TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జోగి రమేష్ కుటుంబం నుంచి ప్రాణహాని: మహిళా కమిషన్ ను ఆశ్రయించిన జోగి మేఘన.!

Published on: Thu Oct 1, 2026 4:05PM

అత్తింటి వారి నుంచి తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందంటూ మాజీ మంత్రి జోగి రమేష్ కోడలు జోగి మేఘన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు తనను ఫాలో అవుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తనకు, తన కుటుంబానికీ రక్షణ కల్పించాలంటూ మహిళాకమిషన్ ను  ఆశ్రయించారు.  

జోగి మేఘన తన తండ్రి కృష్ణ, కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం (సెప్టెంబర్ 30)  గుంటూరు జిల్లా మంగళగిరిలోని మహిళా కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజను నేరుగా కలిసి తనకు, తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె తన అత్తింట ఎదుర్కొన్న ఇబ్బందులు, వేధింపులను మహిళాకమిషన్ చైర్ పర్సన్ కు వివరించారు. తనకు రక్షణ కల్పించాలంటూ వినతి పత్రం సమర్పించారు.  

తమపై ప్రత్యక్షంగా,  పరోక్షంగా ఒత్తిళ్లు పెరుగుతున్నాయని, జోగి కుటుంబానికి చెందిన వ్యక్తులు తమను నిరంతరం  ఫాలో అవుతూ  భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్న మేఘన, ఈ వివాదానికి సంబంధించి పోలీసుల దర్యాప్తు పారదర్శకంగా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిగించాలని డిమాండ్ చేశారు.  

మేఘన చేసిన ఫిర్యాదును పరిశీలించిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ, మేఘన తరఫున వచ్చిన లాయర్‌తో కూడా మాట్లాడి, ఈ కేసుకు సంబంధించిన ప్రతి  అంశాన్ని  రికార్డు చేశారు. బాధితురాలి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని, న్యాయపరంగా సంపూర్ణ సహకారం అందిస్తామని ఈ సందర్భంగా చైర్‌పర్సన్ భరోసా కల్పించారు. అవసరమైతే  తెలంగాణ మహిళా కమిషన్‌తో కూడా సంప్రదింపులు జరిపి,   పోలీసు రక్షణను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని శైలజ హామీ ఇచ్చారు.  

[Jogi Meghana, Jogi Ramesh Family Harrasment, Complaint, Women Commission, Rayapati Sailaja, Andhra Pradesh, Dowry Harassment Case, Telugu One]