అవినీతి ర‌హితం నుంచి.. అవినీతి మ‌యం వ‌ర‌కూ.. కేజ్రీవాల్ రాజ‌కీయ ప్ర‌స్తానం!

posted on: Jun 9, 2026 1:36PM

అరవింద్ కేజ్రీవాల్.. అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి వివాదాల వరద వరకు.. ఒక దశాబ్దపు రాజకీయ ప్రయాణంపై విశ్లేషణ చేస్తే..  అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి అధికారంలోకి అరవింద్ కేజ్రీవాల్ చేరిన‌పుడు.. మొత్తంగా  ఆయ‌న‌ భారత రాజకీయాల్లో ప్రవేశించినప్పుడు ఇచ్చిన ప్రధాన హామీ.. అవినీతిని అంతం చేస్తామ‌ని. అన్నా హజారే నేతృత్వంలోని భారత అవినీతి వ్యతిరేక ఉద్యమం ఇండియా ఆగైనెస్ట్ క‌రెప్ష‌న్ ద్వారా ఆయన దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.

అదే ప్రజాదరణను ఆధారంగా చేసుకుని- ఆమ్ ఆద్మీ పార్టీ- AAP  స్థాపించి ఢిల్లీ రాజకీయాల్లో ప్రవేశించారు. కానీ, గత 10 ఏళ్ల పాలనలో ఆయన ఎదుర్కొన్న అనేక భారీ అవినీతి ఆరోపణలు ఇప్పుడు రాజకీయంగా చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి.

ఇంత‌కీ ఆయ‌న ఎలాంటి ఆరోప‌ణ‌లు ఎదుర్కున్నారు? అందులో అతి ప్రధానవి ఏవి? అని ప‌రిశీల‌న చేస్తే.. ఢిల్లీ పాలనలో వెలుగులోకి వచ్చిన కుంభకోణాలు- అందులో మొద‌టిది రూ. 28వేల‌ కోట్ల ఢిల్లీ జల్ బోర్డు కుంభకోణం. ఢిల్లీ జల్ బోర్డు- DJBలో భారీ ఆర్థిక అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
నీటి సరఫరా, బిల్లింగ్, కాంట్రాక్టుల కేటాయింపుల్లో.. భారీ అక్రమాలు జరిగాయని పలు నివేదికలు చెబుతున్నాయి.

రెండోది-  రూ.100 కోట్ల వక్ఫ్ బోర్డు కుంభకోణం. వక్ఫ్ బోర్డు నియామకాలు, నిధుల వినియోగం, కాంట్రాక్టుల విషయంలో.. అవకతవకలు జరిగాయని ఆరోపణలు నమోదయ్యాయి. మూడో ముఖ్య‌మైన అవినీతి  ఆరోప‌ణ‌- రూ.7వేల కోట్ల‌ నుంచి 8 వేల  కోట్ల.. యమునా నది ప్రక్షాళన కుంభకోణం. యమునా శుద్ధి పేరుతో భారీ నిధులు ఖర్చు చేసినప్పటికీ.. నది కాలుష్యం తగ్గకపోవడంతో వివాదాస్పదమైంది.

నాలుగోది- రూ.1,300 కోట్ల తరగతి గదుల నిర్మాణ కుంభకోణం. పాఠశాలల తరగతి గదుల నిర్మాణంలో అంచనా వ్యయాన్ని మించి భారీగా ఖర్చు చూపించారని ఆరోపణలు వచ్చాయి. ఐదోది- రూ.4,500 కోట్ల బస్సుల కొనుగోలు కుంభకోణం. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కోసం కొనుగోలు చేసిన బస్సుల టెండర్లలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. 

ఆరోది- మొహల్లా క్లినిక్‌లలో రూ.300 కోట్ల మందుల కుంభకోణం. మందుల కొనుగోలు, నాణ్యత, సరఫరా వ్యవస్థలో అక్రమాలు ఉన్నట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఏడ‌వ‌ది- రూ.2,800 కోట్ల లిక్కర్ పాలసీకి  సంబంధించిన‌ది. ఇదే తెలంగాణ‌ను సైతం  కుదిపేసిన మ‌ద్యం కుంభకోణం. ఇది ప్రస్తుతం దేశవ్యాప్తంగా అత్యంత చర్చనీయాంశమైన కేసు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్-ED,  CBI ఈ కేసులో విచారణలు కొనసాగిస్తున్నాయి.

అవినీతి వ్యతిరేక పోరాటం పేరుతో.. రాజకీయాల్లోకి వచ్చిన ఒక‌ నాయకుడు, ఇప్పుడు అనేక భారీ అవినీతి కేసుల్లో నిందితుడిగా నిలిచిన పరిస్థితి- భారత రాజకీయాల్లోనే అత్యంత‌ విస్మయ‌పూరిత అధ్యాయంగా మారింది. 

పంజాబ్ పాలనపై ఆరోపణల సంగ‌తి చూస్తే.. సర్వేలు, ఆర్థిక సూచికలు ఆందోళనకరంగా మారాయి. 
అవినీతి పెరిగిందని పౌరులే అంగీకరిస్తున్నారు. ఒక స్వతంత్ర సంస్థ నిర్వహించిన ల‌క్షా 90 వేల మంది పాల్గొన్న సర్వే ప్రకారం.. పంజాబ్‌లో 63శాతం మంది.. పనులు చేయించుకోవడానికిగానూ లంచం చెల్లించామ‌ని ఒప్పుకున్నారు.

ఇది ఆప్ పాలనలో అవినీతి పెరిగిందనే అభిప్రాయాన్ని మ‌రింత‌ బలపరుస్తోంది. రాష్ట్ర అప్పు–GSDP నిష్పత్తి: దేశంలోనే అత్యధికం. పంజాబ్ అప్పు–GSDP నిష్పత్తి.. 45.65శాతం- 46.6శాతం. దేశంలో అత్యధిక అప్పులు ఉన్న రాష్ట్రాల్లో పంజాబ్ రెండవ స్థానంలో ఉంది. 2027 నాటికి మొత్తం అప్పు రూ.4.47 లక్షల కోట్లు చేరుతుందని అంచనా. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ఒత్తిడిని సూచిస్తుంది.

రాజకీయ కోణంలో చూస్తే.. బీజేపీ వ్యతిరేక కూటముల్లో కేజ్రీవాల్ పాత్ర బాగా ఉంది. అవినీతి వ్యతిరేక పోరాటం పేరుతో రాజకీయాల్లోకి వచ్చిన కేజ్రీవాల్, తరువాత బీజేపీని ఎదుర్కొనేందుకుగానూ.. లాలు ప్రసాద్ యాదవ్, రాహుల్ గాంధీ, టీఎంసీ, ఎస్పీ, ఎన్సీపీ, వంటి పార్టీలతో చేతులు కలిపారు.
ఈ మార్పు ఆయన రాజకీయ ధోరణిపై ప‌లు ప్రశ్నలు లేవనెత్తింది.

ఇప్పుడు చూస్తే, Gen Z విప్లవం.. కొత్త రాజకీయ కలలుగా రూపాంత‌రం  చెందింది. ఇన్ని వివాదాలు, కేసులు, ఆరోపణలు ఉన్నప్పటికీ, కేజ్రీవాల్ ఇప్పుడు నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక తరహాలో జెన్ జెడ్ విప్లవం  తీసుకురావాలని, భారతదేశానికి ప్రధానమంత్రి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కొన్ని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

కేజ్రీవాల్ రాజ‌కీయ  ఎదుగుద‌ల  కాల‌క్ర‌మాన్ని చూస్తే..  2011–12..  అవినీతి వ్యతిరేక ఉద్యమం, 2013.. AAP స్థాపన, మొదటి ఢిల్లీ ప్రభుత్వం, 2015–2023.. ఢిల్లీ పాలనలో వివిధ అవినీతి ఆరోపణలు, 2022.. పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం, 2023–24.. లిక్కర్ పాలసీ కేసు, ED/CBI విచారణలు, 2024–25.. పంజాబ్ ఆర్థిక సంక్షోభంపై చర్చలు, 2025–26.. Gen Z రాజకీయ వ్యూహాలపై కేజ్రీవాల్ వ్యాఖ్యలుగా ఒక క్రోనాల‌జీ తెలుస్తోంది. 

ఇక  ఆయ‌న‌పై  ఉన్న కేసులు ఎలాంటివో చూస్తే.. పలు  కేసులు ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి.
ఈడీ,సీబీఐ, విజిలెన్స్ విభాగాలు వివిధ దిశల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. కోర్టుల్లో పిటిషన్లు, బెయిల్ విచారణలు, సాక్ష్యాల పరిశీలన జరుగుతోంది.  మీడియా వర్గాల్లో కేజ్రీవాల్‌పై వచ్చిన ఆరోపణలు విస్తృత చర్చకు దారితీశాయి. సామాజిక మాధ్యమాల్లో ఆయనపై విమర్శలు, మద్దతు రెండూ కనిపిస్తున్నాయి. పంజాబ్ ఆర్థిక పరిస్థితి, ఢిల్లీ కుంభకోణాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

ఓవ‌రాల్ గా  చూస్తే.. అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి ప్రారంభమైన కేజ్రీవాల్ రాజకీయ ప్రస్తానం,
ఇప్పుడు అనేక అవినీతి కేసులు, ఆర్థిక సంక్షోభాలు, రాజకీయ వివాదాలతో నిండిపోయింది. ఈ పరిణామాలు భారత రాజకీయాల్లో ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలుస్తున్నాయి. కేజ్రీవాల్ భ‌విత‌వ్యాన్ని ప్ర‌శ్నిస్తున్నాయి.

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.    

google-ad-img
    Related Sigment News
    • Loading...