TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కర్ణాటక స్టింగ్ ఆಪరేషన్ కలకలం: కుమారస్వామికి బిగుస్తున్న ఉచ్చు.!

Published on: Mon Nov 2, 2026 1:29PM

కర్ణాటక  రాజకీయాలలో పెను సంచలనంగా మారిన  స్టింగ్ ఆపరేషన్  ఉదంతం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసుల విచారణలో సంచలన వివరాలు వెలుగులోకి వచ్చాయి.  ఈ కేసుకు సంబంధించి కీలకమైన ఒక మొబైల్ ఫోన్ లింకులు నేరుగా కేంద్ర మంత్రి, జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి  వరకూ వెళ్లాయి.  

బెంగళూరు పోలీసు కమిషనర్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ కేసులో నిందితుడిగా ఉన్న రితేష్ పాండే విచారణ సమయంలో కీలక విషయాలు వెల్లడించాడు. దిల్లీలోని కరోల్ బాగ్ మార్కెట్‌లో వినోద్ శర్మతో కలిసి తాను ఒక  మొబైల్ ఫోన్‌ను కొనుగోలు చేసినట్లు తెలిపాడు. కుమారస్వామి సోషల్ మీడియా బృందంతో సంబంధం ఉన్న ప్రజ్వల్ ప్రసాద్ సూచనల మేరకే తాను ఈ మొబైల్ ఫోన్ కొనుగోలు చేసినట్లు  రితీష్ పాండే విచారణలో అంగీకరించారు. 

ఫోన్ కొనుగోలు చేసిన అనంతరం రితేష్ పాండే, వినోద్ శర్మ ఇద్దరూ నేరుగా దిల్లీలోని కుశక్ రోడ్‌లో ఉన్న కుమారస్వామి అధికారిక నివాసానికి వెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. అక్కడ ఆ మొబైల్ ఫోన్‌ను నేరుగా ప్రజ్వల్ ప్రసాద్‌కు అందజేసినట్లు నిందితుడు పేర్కొన్నాడు.  ఈ వివరాలన్నీ  నిందితుడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే  తెలిశాయనీ, వీటిని  స్వతంత్రంగా ధృవీకరించాల్సి ఉందని బెంగళూరు పోలీసు కమిషనర్ తెలిపారు.   ఈ ఫోన్ మార్పిడి వ్యవహారంలో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరి పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

ఈ కేసులో భాగంగా విచారణకు హాజరు కావాల్సిందిగా ప్రజ్వల్ ప్రసాద్‌తో పాటు వినోద్ శర్మకు పోలీసులు  నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ, నిందితులు ఇద్దరూ ఇప్పటివరకు దర్యాప్తు అధికారుల ఎదుట హాజరుకాలేదు. అంతేకాకుండా, వారు చట్టపరమైన మార్గాలను ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నిందితుడు రితేష్ పాండే చెప్పిన అంశాలను నిర్ధారించుకునేందుకు దర్యాప్తు బృందాలు  దర్యాప్తు చేస్తున్నాయి. 

మరోవైపు, ఈ స్టింగ్ వీడియోనుఎలా రికార్డు చేశారు, ఆ తర్వాత సోషల్ మీడియాలో దీన్ని ఎక్కడెక్కడ సర్క్యులేట్ చేశారనే కోణంలోనూ పోలీసులు విచారణను ముమ్మరం చేశారు.  ఒరిజినల్ ఫుటేజ్‌ను రికార్డు చేయడానికి ఉపయోగించారనే అనుమానం ఉన్న మొబైల్ ఫోన్‌ను పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకుని, ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. అలాగే..  ఈ వీడియోను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడానికి పూర్తిగా వేరొక ఫోన్‌ను ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో రానున్న రోజుల్లో మరిన్ని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసు వర్గాలు వెల్లడించాయి.


[Karnataka Sting Operation Controversy, HD Kumaraswamy, Karnataka, Sting Video, Union Minister Kumaraswamy, Residence, Ritesh Pandey, Vinod Sharma, Telugu One]