ఖైరతాబాద్ మహాగణపతి.. నిమజ్జనం ఎప్పుడంటే?
Published on: Tue Sep 22, 2026 4:14PM

ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జన ముహూర్తం, షెడ్యూల్‌ను ఉత్సవ కమిటీ అధికారికంగా ఖరారు చేసింది. ఉత్సవాల ఆఖరి ఘట్టానికి ఏర్పాట్లు వేగవంతం కావడంతో భక్తులు త్వరగా తమ మొక్కులు తీర్చుకోవాలని సూచించారు. శుక్రవారం (సెప్టెంబర్ 25) అనంత చతుర్దశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఖైరతాబాద్ బడా గణేశ్‌తో పాటు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వేలాది విగ్రహాల నిమజ్జన శోభాయాత్ర జరగనుంది. గత సంవత్సరాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి నిమజ్జన ప్రక్రియను అంతరాయాలు లేకుండా వేగంగా మరియు క్రమబద్ధంగా పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఇప్పటికే నగరంలోని వివిధ కార్పొరేషన్ల పరిధిలో లక్షకు పైగా విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది.
ఇక ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి సంబంధించి ఉత్సవ కమిటీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్ మహాగಣపతి సాధారణ దర్శనాలు బుధవారం (సెప్టెంబర్ 23) రాత్రితో ముగియనున్నాయి. ఆ తర్వాత అనగా గురువారం (సెప్టెంబర్ 24).. మండపంలో బారికేడ్ల తొలగింపు, షెడ్ల తొలగింపు వంటి ముందస్తు పనులను అధికారులు పూర్తి చేస్తారు. ఇక శుక్రవారం (సెప్టెంబర్ 25) ఉదయం 6 గంటలకు స్వామివారి విగ్రహాన్ని భారీ ట్రక్కుపైకి ఎక్కించి, మధ్యాహ్నం 12 గంటల కల్లా శోభాయాత్రను ముగించి నిమజ్జన ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో భక్తులు ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా, బుధవారం రాత్రిలోపే ఖైరతాబాద్ బడా మహాగణపతిని దర్శించుకోవాలని ఉత్సవ కమిటీ విజ్ఞప్తి చేసింది. కాగా.. ఈసారి హైదరాబాద్ నగర వ్యాప్తంగా సుమారు 1.5 లక్షల వరకు గణేష్ మండపాలు ఏర్పాటయ్యాయని అంచనా. ప్రధాన నిమజ్జన రోజున జరిగే శోభాయాత్రలో 50 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొనే అవకాశం ఉందని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అంచనా వేస్తోంది.
హుస్సేన్ సాగర్‌తో పాటు సరూర్ నగర్, కాప్రా, అమీన్‌పూర్ వంటి ప్రాంతాలతో పాటు నగరవ్యాప్తంగా సుమారు 150కి పైగా నిమజ్జన వేదికలు, 110 బేబీ పాండ్స్‌ను అధికారులు గణేష్ నిమజ్జనం కోసం సిద్ధం చేశారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు బుధవారం(సెప్టెంబర్ 23) నుండి శుక్రవారం (సెప్టెంబర్ 25) వరకు పలు ప్రధాన మార్గాలలో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు.
[Khairatabad Maha Ganapati, Ganesh immersion, Khairatabad Ganapati darshan, Ananta Chaturdashi immersion, Hyderabad Ganesh festivities, Traffic Restrictions, Telugu One]


