రెండో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్ మాజీ సతీమణి.!
Published on: Tue Sep 15, 2026 10:29AM

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ సతీమణి, నిర్మాత జెనిమా గోల్డ్‌స్మిత్ రెండో వివాహం చేసుకున్నారు. ప్రముఖ ఐరిష్-ఆస్ట్రేలియన్ మల్టీ-మిలియనీర్ ఫైనాన్షియర్ కామెరాన్ ఓరైల్లీని వివాహం చేసుకున్నారు. వీరి వివాహ వేడుక నిరాడంబరంగా జరిగింది. జెనిమా గోల్డ్ స్మిత్, కామెరాన్ ఓరైల్లీ గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. దాదాపు ఏడాది కాలంగా సహజీవనం చేస్తున్న వారు తాజాగా పెళ్లిబంధంతో ఏకమయ్యారు.
తామిరువురం వివాహం చేసుకున్నట్లు జెనిమా కుటుంబ సభ్యుల ద్వారా వెలుగులోకి వచ్చింది. జెనిమా సోదరుడు బెన్ గోల్డ్‌స్మిత్ భార్య జెనిమా జోన్స్ సామాజిక మాధ్యవ వేదికగా అధికారికంగా వెళ్లడించారు. అందమైన పచ్చని ల్యాన్‌లు, నీటి కొలనులతో కూడిన ఒక ఎస్టేట్‌లో ఈ వేడుక జరిగినట్లు పేర్కొన్నారు.

అదలా ఉండగా.. జెనిమా గోల్డ్‌స్మిత్ గతంలో పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను 1995లో వివాహం చేసుకున్నారు. దాదాపు తొమ్మిదేళ్ల పాటు వైవాహిక జీవితాన్ని గడిపిన అనంతరం, వీరిద్దరూ పరస్పర అంగీకారంతో 2004లో విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ వివాహం ద్వారా వారికి సులేమాన్, కాసిమ్ అనే ఇద్దరు కుమారులు జన్మించారు. విడాకుల తర్వాత జెనిమా బ్రిటన్‌కు తిరిగి వచ్చి, తన కుమారుల బాధ్యతలను చూసుకుంటూనే చిత్ర నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇక వరుడైన కామెరాన్ ఓరైల్లీ వయసు 62 సంవత్సరాలు. ప్రముఖ ఐరిష్ మీడియా దిగ్గజం దివంగత సర్ ఆంథోనీ ఓరైల్లీ కుమారుడు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో విద్యనభ్యసించిన ఆయన, ఆస్ట్రేలియాలోని ప్రముఖ మీడియా సంస్థల్లో మరియు ప్రైవేట్ ఈక్విటీ రంగంలో ఉన్నత పదవులను నిర్వహించారు. ఆయనకు కూడా గత వివాహం ద్వారా నలుగురు పిల్లలు ఉన్నారు.
రెండు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత జెనిమా గోల్డ్‌స్మిత్ మళ్లీ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టడంపై ఆమె శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖుల నుంచి ఈ నూతన దంపతులకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
[Jemima Goldsmith, Cameron OReilly, Imran Khan exwife, Jemima Goldsmith wedding, Irish millionaire financier]


