ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ ఇక లేరు.. చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి.!
Published on: Wed Sep 30, 2026 5:06AM

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, వన్‌నెస్ సంస్థ వ్యవస్థాపకుడు కల్కి భగవాన్ ఇక లేరు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (సెప్టెంబర్ 29) కన్నుమూశారు. ఆయన మరణవార్త తెలుసుకున్న దేశవిదేశాలలోని ఆయన అనుచరులు, భక్తులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాధారణ జీవితాన్ని గడుపుతూ, అంచెలంచెలుగా ఎదిగి ఆధ్యాత్మిక రంగంలో ఒక ప్రత్యేక శకం సృష్టించిన ఆయన ప్రస్థానం ముగిసింది. కల్కి భగవాన్ అసలు పేరు విజయ్ కుమార్ నాయుడు. మొదటిలో సాధారణ జీవితాన్ని గడిపిన ఆయన తమిళనాడులోని నాథమ్ గ్రామంలో జన్మించారు. జీవనోపాధి కోసం ఎల్ఐసీలో ఉద్యోగం చేశారు. అయితే ఆధ్యాత్మిక మార్గంపై మక్కువతో ఉద్యోగం మానేశారు.
1980ల చివరి దశకంలో ఆయన చిత్తూరు జిల్లా పరిధిలోని ప్రాంతంలో 'జీవాశ్రమం' పేరుతో ఒక రెసిడెన్షియల్ పాఠశాల ప్రారంభించారు. అక్కడి నుంచే ఆయన ఆలోచనా విధానం విస్తృతమైంది. కాలక్రమేణా ఆయన తన బోధనలను విస్తరింపజేస్తూ, తనను తాను కల్కి భగవాన్‌గా ప్రకటించుకున్నారు. ఆయన భార్య పద్మావతితో కలిసి చేపట్టిన ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో, భక్తులు వారిద్దరినీ 'అమ్మ భగవాన్' అని కొలవడం ప్రారంభించారు.

కాలం గడుస్తున్న కొద్దీ ఈ సంస్థ పరిధి కేవలం స్థానిక ప్రాంతానికే పరిమితం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. తిరుపతి జిల్లాలోని వరదయ్యపాళెం మండలం బట్టలవలం కేంద్రంగా ఏకమ్ క్షేత్రం, గోల్డెన్ సిటీ రూపంలో భారీ ఆధ్యాత్మిక సముదాయాన్ని నిర్మించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ధ్యాన కేంద్రాలు, ఆధ్యాత్మిక శిబిరాలు దేశ విదేశాల నుంచి పర్యాటకులను, భక్తులను విపరీతంగా ఆకర్షించాయి.
ముఖ్యంగా దీక్ష అనే భావన ద్వారా భక్తులలో మానసిక ప్రశాంతతను, దివ్యత్వాన్ని పెంపొందించవచ్చనే సిద్ధాంతాన్నికల్కి భగవాన్ ప్రచారం చేశారు. పాశ్చాత్య దేశాల నుంచి కూడా లక్షలాది మంది అనుచరులు ఈ సంస్థతో మమేకమయ్యారు. కార్పొరేట్ శైలిలో ఆధ్యాత్మికతను బోధించడంలో ఆయన అనుసరించిన పద్ధతులు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఇండియాలోనే కాకుండా ఆఫ్రికా, అమెరికా వంటి విదేశాలలోనూ ఈ సంస్థకు శాఖలు ఉన్నాయి. మానవుడి చేతనను ఉన్నత స్థాయికి చేర్చడమే లక్ష్యంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించారు.
అయితే.. కల్కి భగవాన్ ఆధ్యాత్మిక ప్రయాణంలో వివాదాలు, విమర్శలు కూడా ఎదురయ్యాయి. సంస్థ ఆస్తులకు సంబంధించి గతంలో జరిగిన పరిణామాలు, ఐటీ సోదాలు వంటి అంశాలు మీడియాలోనూ, ప్రజల్లోనూ తీవ్ర చర్చకు దారితీశాయి. అయినప్పటికీ.. ఆయన బోధనలను విశ్వసించే క భక్తుల సంఖ్య మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు.
ఆయన మరణంతో తిరుపతి జిల్లా వరదయ్యపాళెంలోని ఏకమ్ క్షేత్రం వద్ద భారీగా భక్తులు చేరుకుంటున్నారు. ట్రస్ట్ నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం, భక్తుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని ఆశ్రమంలో ఉంచనున్నారు. దేశ విదేశాల నుంచి వచ్చే వేలాది మంది అభిమానులు, శిష్యులు చివరిచూపు దక్కించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక సాధారణ ఎల్‌ఐసీ ఉద్యోగి స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలో లక్షలాది మందికి మార్గదర్శనం చేసిన ద ఆధ్యాత్మిక గురువుగా ఎదిగిన కల్కి భగవాన్ ఇక లేరు.
[Kalki Bhagwan, Vijay Kumar Naidu, Kalki Bhagavan Nomore, Oneness Foundation, Spiritual Guru Death, Telugu One]


