ఛత్రోన్ కీ గూంజ్ వర్సెస్ ఝూట్ కీ గూంజ్.!
Published on: Tue Sep 1, 2026 2:43PM
.webp)
దేశ రాజకీయాల్లో డిజిటల్ వేదికల ద్వారా రాజకీయ నాయకుల వాదనలను విశ్లేషించే ధోరణి ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ యువతను ఉద్దేశించి చేపట్టిన ఒక ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. ప్రధానంగా, వివిధ వేదికలపై ఆయన వెల్లడించిన ఉద్యోగ, సామాజిక, విద్యార్థుల సమస్యలకు సంబంధించిన గణాంకాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాహుల్ గాంధీ ప్రచార శైలికి స్పందనగా వెలువడిన ఒక విశ్లేషణాత్మక డిజిటల్ నివేదిక, ఆయన మాట్లాడిన అంశాల్లోని నిజానిజాలను ప్రశ్నిస్తూ ఒక కొత్త రాజకీయ విమర్శకు తెరలేపింది. రాహుల్ గాంధీ ఛత్రోన్ కీ గూంజ్ పేరుతో దేశంలోని పలు ప్రాంతాల్లో విద్యార్థులు, నిరుద్యోగ యువత, గిగ్ వర్కర్లతో ఆత్మీయ సమావేశాలను నిర్వహించారు. జూన్ నెల నుండి ప్రారంభమైన ఈ సమావేశాల్లో కోటా, డెహ్రాడూన్, ప్రయాగ్రాజ్, పుణే వంటి ప్రధాన నగరాలు భాగమయ్యాయి.
ఈ సమావేశాల్లో రాహుల్ గాంధీ ఉపాధి అవకాశాల కొరత, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో జాప్యం, జాతీయ స్థాయిలో జరిగే నీట్ వంటి పోటీ పరీక్షల్లో అవకతవకలు, దేశంలో మహిళల భద్రతా పరిస్థితులపై ఓ రేంజ్ విమర్శలు గుప్పించారు. ఈ సమావేశాల్లో ఆయన గణాంకాలను, శాతాలను ప్రస్తావిస్తూ ప్రస్తుత ప్రభుత్వ విధానాలే ఈ పరిస్థితికి కారణమని ఆరోపణలు గుప్పించారు. అయితే, రాహుల్ గాంధీ ప్రసంగాల్లో పేర్కొన్న వివరాలపై సవాలు విసురుతూ ఝూట్ కీ గూంజ్ పేరుతో ఒక ఫ్యాక్ట్ చెక్ ఆన్‌లైన్ వేదిక తెరపైకి వచ్చింది. ఈ ప్లాట్‌ఫారమ్ ఆయన నాలుగు ప్రధాన ర్యాలీల్లో చేసిన దాదాపు 40 రకాల వాదనలను సమగ్రంగా పరిశీలించి, సేకరించిన అధికారిక సమాచారం, ఆధారాల ఆధారంగా ఆ 40 వాదనల్లో 29 అంశాలు పూర్తిగా వాస్తవ దూరమనీ, మిగిలిన 11 అంశాలు ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని విశ్లేషించింది. ఈ విశ్లేషణ కోసం వందకు పైగా విశ్వసనీయ మూలాలను, ప్రభుత్వ నివేదికలను ఆధారంగా చేసుకున్నామని ఝూట్ కీ గూంజ్ ఈ ఫ్యాక్ట్ చెక్ పేర్కొంది. ఫ్యక్ట్ చెక్ నివేదిక ప్రధానంగా కొన్ని గణాంకాలను తప్పుపట్టింది.

రాహుల్ గాంధీ తన ప్రసంగాల్లో ప్రతి 150 మంది అభ్యర్థుల్లో ఒక్కరికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగం వస్తోందని, అలాగే వేలమందిలో కొద్దిమందికే శాశ్వత ఉద్యోగాలు లభిస్తున్నాయని అన్నారు. అలాగే మహిళలపై జరుగుతున్న హింస, అత్యాచారాల నమోదు శాతాలపై ఆయన చెప్పిన వివరాలు అధికారిక జాతీయ నేర రికార్డుల బ్యూరో, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే డేటాతో సరిపోలడం లేదని నివేదిక స్పష్టం చేసింది. క్షేత్రస్థాయి వాస్తవాలను అతిశయోక్తిగా చూపించడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నం జరుగుతోందని ఈ నివేదిక అభిప్రాయపడింది. న్యాయపరమైన, పత్రికా స్వేచ్ఛ కోణంలో చూస్తే.. ఈ తరహా ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్లు ఎడిటోరియల్ జడ్జిమెంట్‌ను మాత్రమే ప్రతిబింబిస్తాయి తప్ప అంతిమ తీర్పులు కావని తేల్చింది.
ప్రజా ప్రతినిధుల వ్యాఖ్యలను పరిశీలించడం, వాటిపై విమర్శలు చేయడం ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమే అయినప్పటికీ.. అధికారిక గణాంకాల్లో ఉండే పరిమితులు, క్షేత్ర స్థాయిలో ఉన్న నివేదించబడని సమస్యలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ.. చట్టపరమైన చిక్కులు రాకుండా సదరు వేదిక తమ నివేదికలను కేవలం ఒక పరిశీలనాత్మక కోణంగానే డిస్క్లైమర్ రూపంలో పొందుపరిచింది. రాజకీయంగా ఈ అంశంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పక్షం ఈ నివేదిక ఆధారంగా కాంగ్రెస్ నాయకత్వంపై విమర్శలు గుప్పిస్తూ, విపక్షాలు కేవలం అసత్య ప్రచారాల ద్వారా యువతను రెచ్చగొడుతున్నాయని ఆరోపిస్తోంది. మరోవైపు, ప్రధాన సమస్యలైన నిరుద్యోగం, పరీక్షల లీకేజీల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇటువంటి డిజిటల్ నివేదికలను మరియు కౌంటర్ నారేటివ్‌లను తెరపైకి తెస్తున్నారని విపక్షాలు చెబుతున్నాయి.
క్షేత్రస్థాయిలో యువత ఎదుర్కొంటున్న కష్టాలు నిజమని, గణాంకాల సాంకేతికత కంటే వారి సమస్యల తీవ్రత ముఖ్యమని కాంగ్రెస్ బల్లగుద్ది చెబుతోంది. ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా , డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు రాజకీయ సంభాషణను ఎంతగా ప్రభావితం చేస్తున్నాయో ఈ పరిణామం అద్దం పడుతోంది. ఒకవైపు రాజకీయ నాయకులు తమ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రత్యక్ష సమావేశాలను వేదికగా చేసుకుంటుంటే, మరోవైపు ప్రత్యర్థులు, విశ్లేషకులు డిజిటల్ ఆధారాల ద్వారా ఆ వ్యాఖ్యల నాణ్యతను సవాలు చేస్తున్నారు. ఇది ఒక విధంగా రాజకీయ నాయకులలో మరింత బాధ్యతాయుతమైన ప్రసంగ సంస్కృతిని పెంచడానికి దోహదపడుతుందన్న అభిప్రాయాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
ముందుముందు రాబోయే ఎన్నికల ప్రచారాల్లో ఈ డేటా ఆధారిత రాజకీయ పోరు మరింత తీవ్రమయ్యే అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. నాయకులు చెప్పే ప్రతి మాట, ఇచ్చే ప్రతి గణాంకం తక్షణమే డిజిటల్ విశ్లేషణకు గురవుతున్న నేపథ్యంలో.. రాజకీయ ప్రచారాల్లో పారదర్శకత, ఖచ్చితత్వం కీలకంగా మారనున్నాయి. ప్రజలు కూడా కేవలం ఉపన్యాసాలను మాత్రమే కాకుండా, వాటి వెనుక ఉన్న వాస్తవాలను సరిచూసుకునే చైతన్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా https://TeluguOne.com పోర్టల్‌ను అనుసరించండి, మీ స్నేహితులతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.
[Jhoot Ki Goonj fact-check report on Rahul Gandhi remarks, Rahul Gandhi, Echo of Students, Echo of Lies, Fact-check report, Indian politics]


