TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పదవీ కాలం ఏడాది ఉండగానే: సీనియర్ ఐఏఎస్ జయేష్ రంజన్ వీఆర్ఎస్.!

Published on: Tue Oct 27, 2026 1:20PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బ్యూరోక్రసీలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది.  సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కోసం ప్రభుత్వానికి దరఖాస్తు సమర్పించారు. ఈ నిర్ణయం రాష్ట్ర పాలనా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  తదుపరి సీఎస్ రేసులో  ఉన్న జయేష్ రంజన్ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోవడం సంచలనంగా మారింది. 

 ఉమ్మడి రాష్ట్రంలో   కడప, గుంటూరు, మెదక్ జిల్లాల  కలెక్టర్‌గా, హుడా  వైస్ చైర్మన్‌గా, అలాగే పర్యాటక శాఖ కార్యదర్శిగా, గిరిజన సంక్షేమ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా వివిధ సామాజిక రంగాల్లో దాదాపు పన్నెండేళ్లకు పైగా విశేష అనుభవాన్ని గడించారు.

తెలంగాణ   ఆవిర్భావం  తర్వాత ఐటీ, పరిశ్రమలు,  వాణిజ్య శాఖల కార్యదర్శిగా సుదీర్ఘ కాలం పాటు పనిచేశారు. హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ అయిన  టీ-హబ్ ఏర్పాటులో ఆయనది కీలక పాత్ర.  ప్రస్తుతం జయేష్ రంజన్ పట్టణాభివృద్ధి, మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి శాఖతో పాటు యూత్ అడ్వాన్స్‌మెంట్, పర్యాటక, క్రీడా శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

వాస్తవానికి ఆయన వచ్చే ఏడాది సెప్టెంబర్ లో  పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే గడువు కంటే ముందే ఆయన వీఆర్ఎస్ కోరడం వెనుక కారణాలపై రాజకీయ, అధికార వర్గాల్లో  చర్చోపచర్చలు జరుగుతున్నాయి. పాలనాపరమైన నిర్ణయాల్లో తన సీనియార్టీకి తగిన గుర్తింపు లభించలేదనే అసంతృప్తితోనే  ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. జయేష్ రంజన్  వీఆర్ఎస్ దరఖాస్తుపై నిబంధనల ప్రకారం కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ  డీవోపీటీ,   రాష్ట్ర ప్రభుత్వం   పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 


[Jayesh Ranjan Apply VRS, Telangana Senior IAS officer, Jayesh Ranjan IAS, TelanganaBbureaucracy, Telugu One]