Khairatabad: శాసనసభ స్థానంపై గెజిట్ నోటిఫికేషన్ జారీ.!
Published on: Mon Sep 28, 2026 6:08PM
.webp)
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సంబంధించి ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసింది. దానం నాగేందర్ ఎమ్మెల్యేగా అనర్హతకు గురైనట్లు ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. దీంతో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం సీటు 2024 ఏప్రిల్ 23 నుంచే ఖాళీగా ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నుంచి గెలిచారు. అయితే 2024 మార్చిలో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఆయనపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తదితరులు స్పీకర్‌ను ఆశ్రయించారు.
ఈ అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ నిర్ణయం తీసుకున్నారు. అయితే స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు 2026 సెప్టెంబర్ 18న కీలక తీర్పు వెలువరించింది. దానం నాగేందర్‌ను రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ 2(1)(a) ప్రకారం అనర్హుడిగా ప్రకటిస్తూ, స్పీకర్ గత నిర్ణయాన్ని పక్కనపెట్టింది. 2024 ఏప్రిల్ 23 నుంచే ఆయన ఎమ్మెల్యే పదవికి అనర్హుడని, ఫలితంగా ఖైరతాబాద్ అసెంబ్లీ సీటు ఖాళీగా మారిందని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలోనే సెప్టెంబర్ 26న ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. హైకోర్టు W.P. నెం. 8409, 8647 (2026) లో సెప్టెంబర్ 18న ఇచ్చిన తీర్పుకు అనుగుణం గా ఈ ప్రకటన చేసినట్లు గెజిట్‌లో పేర్కొన్నారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 191(2)తో కలిపి పదో షెడ్యూల్‌లోని 2(1)(a) ప్రకారం దానం నాగేందర్ అనర్హతకు గురైనట్లు స్పష్టం చేశారు. ఆయన అనర్హత 2024 ఏప్రిల్ 23 నుంచి అమ ల్లోకి వచ్చినట్లు, అదే తేదీ నుంచి ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీగా ఉన్నట్లు అధికారికంగా నమోదు చేశారు.ఇదిలా ఉంటే.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సెప్టెంబర్ 24న సుప్రీంకోర్టు ఆయన పిటిషన్‌ను కొట్టివేసి, హైకోర్టు ఇచ్చిన అనర్హత తీర్పులో జోక్యం చేసుకోవడానికి కారణం లేదని స్పష్టం చేసింది.

దీంతో దానం నాగేందర్ అనర్హతపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కొనసాగింది. దానం నాగేందర్ బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి అదే సమయంలో కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం ఈ కేసులో ప్రధాన అంశంగా మారింది. ఇదే చర్యను పార్టీ మార్పుగా పరిగణించిన కోర్టులు రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ కింద అనర్హతకు దారితీసినట్లు తీర్పుల్లో పేర్కొన్నాయి.ఇప్పుడు ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌తో దానం నాగేందర్ అనర్హత, ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీగా ఉన్న అంశం అధికారిక రికార్డులో స్పష్టంగా నమోదైంది. ముఖ్యంగా 2024 ఏప్రిల్ 23 నుంచే సీటు ఖాళీగా ఉన్నట్లు గెజిట్‌లో పేర్కొనడం కీలక అంశంగా మారింది.
[ Khairatabad Assembly constituency, Danam Nagender, Gazette Notification, Supreme Court, Padi Kaushik Reddy, BJP MLA Yeleti Maheshwar Reddy, Speaker Gaddam Prasad Kumar, CM Revanth reddy, KTR, BRS Party ]


