కేసీఆర్ డైరెక్షన్ లో సజ్జల సమర్పించు పునః విలీనం ..

రాష్ట్ర విభజ జరిగిన ఎనిమిదేళ్ళ తర్వాత, ఉభయ తెలుగు రాష్ట్రాలు మళ్ళీ ఏకం అవుతాయంటే, ఎవరైనా నమ్ముతారా? అసలు అది జరిగే పనేనా? అది అయ్యే పని కాదని, ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వానికి అద్భుత సలహాలుఇస్తున్న ఏపీ సర్కార్  ప్రధాన సలహదారు సజ్జల రామకృష్ణా రెడ్డికి తెలియదా? తెలుసు. ఆయినా ఆయన తేనె తుట్టెను కదిల్చారు.  

కుదిరితే ఉభయ తెలుగు రాష్ట్రాలు మళ్ళీ ఒకటై ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంగా కలసి ఉండాలన్నదే తమ పార్టీ విధానమని ప్రకటించారు. ఇలా సమయం సందర్భం లేకుండా ఆయన తేనె తుట్టెను ఎందుకు కదిపారు? ఎవరికోసం కదిపారు?  నిజంగానే ఉభయ తెలుగు రాష్ట్రాల పునఃవిలీనం వైసీపీ అజెండాలో ఉందా? ఉంటే ఈ ఎనిమిదేళ్ళలో పోనీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత  గడచిన మూడేళ్ళలో ఒక్కసారైనా  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేదా ఇప్పడు సజ్జల వారికి వంత పాడుతున్న మంత్రి బొత్స సత్యనారాయణ, నెంబర్ 2(ఏ2) విజయసాయి రెడ్డి ఎవరో ఒకరు పార్లమెంట్, అసెంబ్లీ వేదికగా  కాదంటే కనీసం ఇటీవల జరిగిన  పార్టీ ప్లీనరీ వేదిక నుంచి ఆలాంటి ప్రకటన ఎందుకు చేయలేదు?

అధికారంలోకి వచ్చిందే తడవుగా, సెక్రటేరియట్ సహా ఉభయ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరంలో ఉన్న ఆస్తులు మొత్తం తెలంగాణకు ధారాదత్తం చేసినప్పుడు ఈ అలోచన ఏమైంది? అప్పుడే ఈ ఆలోచన ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదంటే, ఇది  సజ్జల వారి ఆలోచన కాదు ముందస్తు ఎన్నికలకు సిద్ధం అవుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి  కే. చంద్రశేఖర రావు, ఏదో విధంగా తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చేందుకు చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఆడుతన్న నాటకం. కేసీఆర్ రాసిచ్చిన ‘పునః విలీనం’  స్క్రిప్ట్ ను జగన్ రెడ్డి ఆదేశం మేరకు, సజ్జల  మీడియాకు సంర్పించారు. ఇది ఎవరో గిట్టని వారు అంటున్న మాట కాదు. ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సాగుతున్న చాటుమాటు సంబంధాల గురించి,  లాలూ...ఛీ రాజకీయాల గురించి తెలిసిన సన్నిహితుల సమాచారంగా సోషల్ మీడియా చెపుతోంది.

నిజానికి  సజ్జల సమర్పించిన డ్రామాకు, కర్త కర్మ క్రియ అంతా కేసీఆర్.  నిజానికి ఇది ఇప్పటికిప్పుడు, తయారైన స్క్రిప్ట్ కాదు ముంచు కొస్తున్న ఉపద్రవాన్ని  ముందుగానే గ్రహించిన కేసేఆర్  మూడు నాలుగు నెలల క్రితం సమైక్య వాదానికి సజీవ రూపం అనుకునే  మాజీ ఏపీ ఉండవల్లి అరుణ కుమార్ ను ప్రగతి భవన్  కు పిలిచి శాలువ కప్పిన సమయానికే స్క్రిప్ట్ సిద్దమైందని అంటున్నారు. 

ఇప్పుడు అదే స్క్రిప్ట్ ప్రకారం తెరకెక్కిన డ్రామాకు, ఉండవల్లి  తెర తీశారు. రెండు రోజుల క్రితం ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ, ఏపీ విభజన సరైందా, కాదా నిర్ణయించాలని సుప్రీం కోర్టును కోరుతున్నానని అదేదో కొత్త విషయం అయినట్లు చెప్పుకొచ్చారు. రాష్ట్ర విభజనపై తనతో పాటు 22 మంది పిటిషన్లు దాఖలు చేశారని   సుప్రీంకోర్టులో విచారణ జరిగిందని ఆయన గుర్తు చేశారు. అయితే రాష్ట్ర విభజనకు అభ్యంతరం లేదని  ఏపీ ప్రభుత్వ లాయర్ సుప్రీం కోర్టులో చెప్పారన్నారు. ఇదంతా సీఎం జగన్ కు తెలిసే  జరుగుతోందా తెలియకుండా జరుగుతుందా అని ఆయన ప్రశ్నించారు. జగన్ కు తెలిసే జరిగితే ఏపీకి జగన్ ద్రోహం చేసినట్టేనని ఉండవల్లి  డ్రామాకు తెర తీశారు. ఇక అక్కడి నుంచి సజ్జల  ఆయన వెంట బొత్స సమైక్య రాగాన్ని అందుకున్నారు. మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాగలిగితే తొలుత స్వాగతించేది తామేనంటూ వైసీపీ నాయకులు ఒకరి వెంట ఒకరు సన్నాయి నొక్కులు ఒక్కుతున్నారు. 

అయితే  ఇదంతా కేసేఆర్, జగన్ రెడ్డి సంయుక్తంగా అడిస్తున్న నాటక మని అందరికీ తెలిసి పోయింది. నిజానికి, హైదరాబాద్ లో వైఎస్సార్ టీపీ నేత షర్మిల అరెస్ట్  డ్రామాతోనే, సెంటిమెంట్ ను రగిల్చే ప్రయత్నాలు మొదలయ్యాయనే విషయం తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది. ఈ విషయాన్ని పసిగట్టే, ప్రధాని నరేంద్ర మోడీ, ఢిల్లీలో జీ 20 సదస్సు సన్నాహక సమావేశంలో కలిసిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని  తెలంగాణ ప్రభుత్వం సోదరి షర్మిలను అరెస్ట్  చేసినా  ఎందుకు స్పందించలేదని ప్రశ్నించి నట్లు వార్తలొచ్చాయి. నిజానికి  తెలంగాణ ఉద్యమ ఆనవాలు లేకుండా చేసిన కేసీఆర్, ఇప్పడు   రాజకీయ అవసరాలకోసం తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని సమాన్య ప్రజలకు కూడా అర్థమైపోయిందని తెలంగాణ ఉదయమ కారులు అంటున్నారు.

షర్మిల ఉదంతం, ఇప్పుడు సజ్జల డ్రామా  మరో వంక సింగరేణిని కేంద్రం ప్రైవేటు పరం చేస్తోందంటూ  అదే జరిగితే మరో తెలంగాణ ఉద్యమం చూడవలసి వస్తుందంటూ మంత్రి కేటీఆర్ చేసిన ప్రకటనలు చూస్తే కేసీఆర్ తెలంగాణ  సెంటిమెంట్ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.అయితే కేసీఆర్, జగన్ రెడ్డి తమ రాజకీయ అవసరాల కోసం ముగిసిన అధ్యాయాన్ని మళ్ళీ మొదటికి తేవాలని ప్రయత్నించినా ప్రజలు నమ్మే పరిస్థతి లేదని  పరిశీలకులు భావిస్తున్నారు.