చేసిన తప్పులు దండంతో సరి: జేసీ పశ్చాత్తాపం.. ఫ్యాక్షన్ రాజకీయాలకు దూరం.!
Published on: Thu Oct 22, 2026 1:32PM

టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇక నుంచి తాను ఫ్యాక్షన్ రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. గతంలో చేసిన తప్పులకు క్షమాపణలు కోరారు. తాను ఏమంత మంచోడిని కాననీ, గతంలో ఫ్యాక్షన్ రాజకీయాల్లో భాగస్వామినయ్యానని బాహాటంగా అంగీకరించిన జేసీ ప్రభాకరరెడ్డి, ఇప్పుడు తాను పూర్తిగా మారిపోయానని, ఇకపై ఫ్యాక్షన్ జోలికి వెళ్లబోనని చెప్పారు. ఫ్యాక్షన్ రాజకీయాల వల్ల ఈ ప్రాంతంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని, అనేక కుటుంబాలు నాశనమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒకప్పుడు ఫ్యాక్షన్ అంటే జేసీ కుటుంబం, జేసీ కుటుంబం అంటే ఫ్యాక్షన్ అనే పరిస్థితి ఉండేది. అనంతపురం రాజకీయాల్లో, ముఖ్యంగా తాడిపత్రి ప్రాంతంలో జేసీ కుటుంబం ఈ ఫ్యాక్షన్ రాజకీయాలలో కీలక పాత్ర పోషించింది. అటువంటి ఫ్యామిలీకి చెందిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. తన గత తప్పుల పట్ల క్షమాపణలు చెబుతూ..హింసాత్మక రాజకీయాల వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని పేర్కొంటూ.. ఫ్యాక్షన్ రాజకీయాలకు దూరంగా ఉండాలని ప్రజలకు పిలుపునివ్వడం పొలిటికల్ గా సెన్సేషన్ గా మారింది.

అనంతపురం జిల్లా యల్లనూరులో మాట్లాడిన ప్రభాకర్ రెడ్డి గతంలో తన వల్ల జరిగిన తప్పులకు పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు తెలిపారు. తన గత తప్పులను క్షమించమని ప్రజలను కోరారు. ఫ్యాక్షన్ గొడవల వల్ల జరిగిన నష్టాన్ని తలచుకుంటేనే బాధ కలుగుతుందన్న జేసీ ప్రభాకరరెడ్డి.. ప్రజలు ఎవరూ రాజకీయ గొడవల్లో చిక్కుకోవద్దని, ఎవరైనా రెచ్చగొట్టినా ఘర్షణలకు దిగొద్దని హితవు పలికారు.
[JC Prabhakar Reddy Appology Mistakes, , Tadipatri Politics, Faction Politics, Yellanur Meet, Vow No Faction Politics, Future, Telugu One]


