తుమ్మిడిహట్టి బ్యారేజీపై ఢిల్లీలో కీలక సమావేశం.!
Published on: Fri Aug 28, 2026 11:43AM

తెలంగాణ ప్రాణహిత నదిపై ప్రతిపాదించిన తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి సాంకేతిక చిక్కులు, అంతర్రాష్ట్ర వివాదాల పరిష్కారంపై కేంద్రం కసరత్తు చేపట్టింది. ఈ విషయంలో ఢిల్లీలోని సేవా భవన్‌లో వచ్చే నెల 1న కీలక సమావేశం జరగనుంది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఛైర్మన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో తెలంగాణ, మహారాష్ట్ర జలవనరుల శాఖల అధికారుల బృందాలు పాల్గొంటాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒత్తిడి కారణంగానే ఈ భేటీ జరుగుతున్నదని చెప్పాలి. ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న అడ్డంకులను తొలగించేందుకు రేవంత్ రెడ్డి మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపారు. గత మే 26న మహారాష్ట్ర ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి లేఖ రాస్తూ, తుమ్మిడిహట్టి నిర్మాణంపై ఉమ్మడి చర్చలు జరిపి రెండు రాష్ట్రాలకు ప్రయోజనకరమైన నిర్ణయం తీసుకోవాలని ప్రతిపాదించారు.
అలాగే ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో స్పందించిన ప్రధానమంత్రి కార్యాలయం ఈ వ్యవహారాన్ని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌కు గత నెల 5న రాసిన లేఖలో తుమ్మిడిహట్టి విషయంలో తెలంగాణ, మహరాష్ట్రల మధ్య నెలకొన్న అభిప్రాయ భేదాలను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు.
తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ ఎత్తు విషయంలో రెండు రాష్ట్రాల మధ్య భేదాభిప్రాయాలు ఉన్న సంగతి విదితమే. గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం బ్యారేజీ నీటిమట్టం 148 మీటర్ల వద్ద ఉండేందుకు అంగీకరించింది. అయితే.. తెలంగాణ ప్రభుత్వం బ్యారేజీ ఎత్తును 152 మీటర్లకు పెంచాలని ప్రతిపాదిస్తోంది. ఈ నాలుగు మీటర్ల వ్యత్యాసం రెండు రాష్ట్రాల సాగునీటి నిర్వహణలో ప్రాధాన్యత కలిగిన అంశంగా మారింది.
148 మీటర్ల మట్టం వద్ద నీటిని నిల్వ చేస్తే.. గ్రావిటీ ద్వారా నీటిని కాల్వల్లోకి మళ్లించడం సాధ్యం కాదని తెలంగాణ నీటిపారుదల నిపుణులు చెబుతున్నారు. అలాగే సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ద్వారా నిర్వహించిన అధ్యయనాల ప్రకారం నీటిమట్టాన్ని 152 మీటర్లకు పెంచినా ముంపు ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం డేటాతో సహా కేంద్రానికి నివేదించింది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వెనుకబడిన, మెట్ట మరియు కరవు ప్రాంతాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యతా అంశంగా భావిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల1న హస్తిన వేదికగా జరగనున్న భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో సీడబ్ల్యూసీ అధికారుల సమక్షంలో మహారాష్ట్రను ఒప్పించి సానుకూల నిర్ణయం సాధించాలని తెలంగాణ జలవనరుల శాఖ భావిస్తోంది. ఈ భేటీ ద్వారా ప్రాజెక్టు నిర్దేశిత ఎత్తుపై సాంకేతిక సమన్వయం కుదిరితే, దశాబ్దాలుగా నలుగుతున్న తుమ్మిడిహట్టి ఆశలు నెరవేరి త్వరలోనే పనులు ముందుకు సాగే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.
Key Meeting on Tummidihatti Barrage,Delhi, Central Water Commission, Telangana Maharashtra water Project


