ఎకరాలకు ఎకరాల భూమి పోగేసిన కేసీఆర్ కుటుంబం.. అసెంబ్లీ వేదికగా బయటపెట్టిన రేవంత్.!
Published on: Wed Sep 16, 2026 6:09PM

తెలంగాణ రాజకీయాలు మరో సారి హీటెక్కాయి. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ భూముల వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి కన్నెర్ర చేశారు. కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిధిలో వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఎర్రవల్లి ఫామ్‌హౌస్ భూముల బాగోతంపై 30 రోజుల్లోగా పూర్తిస్థాయిలో విచారణ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని కల్వకుంట్ల కుటుంబం భారీగా ఆస్తులను కూడబెట్టిందని, రాష్ట్రంలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిని వారి అధీనంలోకి తెచ్చుకున్నారని సీఎం తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఈ సందర్భంగా కల్వకుంట్ల కుటుంబానికి చెందిన స్థిరాస్తుల వివరాలను సర్వే నంబర్లతో సహా సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా చదివి వినిపించడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. నిబంధనల ప్రకారం కేసీఆర్ దంపతుల పేరు మీద కేవలం 27 ఎకరాలు మాత్రమే ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం వారి వద్ద 67 ఎకరాల భూమి ఉన్నట్లు రేవంత్ పేర్కొన్నారు. అంతేకాకుండా కేటీఆర్ కుటుంబానికి సంబంధించి నలుగురి పేర్ల మీద మొత్తంగా 123 ఎకరాల భూములు ఉన్నాయని లెక్కలతో సహా వివరించారు. కేటీఆర్ పేరు మీద 49.5 ఎకరాలు, ఆయన భార్య శైలిమ పేరు మీద 17.5 ఎకరాలు, అలేఖ్య పేరు మీద 9.38 ఎకరాలు, అలాగే హిమాన్ష్ పేరు మీద 46.3 ఎకరాల భూమి ఉన్నట్లు స్పష్టం చేశారు. ఉద్యమాన్ని, ధరణి పోอร์టల్‌ను అడ్డం పెట్టుకుని వేల కోట్ల విలువైన ఆస్తులను దోచుకున్నారని ఆరోపించారు.

మొత్తంగా దాదాపు 340 ఎకరాల ప్రభుత్వ భూమి కేవలం కేసీఆర్ ఫామ్‌హౌస్ అధీనంలోనే ఉందనీ, ఈ ఫామ్‌హౌస్ భూముల అసలు నిజాలు తేల్చాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ విచారణలో ఆ భూములు పూర్తిగా ప్రభుత్వానివేనని తేలితే, ఆ భూములన్నింటినీ స్వాధీనం చేసుకుని పేద ప్రజలకు పంచుతామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రెవెన్యూ అధికారులు తక్షణమే కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసి విచారణ వేగవంతం చేయాలన్నారు. ఒకవేళ నిర్దేశిత 30 రోజుల్లోగా విచారణ పూర్తి చేయకపోతే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తాజా పరిణామంతో తెలంగాణలో భూ ఆక్రమణల అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే రేవంత్ రెడ్డి బయటపెట్టారు. కేవలం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే అధికారిక రికార్డుల ప్రకారం కల్వకుంట్ల కుటుంబ సభ్యుల పేరిట 440 ఎకరాల భూములు ఉన్నాయని సర్వే నంబర్ల వారీగా వివరించారు. తెలంగాణ రాష్ట్రం వేలాది మంది అమరులు ప్రాణాలర్పించి, ఉద్యమకారులు సర్వస్వం కోల్పోతే.. కల్వకుంట్ల కుటుంబం మాత్రం పాలన ముసుగులో భూములను పోగేసుకుందని ఆరోపించారు.
రేవంత్ అసెంబ్లీ వేదికగా వెల్లడించిన వివరాల ప్రకారం హైదరాబాద్ లో కేసీఆర్ దంపతుల పేరిట 67 ఎకరాలు, కేటీఆర్ కుటుంబం పేరిట 123 ఎకరాల భూమి ఉంది. ఇందులో కేటీఆర్ పేరిట 49 ఎకరాలు, ఆయన కుమారుడు హిమాన్షు పేరిట 46 ఎకరాలు, కుమార్తె అలేఖ్య పేరిట 9 ఎకరాలు, భార్య శైలిమ పేరిట మరో 17 ఎకరాలు ఉన్నాయి. ఇక మాజీ మంత్రి హరీశ్ రావు పేరిట 30 ఎకరాలు, ఎమ్మెల్సీ కవిత పేరిట 35 ఎకరాలు, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావు పేరిట 79 ఎకరాల భూములు అధికారిక రికార్డుల్లోనే స్పష్టంగా ఉన్నాయి.
సభ ముందు ఉంచిన ఈ 440 ఎకరాలు కేవలం అధికారిక పత్రాల్లో నమోదైన లెక్కలు మాత్రమేనన్న రేవంత్ రెడ్డి.. తెరవెనుక బినామీల పేర్ల మీద ఇంకా వేల ఎకరాల విలువైన భూములు దాగి ఉన్నాయని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్‌ను, రెవెన్యూ యంత్రాంగాన్ని ఆయుధాలుగా మార్చుకుని అసైన్డ్, ప్రభుత్వ, పేదల భూములను చేజిక్కించుకున్నారని విమర్శించారు. దశాబ్ద కాలంలో ఈ భూములు ఏ విధంగా సమకూరాయి, మార్కెట్ విలువలను ఎలా ప్రభావితం చేశారు, ప్రభుత్వ భూములు ఏమైనా వీటిలో కలిసిపోయాయా అనే కోణాలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపిస్తామని చెప్పారు. ఒకవైపు పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, ఇళ్ల స్థలాలు దక్కక అల్లాడుతుంటే.. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉండి ఒకే కుటుంబం వందలాది ఎకరాలను కబ్జా తరహాలో కూడబెట్టుకోవడం ప్రజాద్రోహమేనని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
[KCR Farmhouse, Cm Revanth reddy, Erravelli Earmhouse Lands, KCR Family Assets, Telugu One]


