TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కల్యాణ దుర్గానికి కృష్ణా జలాలు: ఇక కరవు నేల సస్యశ్యామలం.!

Published on: Mon Oct 26, 2026 12:31PM

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజల దశాబ్దాల నిరీక్షణకు తెర దించుతూ కృష్ణా జలాలు ఆ నేలన తాకాయి. కళ్యాణదుర్గం మండలం చాపిరి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో స్థానికఎమ్మెల్యే  అమిలినేని సురేంద్ర బాబు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, వేలాది మంది రైతులతో కలిసి కృష్ణా  జలాలకు సాంప్రదాయబద్ధంగా గంగపూజ నిర్వహించి, జలహారతి సమర్పించారు. అనంతరం నీటిని  విడుదల చేశారు.

 నియోజకవర్గ ప్రజల దాహార్తిని తీర్చడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కల్యాణదుర్గానికి కృష్ణా జలాలను అందించిందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర అన్నారు.   ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అందించిన పూర్తి సహకారం వల్లనే  ఇది సాధ్యమైందన్నారు.  సాంకేతిక, ఆర్థిక అడ్డంకులను అధిగమించి కృష్ణా నీటిని నియోజకవర్గానికి తీసుకురావడం పట్ల   ఆనందం వ్యక్తం చేశారు.

 ఎస్సార్సీ నిర్మాణ సంస్థ భాగస్వామ్యంతో దాదాపు  10 కోట్ల రూపాయల వ్యయంతో  8 రోజుల వ్యవధిలోనే కాలువ తవ్వకం పనులను పూర్తి చేశామన్న ఆయన,  ఈ బృహత్తర కార్యం కోసం   20 పొక్లెయిన్లను  ఉపయోగించి రాత్రింబవళ్లు పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఎంతో కాలంగా ఎండిపోయిన భూములను ఇక కృష్ణాజలాలు సస్యశ్యామలం చేయనున్నాయన్నారు. 

 2018లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో  951 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రారంభించిన బీటీపీ కాలువ పనులను వైకాపా హయాంలో నిర్లక్ష్యం చేశారనీ,    ఆ పనులను నిలిపివేశారనీ, దీనివల్ల   తీవ్రమైన సాగునీటి , తాగునీటి కొరత ఏర్పడిందని ఎమ్మెల్యే చెప్పారు.  ప్రస్తుతం  తీవ్ర ఆర్థిక ఇబ్బందుల ఉన్నప్పటికీ, సంక్షేమం, అభివృద్ధి పనులను ఆపబోమన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి  బీటీపీ ప్రాజెక్టును అన్ని కోణాల్లో సంపూర్ణంగా పూర్తి చేసి, మొత్తం కళ్యాణదుర్గం ప్రాంతాన్ని  సస్యశ్యామలం చేస్తామని చప్పారు. పెండింగ్‌లో ఉన్న ప్రతి కాలువ పనిని వేగవంతం చేసి నియోజకవర్గంలో చివరి ఆయకట్టు వరకు నీరందించే బాధ్యత తమదేనని భరోసా ఇచ్చారు.

తాజాగా విడుదల చేసిన కృష్ణా జలాల వల్ల ఒక్క చాపిరి గ్రామానికే కాకుండా దానికి అనుబంధంగా ఉన్న దాదాపు 8 గ్రామాల పరిధిలోని భూగర్భ జలాలు గణనీయంగా పెరగుతాయన్నారు. అలాగే కళ్యాణదుర్గం పట్టణ పరిధిలోని తాగునీటి బోరుబావుల్లో కూడా నీటి మట్టం పెరిగి పట్టణ ప్రజల దాహార్తి తీరుతుందన్నారు.   ఈ సందర్భంగా కాలువ నిర్మాణ పనుల కోసం,  ప్రాజెక్ట్ విస్తరణ కోసం స్వచ్ఛందంగా   భూములను ఇచ్చిన స్థానిక రైతులను ఎమ్మెల్యే  సన్మానించారు.

రాబోయే రోజుల్లో మిగిలిన కాలువల నిర్మాణం కూడా పూర్తయితే కళ్యాణదుర్గం మెట్ట ప్రాంతానికి శాశ్వత సాగునీటి పరిష్కారం లభిస్తుందని స్థానికులు ఆశిస్తున్నారు. సమయానికి నీరు అందుబాటులోకి రావడంతో రాబోయే సాగు సీజన్‌కు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయని వ్యవసాయ వర్గాలు భావిస్తున్నాయి.  

[Kalyandurg Krishna Waters, MLA Amilineni Surendra Babu, Chapiri Gangapuja, BTP Canal works, Anantapur Irrigation, Telugu One]