణా సౌకర్యాల కొరత కారణంగా దశాబ్దాలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రజల రవాణా సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తుంది.   ఇప్పటివరకు ఇక్కడి రోడ్లు కొండలు, వంకర మార్గాలతో ప్రమాదకరంగా ఉండటంతో మైదాన ప్రాంతాలతో కనెక్టివిటీ  చాలా చాలా తక్కువగా ఉంది.   ఈ  గ్రీన్ ఫీల్డ్ హైవే అందుబాటులోకి వస్తే..  గిరిజన గ్రామాల నుండి ప్రధాన నగరాలకు ప్రయాణ సమయం  తగ్గిపోతుంది. అత్యవసర సమయాల్లో వైద్య సేవలు పొందడానికి,   విద్య,  ఉపాధి అవకాశాలను అందుకోవడానికి ఇది ఏజెన్సీ యువతకు దోహదకారిగా మారుతుంది. 
ఇక  గిరిపుత్రులు పండించే పండ్లు, కూరగాయలు, కాఫీ, ఇతర అటవీ ఉత్పత్తులను దేశంలోని ప్రధాన మార్కెట్లకు వేగంగా, నేరుగా తరలించే అవకాశం ఏర్పడుతుంది. తద్వారా దళారుల   తగ్గి రైతులకు  మద్దతు ధర లభించి వారికి ఆర్థిక ప్రయోజనం దక్కుతుంది. అలాగే అరకు, పరిసర   ప్రాంతాలలో పర్యాటకానికి కొత్త దారులు తెరచుకుంటాయి.   స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. మొత్తంగా ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే గిరిపుత్రుల ఆర్థిక పురోగతికి లైఫ్ లైన్ అవుతుంది. 

ఇంకా ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే అమరావతి నగరానికి  కొత్త వాణిజ్య ద్వారాలను తెరుస్తుంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల పారిశ్రామిక ప్రాంతాలతో అమరావతికి   కనెక్టివిటీ కారణంగా  రవాణా వ్యయం తగ్గి, పారిశ్రామిక ప్రగతికి బాటలు పడతాయి. అమరావతిని కేవలం పరిపాలనా నగరంగానే కాకుండా, పొరుగు రాష్ట్రాలను అనుసంధానించే ఒక జాతీయ స్థాయి ఎకనామిక్ హబ్‌గా మార్చాలన్న లక్ష్యానికి ఇది   పునాదిగా నిలుస్తుంది. 

Kharagpur Amaravati Greenfield Highway,  Andhra Pradesh, Uttarandhra Agency Road Connectivity, Araku Paderu Infrastructure, AP Mega Highway Projects