తెలుగు రాష్ట్రాలలో మెగా ఫ్యామిలీకి పదవుల పంట.. తాజాగా సుస్మిత కొణిదెలకూ.!
Published on: Tue Sep 8, 2026 2:55PM

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డుకు చిరంజీవి కుమార్తె సస్మిత కొణిదెలను ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం (సెప్టెంబర్ 8) ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో చిరంజీవి సోదరుడు, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఏపీ గ్రీన్ ఛైర్ పర్సన్ గా ఉన్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలలో చిరు ఫ్యామిలీకి ప్రభుత్వాలు ప్రత్యేక గుర్తిపు ఇస్తూ పదవులు పందేరం చేస్తున్న తీరుపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇటీవల తెలంగాణ సర్కార్ చిరంజీవి సతీమణి సురేఖను యాదాద్రి ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా నియమించిన సంగతి తెలిసిందే. తాజాగా చిరు కుమార్తెను ఏపీ సర్కార్ బెజవాడ కనకదుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమించింది.

దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు పేరుతో వెలువడిన ఈ నియామక ఉత్తర్వుల ప్రకారం, కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలు, ఆలయ సర్వతోముఖాభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, పవిత్ర ఉత్సవాల నిర్వహణలో సుస్మిత తన వంతు పాత్ర పోషిస్తారు. ఆలయ అభివృద్ధికి సంబంధించి ఆమె సూచనలు, సలహాలను ప్రభుత్వానికి, అధికారులకు అందిస్తారని ఆ ఉత్తర్వులలో స్పష్టం చేశారు.
ప్రస్తుతం టాలీవుడ్ లో కాస్ట్యూమ్ డిజైనర్‌గా, నిర్మాతగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సుస్మితను దుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమించడం పట్ల ఒకే సమయంలో హర్షాతిరేకాలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
[Kanaka Durga Temple Board Post To Sushmita Konidela, Vijayawada Indrakeeladri, Mega Family, AP Government Temple Appointments, Telugu One]


