బాలల సంక్షేమంపై కేసీఆర్ మనవడు కేహెచ్ఆర్ ప్రాజెక్ట్

 

కేహెచ్ఆర్, ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేరు. అదేంటి మాకు కేసీఆర్ తెలుసు.. కేటీఆర్ తెలుసు.. మరి ఈ కేహెచ్ఆర్ ఎవరా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. కేహెచ్ఆర్ పేరుతో సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారికి ఎంతో కొంత పరిచయముంది. కేహెచ్ఆర్ ఎవరో కాదు.. కేసీఆర్ ముద్దుల మనవడు హిమాన్షు. తాత కేసీఆర్ లానే కేహెచ్ఆర్ కి కూడా లక్కీ నంబర్ 6 అందుకే తన ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్ కి కేహెచ్ఆర్ 6666 అని పెట్టుకున్నారు. కేహెచ్ఆర్ అంటే కల్వకుంట్ల హిమాన్షురావు. ఇప్పుడు ఆయన చేసిన ఒక ఇంటర్వ్యూ వైరల్ అవుతుంది.

హిమాన్షు.. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ను ఇంటర్వ్యూ చేశారు. స్కూల్ ప్రాజెక్టు విషయమై మంత్రిని ఇంటర్వ్యూ చేసినట్లు సోషల్ మీడియాలో తన ఖాతాలో హిమాన్షు తెలిపారు. తెలంగాణలో శిశు సంక్షేమం గురుంచి మంత్రితో చర్చించినట్లు చెప్పారు. దీనికి సంబంధించి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఇంటర్వ్యూ ఫొటోలు పెట్టాడు. మంత్రి సత్యవతితో కలిసి హైదరాబాద్ లోని బాల నేరస్థుల జువైనల్ హోమ్ ను సందర్శించారు. అక్కడి స్థితిగతులను ఆరా తీశారు. ఆ తర్వాత అదే విషయం పై మంత్రి సత్యవతి రాథోడ్ ను ఇంటర్వ్యూ చేశారు. తాను చదివిన స్కూల్ లో బాలల సంక్షేమ పై ప్రాజెక్టు వర్కు ఇచ్చారు. ఇందులో భాగంగానే తాను మంత్రిని ఇంటర్వ్యూ చేసినట్టు హిమాన్షు చెప్పారు. మొత్తానికి కల్వకుంట్ల కుటుంబంలో మూడోతరం యాక్టీవ్ అవుతోంది. తండ్రి కేటీఆర్ లాగానే హిమాన్షు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు.