వినుకొండ, గుంటూరు నాలుగు లైన్ల ప్రాజెక్టు డీపీఆర్ సిద్ధం: మూడు జిల్లాల మీదుగా నేషనల్ హైవే.!
Published on: Fri Oct 16, 2026 4:33PM

ఆంధ్రప్రదేశ్‌లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా మరో ముందడుగు పడింది. పల్నాడు, ప్రకాశం, గుంటూరు జిల్లాల మీదుగా సాగే కీలకమైన జాతీయ రహదారి విస్తరణకు మార్గం సుగమమైంది. అనంతపురం నుంచి గుంటూరు వరకు నిర్మిస్తున్న నేషనల్ హైవే-544డీ ప్రాజెక్టులో భాగంగా.. వినుకొండ నుంచి గుంటూరు వరకు ఉన్న మార్గాన్ని నాలుగు వరుసల రహదారిగా మార్చేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్టు నివేదికసిద్ధం అయ్యింది.
ఈ మొత్తం రహదారి ప్రాజెక్టు అంచనా వ్యయం 3 వేల 476 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. దీని ద్వారా ప్రయాణికులకు రవాణా మరింత సులువు కావడంతో పాటు ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గనుంది. మొత్తం 85.9 కిలోమీటర్ల పొడవున సాగే ఈ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా, దాదాపు 41.29 కిలోమీటర్ల మేర పూర్తిగా గ్రీన్‌ఫీల్డ్ హైవేను నిర్మించనున్నారు. మిగిలిన మార్గాన్ని ప్రస్తుత రోడ్డును బ్రౌన్‌ఫీల్డ్ విధానంలో అభివృద్ధి చేసి నాలుగు లైన్లుగా తీర్చిదిద్దనున్నారు. దీనికోసం సంబంధిత మూడు జిల్లాల పరిధిలో సుమారు 45 మీటర్ల వెడల్పుతో అవసరమైన భూసేకరణ చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించారు.

ఈ రహదారి ప్రాజెక్టు రూపకల్పనలో భాగంగా రద్దీని తగ్గించేందుకు వీలుగా పలు ప్రాంతాల్లో ప్రత్యేక బైపాస్‌లను నిర్మించనున్నారు. వినుకొండ నుంచి శావల్యాపురం వరకు, సంతమాగులూరు నుంచి పాతమాగులూరు వరకు, పెట్లూరివారిపాలెం, జొన్నలగడ్డ, సాతలూరు అలాగే ఫిరంగిపురం, పేరేచెర్ల ప్రాంతాల వద్ద మొత్తం ఆరు చోట్ల బైపాస్‌లు రూపుదిద్దుకోనున్నాయి. అంతేకాకుండా, ఈ మార్గంలో ఐదు చోట్ల రైల్వే లైన్లు హైవేను దాటి వెళ్లేలా వంతెనల నిర్మాణాలు కూడా ప్రతిపాదించారు. భద్రత, ఇంజనీరింగ్ ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని డీపీఆర్ రూపకల్పన సమయంలోనే అన్ని ప్రాంతాల్లో సమగ్ర మట్టి పరీక్షలు నిర్వహించడం జరిగింది.
అనంతపురం నుంచి గుంటూరు వరకు సాగే ఈ జాతీయ రహదారి ప్రాజెక్టును అధికారులు పలు భాగాలుగా విభజించి అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో భాగంగా బుగ్గ నుంచి గిద్దలూరు వరకు, అలాగే వినుకొండ నుంచి గుంటూరు వరకు నాలుగు వరుసల రహదారులుగా మారుస్తుండగా, గిద్దలూరు నుంచి వినుకొండ వరకు మాత్రం ప్రస్తుతానికి రెండు వరుసల మార్గంగానే కొనసాగించనున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో వినుకొండ, గుంటూరు మార్గానికి సంబంధించిన ఎలైన్‌మెంట్‌కు ఇప్పటికే ఆమోదం లభించగా, తాజాగా డీపీఆర్ కూడా సిద్ధమవ్వడంతో పనుల్లో వేగం పుంజుకోనుంది.
కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ప్రాజెక్టుకు తుది క్లియరెన్స్ లభించి, కేంద్ర కేబినెట్ ఆమోదం రాగానే భూసేకరణ, టెండర్ల ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల మధ్య రాకపోకలు సాగించే వాహనదారులకు మెరుగైన రవాణా సౌకర్యం లభించడమే కాకుండా, స్థానిక ఆర్థికాభివృద్ధికి కూడా దోహదపడుతుంది.
[Key Developement Vinukonda Guntur Highway, National Highway 544D, AP Road Projects, Four Lane Highway, National Highway DPR, Telugu One]


