ఇంజినీరింగ్‌లో 20 బ్యాక్‌లాగ్స్.. డెలివరీ బాయ్ నుంచి పైలట్‌గా ఎదిగిన యువకుడు.!
Published on: Sat Oct 17, 2026 5:18PM

కష్టాలను రెక్కలుగా మార్చుకుని.. ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న యువకుడు. !
జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా, కష్టాలు ఎంతలా చుట్టుముట్టినా లక్ష్యాన్ని మాత్రం విడిచిపెట్టకూడదనేందుకు ఓ యువకుడి ప్రయాణం అచ్చమైన ఉదాహరణగా నిలుస్తోంది. కేరళకు చెందిన ముప్పై ఏళ్ల హైజిల్ జెబి అనే యువకుడు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఎట్టకేలకు తన బాల్య కలను నెరవేర్చుకునే దిశగా అడుగులు వేశారు. ఒకప్పుడు చదువులో వెనుకబడి, ఇరవై బ్యాక్‌లాగ్స్‌తో సతమతమైన వ్యక్తి.. నేడు పైలట్ శిక్షణ పొందే స్థాయికి ఎదగడం ఎందరికో ఆదర్శంగా మారింది. త్రిసూర్ జిల్లా కొడుంగల్లూరుకు చెందిన మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన హైజిల్ చిన్నతనం నుండి విమానాలపై తీవ్రమైన ఆసక్తిని పెంచుకున్నారు. అయితే కుటుంబ పరిస్థితుల కారణంగా ఇష్టపడని ఇంజినీరింగ్ కోర్సులో చేరాల్సి వచ్చింది. ఆ రంగంపై ఆసక్తి లేకపోవడంతో పరీక్షల్లో వరుస వైఫ్యాలను ఎదుర్కొని ఏకంగా ఇరవై బ్యాక్‌లాగ్స్‌ను మూటగట్టుకున్నారు.
అయినప్పటికీ మనోధైర్యాన్ని కోల్పోకుండా పట్టుదలతో వాటిని క్లియర్ చేసి డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీ పూర్తయిన తర్వాత ఉద్యోగ వేటలో భాగంగా అనేక రకాల పనులు చేయాల్సి వచ్చింది. ఖాళీ సమయాన్ని వృథా చేయకుండా కొచ్చిలో జొమాటో డెలివరీ పార్టనర్‌గా సేవలందించారు. ఆ తర్వాత బెంగుళూరులో గణిత ఉపాధ్యాయుడిగా, అలాగే అవసరమైనప్పుడు ట్రక్ బస్సు డ్రైవర్‌గా కూడా పనిచేశారు. ఈ తాత్కాలిక ఉద్యోగాల ద్వారా వచ్చిన చిన్నపాటి సంపాదనతోనే తన కుటుంబానికి అండగా నిలిచారు. ఈ ప్రయాణంలో అతనికి వ్యక్తిగతంగానూ, కుటుంబపరంగానూ కోలుకోలేని దెబ్బలు తగిలాయి. ముఖ్యంగా కరోనా మహమ్మారి విజృంభించిన కాలంలో దుబాయ్‌లో ఉన్న తండ్రి అనారోగ్యంతో కోమాలోకి వెళ్లడం, ఆ తర్వాత తండ్రి మరణించడం హైజిల్ను మానసికంగా కుంగదీశాయి.

కుటుంబ పెద్ద కొడుకుగా బాధ్యతలన్నీ తన భుజాన వేసుకుని, అప్పుల భారంతో సతమతమవుతూనే ముందుకు సాగారు.సైన్యంలో చేరాలనే ప్రయత్నాలు విఫలమైనా, కమర్షియల్ పైలట్ కావాలనే తన ప్రధాన లక్ష్యాన్ని మాత్రం ఆయన ఎన్నడూ విడిచిపెట్టలేదు. పదేళ్ల నిరీక్షణ తర్వాత పరిస్థితులను ఎదుర్కొంటూనే విద్యా రుణాన్ని సమకూర్చుకున్నారు. ఎట్టకేలకు ఫిలిప్పీన్స్ దేశంలోని ప్రముఖ ఏవియేషన్ అకాడమీలో చేరి పైలట్ శిక్షణను ప్రారంభించారు. ఒక సాధారణ డెలివరీ ఏజెంట్ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ పొందే వరకు హైజిల్ సాగించిన ఈ ప్రయాణం యువతకు గొప్ప సందేశాన్ని ఇస్తోంది. విమర్శలను పట్టించుకోకుండా తన చేతలతోనే సమాధానం చెప్పిన ఈ యువకుడి పట్టుదల నేటి తరానికి పెద్ద గుణపాఠం. త్వరలో తన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుని ఒక పూర్తి స్థాయి కమర్షియల్ పైలట్‌గా విమానాన్ని నడిపించాలనేదే ఆయన తదుపరి లక్ష్యం.
[ Kerala man pilot dream, Haizil Jebi story, Zomato delivery boy to pilot, 20 engineering backlogs success, Philippines pilot training, inspirational success story Telugu, Telugu One, Telugu news ]


