TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

స్విస్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ జెమీమా రోడ్రిగ్స్: స్టార్ క్రికెటర్ అరుదైన గౌరవం.!

Published on: Sat Oct 17, 2026 3:37PM

భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఆల్ రౌండర్ జెమీమా రోడ్రిగ్స్‌కు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. స్విట్జర్లాండ్ పర్యాటక రంగాన్ని ప్రమోట్ చేసేందుకు గాను ఆ దేశ పర్యాటక సంస్థ ఆమెను  ఫ్రెండ్‌షిప్ అంబాసిడర్ ఫర్ ఇండియగా  నియమించింది. భారత్ నుంచి ముఖ్యంగా యువ ప్రయాణికులను స్విట్జర్లాండ్‌కు మరింత పెద్ద సంఖ్యలో ఆకర్షించడమే లక్ష్యంగా ఈ భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు స్విస్ టూరిజం ప్రతినిధులు వెల్లడించారు.

బెంగళూరు వేదికగా జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో స్విట్జర్లాండ్ టూరిజం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) మార్టిన్ నైడెగ్గర్ సమక్షంలో ఈ నియామకానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఈ కొత్త బాధ్యత ద్వారా జెమీమా రోడ్రిగ్స్ ఏడాది పొడవునా నాలుగు విభిన్న కాలాల్లో స్విట్జర్లాండ్‌లో పర్యటించనున్నారు. కేవలం ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలే కాకుండా, సాధారణంగా పర్యాటకులకు అంతగా తెలియని కొత్త ప్రదేశాలు, స్థానిక సంస్కృతి, సాహస క్రీడలు, ఆహారపు అలవాట్లను భారతీయ పర్యాటకులకు పరిచయం చేయడం లక్ష్యంగా జెమీమా రోడ్రిగ్స్ పని చేస్తారు. 

ప్రపంచవ్యాప్తంగా స్విట్జర్లాండ్‌ను సందర్శించే విదేశీ పర్యాటకులలో భారతదేశం మొదటి 10 దేశాల జాబితాలో ఉంది.  ఈ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడంలో భాగంగా స్విస్ టూరిజం  ట్రావెల్ బెటర్ అనే నూతన విధానాన్ని తీసుకువచ్చింది.   తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాలు చుట్టిరావడం కంటే, ఒకే చోట ఎక్కువ రోజులు గడుపుతూ అక్కడి ప్రకృతిని, స్థానిక జీవన విధానాన్ని సంపూర్ణంగా అనుభవించేలా భారతీయ యువతను ప్రోత్సహించడం ఈ విధానం లక్ష్యం.

తనను ఫ్రెండ్ షిప్ అంబాసిడర్ ఆఫ్ ఇండియాగా స్విస్ పర్యాటక సంస్థ నియమించిన సందర్భంగా   జెమీమా రోడ్రిగ్స్  అంతర్జాతీయ వేదికలపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం తనకెప్పుడూ గర్వకారణమని తెలిపారు. స్విట్జర్లాండ్ లోని సాంప్రదాయ ప్రదేశాలకంటే భిన్నమైన కొత్త విషయాలను కనుగొనడం, అక్కడి ప్రజలతో మమేకం కావడం ,  ఆ అనుభవాలను దేశ ప్రజలతో పంచుకోవడం ఎంతో ఉత్సాహాన్నిస్తుందని జెమీమా పేర్కొన్నది.    

 ప్రస్తుత ఇండియన్ టూరిస్టులు సరికొత్త, వైవిధ్యమైన అనుభూతులను కోరుకుంటున్నారన్న స్విస్ టూరిజం సీఈఓ మార్టిన్ నైడెగ్గర్..  జెమీమా రోడ్రిగ్స్ కున్న అపారమైన ప్రజాదరణ, ఉత్సాహం, అందరితో సులభంగా   కలిసిపోయే స్వభావం తమ పర్యాటక ప్రచారానికి ఎంతగానో తోడ్పడతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. 


[Jemimah Rodrigues Swiss Tourism Brand Ambassador, Switzerland Friendship Ambassador India, Jemimah Rodrigues Cricketer, Swiss Tourism Martin Nydegger,Telugu One]