ఖైరతాబాద్ ఉపఎన్నికపై ట్విస్ట్: ఈసీఐ కీలక ప్రకటన.!
Published on: Thu Oct 1, 2026 7:04PM

ఖైరతాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఒకవైపు ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హతతో నియోజకవర్గం ఖాళీ కాగా.. మరోవైపు ఉపఎన్నిక నోటిఫికేషన్ విషయంలో హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఖైరతాబాద్ ఉపఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ నేత పి. విజయారెడ్డి దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్ తుది పరిష్కారం అయ్యే వరకు ఉపఎన్నిక నోటిఫికేషన్ జారీ చేయబోమని భారత ఎన్నికల సంఘం (ECI) హైకోర్టుకు తెలిపింది. విజయారెడ్డి 2024లోనే దానం నాగేందర్ ఎన్నికను సవాల్ చేస్తూ ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా గెలిచారు.
అనంతరం ఆయన కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ ఫిరాయింపుపై దాఖలైన పిటిషన్ల నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ 18న దానం నాగేందర్‌ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించింది. ఆ తర్వాత ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. దానం నాగేందర్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసినప్పటికీ.. సెప్టెంబర్ 24న ఆయన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే.

దీంతో ఖైరతాబాద్‌కు ఉపఎన్నిక జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో 2024లో దానం నాగేందర్ ఎన్నికను సవాల్ చేస్తూ తాను దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్ తుది తీర్పు వచ్చే వరకు ఉపఎన్నిక నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈసీఐని ఆదేశించాలని విజయారెడ్డి తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక నిర్వహించబోమని ఈసీఐ హైకోర్టుకు తెలిపింది. ఇప్పుడు ఈ పిటిషన్‌పై హైకోర్టు తీసుకునే నిర్ణయం కీలకంగా మారింది. కోర్టు విచారణ నేపథ్యంలో ఖైరతాబాద్ ఉపఎన్నిక నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుందన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. దీంతో ఖైరతాబాద్ ఉపఎన్నికపై రాజకీయ ఆసక్తితో పాటు న్యాయపరమైన ఉత్కంఠ కూడా కొనసాగుతోంది.
[ Khairatabad by-election notification, Telangana High Court, Danam Nagender, Election Commission, Vijaya Reddy, CM Revanth reddy, BRS Party, KTR, Telugu One, Telugu News ]


