TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేసీఆర్ కుటుంబ సభ్యుల భూములపై దర్యాప్తు: కమిటీ ఏర్పాటు చేసిన రేవంత్ సర్కార్.!

Published on: Fri Sep 25, 2026 10:01AM

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో పాటు ఆయన కుటుంబ సభ్యుల భూముల వివరాలు, ఆస్తులపై వస్తున్న ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గతంలో జరిగినట్టు చెబుతున్న  భూ ఆక్రమణలు, అసైన్డ్ భూముల కేటాయింపులు, ఇతర నిబంధనల ఉల్లంఘనలపై సమగ్ర దర్యాప్తునకు ఒక ప్రత్యేక  కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు తెలంగాణ సర్కార్ జీవో జారీ చేసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారడమే కాకుండా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.  

ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 134 ప్రకారం, ఈ ముగ్గురు సభ్యుల   కమిటీకి కాలేజియేట్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్  శ్రీదేవసేన చైర్ పర్సన్  గా వ్యవహరిస్తారు. అలాగే రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్‌గాంధీ హనుమంతు కన్వీనర్ గా, జనగాం కలెక్టర్ సందీప్ కుమార్ జా సభ్యుడిగా ఉంటారు.

దీనికి తోడు.. ఏయే జిల్లాల పరిధిలోని భూముల గురించి విచారణ జరుగుతుందో, ఆయా జిల్లాల కలెక్టర్లు కూడా ఆయా కేసుల విచారణ సమయంలో ఈ కమిటీలో సభ్యులుగా భాగస్వాములు అవుతారు.   అసెంబ్లీలో  రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22-ఏ కింద జరిగిన చర్చల నేపథ్యంలో ఈ కమిటీ ఏర్పాటు జరిగింది.

గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు, పలువురు ముఖ్య నేతల అధీనంలో ఉన్న వేల ఎకరాల భూములు, అప్పటి అసైన్డ్ భూముల బదలాయింపులపై అధికార పక్షం సభలో గణాంకాలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్, రాజన్న సిరిసిల్ల తదితర జిల్లాల్లో విస్తరించి ఉన్న సుమారు 16   భూ వివాదాలు, ఆరోపణలపై ఈ కమిటీ  దర్యాప్తు చేయనుంది. 

ఎర్రవల్లి, మర్కూక్, జన్వాడ, రంగనాయక సాగర్  ప్రాంతాలతో పాటు   ప్రముఖుల కుటుంబాలకు చెందిన భూ లావాదేవీలు  ఈ జాబితాలో ఉన్నాయి.   ఈ విచారణ కమిటీకి ప్రభుత్వం   అధికారాలను కల్పించింది. రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ శాఖ నుండి అయినా.. సంబంధిత కలెక్టరేట్లు లేదా స్థానిక సంస్థల నుండి రికార్డులు, డాటా, సిబ్బందిని కోరే  అధికారం కట్టబెట్టింది.

సీలింగ్ సర్ప్లస్, అసైన్డ్, భూదాన్, ఇనామ్, అటవీ భూములు, ల్యాండ్ అక్విజిషన్  ప్రక్రియలో ఏమైనా చట్ట వ్యతిరేక చర్యలు జరిగాయా అన్న విషయంపై ఈ కమిటీ దర్యాప్తు చేస్తుంది.  నిబంధనలను ఉల్లంఘించిన వారిని గుర్తించి, బాధ్యులపై తగినచర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ నివేదిక సమర్పిస్తుంది.   నిర్దేశిత కాలపరిమితిలోగా ఈ కమిటీ తన విచారణను పూర్తి చేసి ప్రభుత్వానికి తుది నివేదిక అందజేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.  


[KCR Family Land Holdings, Telangana Land Probe,  BRS Land Irregularities committee, Government Panel, GO 134, Revanth Reddy, Telangana News, Telugu One]