TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రశాంతంగా ముగిసిన ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం: ఆధ్యాత్మిక శోభతో అలరారిన ఎన్టీఆర్ మార్గ్.!

Published on: Fri Sep 25, 2026 3:10PM

హైదరాబాద్ నగరంలో  గణేష్ నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన ఖైరతాబాద్  మహాగణపతి నిమజ్జనం  ప్రశాంతంగా ముగిసింది.  వేలాది మంది భక్తుల జయజయధ్వానాలు, మంగళవాయిద్యాల నడుమ మహా గణపతి  హుస్సేన్ సాగర్ జలాల్లో నిమజ్జనమయ్యారు. భక్తిశ్రద్ధలతో పదకొండు రోజుల పాటు పూజలందుకున్న దేవుడికి  వీడ్కోలు పలికేందుకు పెద్ద సంఖ్యలో జనం ఉదయం నుంచే నెక్లస్ రోడ్డు వద్దకు చేరుకున్నారు. 

నిమజ్జన ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లుఅధికారుల పర్యవేక్షణలో   పక్కా ప్రణాళికతో  జరిగాయి. ఉత్సవ కమిటీ సభ్యులు ఉదయాన్నే ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి, సంప్రదాయబద్ధంగా సామూహిక ప్రార్థనలు చేపట్టారు. ఆ తర్వాత భారీ క్రేన్ల సహాయంతో   ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపైకి విగ్రహాన్ని చేర్చారు. అక్కడి నుంచి ప్రారంభమైన శోభాయాత్ర  టెలిఫోన్ భవన్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్‌కు చేరుకుంది. 

  69 అడుగుల భారీ ఎత్తులో రూపుదిద్దుకున్న పంచముఖ సంకటహర మహాగణపతిని కనులారా వీక్షించేందుకు భక్తులు పోటెత్తారు. యువకులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా  శోభాయాత్రలో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. భక్తుల నినాదాలతో దారులన్నీ మార్మోగాయి. సాంస్కృతిక బృందాల ప్రదర్శనలు, భక్తుల కోలాహలంతో హైదరాబాద్ వీధులు   ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

నిమజ్జన వేదికైన ఎన్టీఆర్ మార్గ్ ప్రాంతంలో భక్తుల రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. క్రేన్ నంబర్ 4 వద్దకు చేరుకున్న మహాగణపతి విగ్రహాన్ని  ట్యాంక్ బండ్ జలాల్లో నిమజ్జనం చేశారు.  విగ్రహం నీటిలో కలుస్తున్న సమయంలో భక్తులు భావోద్వేగానికి లోనై అగ్లే బరస్ తు జల్ది ఆ అంటూ స్వామికి మళ్లీ రావాలని కోరుతూ  వీడ్కోలు పలికారు. 


[Khairatabad Ganesh Immersion, Hyderabad Ganesh Nimarjanam, Mhah Ganesh Shobhayatra, Hussain Sagar Ganesh Visarjan, Khairatabad Maha Ganapati, Telugu One]