డిసెంబర్ 1 నుండి టోల్ దాటాలంటే ఫాస్టాగ్ తప్పనిసరి!

 

జాతీయ రహదారులపై తిరగాలంటే ఇక పై వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి. డిసెంబర్ 1వ తేదీ నుంచి అన్ని వాహనాలకు ఫాస్టాగ్ ఉండాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగకుండా.. ట్రాఫిక్ సమస్యలు రాకుండా.. ఉండేందుకు ఫాస్టాగ్ ను అమల్లోకి తెస్తున్నారు. ఫాస్టాగ్ ఉంటే వాహన దారులు టోల్ ప్లాజాల దగ్గర ఆగి డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ఆధారిత ఫాస్టాగ్ ను వాహనం ముందు అద్దానికి అతికిస్తే టోల్ ప్లాజాలోని స్కానర్ లు దాన్ని స్కాన్ చేస్తాయి. వెంటనే దానికి అనుసంధానమైన ప్రీపెయిడ్ లేదా సేవింగ్స్ ఖాతాల నుంచి టోల్ రుసుము ఆటోమేటిగ్గా ఖర్చయిపోతుంది. వినియోగదారులు తమ ఖాతాలో తగిన నిల్వ ఉంచుకుంటే చాలు.

మరోవైపు టోల్ ప్లాజాల్లో ఒక్క లైన్ మినహా మిగిలినవన్నీ ఫాస్టాగ్ లైన్లుగా మార్చాలని NHAI ఇప్పటికే నిర్ణయించింది. డిసెంబరు 1వ తేదీ నుండి ఫాస్టాగ్ లేని వాహనాలు ఆ ఒక్క లైన్ లోనే నగదు చెల్లించి వెళ్లాలి. పొరపాటున ఫాస్ట్ ట్యాగ్ లైన్ లోకి వెళితే రెట్టింపు రుసుము వసూలు చేస్తామని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. దేశంలోని అన్ని పెద్ద బ్యాంకులు తమ వినియోగదారులకు ఫాస్టాగ్ చెల్లింపుల సౌకర్యాన్ని అందుబాటులో ఉంచాయి. ఈ పాస్టాగ్ వినియోగదారుల సేవింగ్స్ ఖాతాకు అనుసంధానమై ఉంటుంది. వాహనాలు టోల్ ప్లాజాలను దాటేటప్పుడు ఆటోమెటిక్ గా నిర్దేశిత రుసుములు ఆయా బ్యాంక్ ఖాతాలో నుండి కట్ అవుతాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్ డీఎఫ్ సీ, యాక్సిస్, కొటక్ మహీంద్రా బ్యాంక్ లు.. నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ కార్యక్రమంలో భాగస్వాములై ఉన్నాయి.