రంగు మారిన కృష్ణా జలాలు: చేపలు మృత్యువాత.. జల కాలుష్యంపై మత్స్యకారుల ఆందోళన.!
Published on: Tue Oct 6, 2026 11:47AM
తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో కీలకమైన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణా నది నీరు ముదురు ఆకుపచ్చ రంగులోకి మారడం కలకలం రేపుతోంది. గత కొన్ని రోజులుగా బ్యాక్‌వాటర్‌లో నీటి రంగులో మార్పు కనిపిస్తుండటంతో స్థానికులు, మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి నుంచి దుర్వాసన వస్తోందని, కొన్ని ప్రాంతాల్లో చేపలు మృత్యువాత పడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు ప్రాంతంలో గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి లేదని అంటున్నారు. నీటి ఉపరితలంపై ముదురు ఆకుపచ్చ రంగు పొర కనిపించడంతో పాటు దుర్వాసన కూడా వస్తోందని స్థానికులు చెబుతున్నారు.
జూరాల ప్రాజెక్టు గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు కూడా కీలకమైన జలవనరు కావడంతో నీటి నుంచి దుర్వాసన రావడం, నీటి రంగుమారడంతో నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. స్థానికుల ఫిర్యాదు మేరకు ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్టు వద్ద పరిశీలన చేపట్టారు. అక్కడ సుమారు 30 నుంచి 40 శాతం మేర నీరు ఆకుపచ్చగా కనిపించినట్లు అధికారులు గుర్తించారు. నీటి నమూనాలను సేకరించి పరీక్షల కోసం ప్రయోగశాల పరీక్షలకు పంపించారు. ఫలితాలు రావాల్సి ఉంది.
అదలా ఉంటే.. నీటి కాలుష్యం కాదనీ, నాచు కారణంగానే నీరు ఆకుపచ్చగా కనిపిస్తోందన్న అభిప్రాయం కూడా వ్యక్తమౌతోంది. అయితే స్థానికులు మాత్రం ఎగువ ప్రాంతాలలోని పరిశ్రమల వ్యర్థాలు నదిలో కలవడం వల్లనే నీరు కాలుష్యమైందని అంటున్్నారు. కర్ణాటకలోని రాయచూరు పారిశ్రామిక ప్రాంతాల నుంచి వచ్చే రసాయన వ్యర్థాల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.
అయితే అధికారులు మాత్రం నాచు కారణంగానే నీటి రంగు మారిందని అంటున్నారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పరిశీలించిన నీటి నమూనాల్లో రసాయన కాలుష్యానికి సంబంధించిన ఆధారాలు కనిపించలేదని నివేదికలను ఉటంకిస్తూ అధికారులు చెబుతున్నారు. అయితే చేపలు మృత్యువాతకు నాచు కాదు నీటి కాలుష్యమే కారణమని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.

అంతే కాకుండా నీటిలో దిగిన తమకు దురద, అలర్జీ వంటి సమస్యలు ఎదురవుతున్నాయని అంటున్నారు. అయితే ఇప్పటి వరకూ కాలుష్యాన్ని నిర్ధారించే ఆధారాలు లేవని ఇరిగేషన్ అధికారులు అంటున్నారు. మొత్తంగా నీటి నమూనాలను సేకరించి పరీక్షల కోసం ప్రయోగశాల పరీక్షలకు పంపామనీ, ఫలితం వచ్చిన తరువాతనే ఒక నిర్ణయానికి రాగలమని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని నాగార్జునసాగర్ వద్ద కూడా కొన్ని ప్రాంతాల్లో నీరు ఆకుపచ్చగా మారడం గమనార్హం. అక్కడ కూడా కాలుష్య నియంత్రణ అధికారులు నీటిని పరీక్షించగా రసాయన కాలుష్యానికి సంబంధించిన ఆధారాలు లభించలేదని, అడుగుభాగంలోని నాచు పైకి రావడం వల్ల నీరు ఆకుపచ్చగా కనిపిస్తోందని ప్రాజెక్టు అధికారులు పేర్కొన్నారు.
ప్రస్తుతం జూరాల వద్ద నీటి నమూనాల పరీక్షా ఫలితాల కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. నీటి రంగు మారడానికి నాచే కారణమా, లేక కాలుష్యమా? చేపల మృతికి అసలు కారణం ఏమిటి? అన్న ప్రశ్నలకు ప్రయోగశాల నివేదికలతోనే స్పష్టత వస్తుంది.
[Jurala Project Water Colour Green, Krishna River Pollution, Gadwal, Fish deaths, Telangana Water Pollution, Telugu One]


