TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జన్వాడ భూముల అసలు కథేంటి?..ఈడీ, ఐటీ జప్తు భూములు ఎలా చేతులు మారాయి..?

Published on: Sun Sep 20, 2026 4:17PM

సత్యం స్కాం భూములు.. కేటీఆర్ కుటుంబం చేతికి ఎలా వచ్చాయి..?

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జన్వాడ భూముల వివాదం అత్యంత సంచలనంగా మారింది. గులాబీ పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావుతో పాటు ఇతర ముఖ్య నేతల హయాంలో జరిగిన వేల ఎకరాల బినామీ భూకుంభకోణాలపై తీవ్ర చర్చ జరుగుతోంది. 2014 నుంచి 2023 మధ్య కాలంలో అసైన్డ్, ఇనాం, సర్కారు, ఎనిమీ  నిషేధిత భూములు ఏ ఒక్కడూ వదలకుండా ఆక్రమించారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా జన్వాడ ఫామ్‌హౌజ్ చుట్టూ తిరుగుతున్న పరిణామాలు విస్మయానికి గురిచేస్తున్నాయి. అసలు ఈ భూముల వెనుక ఉన్న అసలు మోడస్ ఆపరేండీ ఏంటో తెలిస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.

ఈ వివాదంలో ప్రధానంగా జన్వాడలోని 301, 311, 313 సర్వే నెంబర్లకు సంబంధించిన భూములు తెరపైకి వచ్చాయి. సంచలనం సృష్టించిన రామలింగరాజు బాపతు సత్యం కుంభకోణంలో భాగంగా, ఈ భూములను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)  ఆదాయపు పన్ను శాఖ (IT) జప్తు చేసి బ్లాక్‌లిస్ట్ చేశాయి. చట్టపరంగా ఈ భూములను ఎవరూ కొనడానికి లేదా అమ్మడానికి వీలులేదు. సత్యం సంస్థకు చెందిన 'శతభిషం' కంపెనీ పేరిట ఉన్న ఈ 13 ఎకరాల భూమిని తొలుత డీఎన్‌బీ అనే చిన్న కంపెనీకి బదలాయించడం జరిగిపోయింది. ఈ డీఎన్‌బీ కంపెనీ మరెవరిదో కాదు, కేటీఆర్ బాల్యమిత్రుడు రాజేష్‌కు చెందినదిగా తేలింది. రామలింగరాజు కుటుంబానికి కూడా సన్నిహితుడిగా ఉన్న ఈ వ్యక్తికి, తెలంగాణలో 2014-15లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ భూములు బదిలీ కావడం గమనార్హం.

ఐటీ ట్రిబ్యునల్ వివాదంలో ఉన్న ఈ భూములను అసలు ఏ విధంగా రిలీజ్ చేశారు, వేరే కంపెనీకి ఎలా బదలాయించారు అనేది ప్రస్తుతం పెద్ద ప్రశ్నగా మారింది. ఆ తర్వాత సదరు రాజేష్ కంపెనీ నుంచి కేటీఆర్ బినామీగా చెప్పబడుతున్న ప్రదీప్ రెడ్డి పేరిట 4 ఎకరాలు, కేటీఆర్ భార్య శైలిమ పేరిట 3 ఎకరాలు, అలాగే కేటీఆర్ అత్త శశిరేఖ పేరిట కొంత భూమిని మార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే ప్రదీప్ రెడ్డి పేరిట ఫిరంగి నాలా మీద, పక్కా నిర్మాణాలు చేయకూడదనే నిబంధనలు ఉన్న 111 జీవోను సైతం తుంగలో తొక్కి ఒక అత్యంత విశాలమైన విలాసవంతమైన ఫామ్‌హౌజ్ నిర్మించారు. ఈ ఫామ్‌హౌజ్‌కు ఎలాంటి అధికారిక అనుమతులు లేవని, దీనికి సంబంధించిన కరెంటు బిల్లులు ఇప్పటికీ పాత సత్యం కంపెనీకి చెందిన సూర్యనారాయణరాజు పేరిట చెల్లిస్తున్నారనే విషయం షాకింగ్ నిజం.

ఈ ఫామ్‌హౌజ్ వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం డ్రోన్లతో నిఘా పెట్టడం, ఆ తర్వాత కేటీఆర్ వర్గం దీనిపై రాజకీయ రగడ సృష్టించడం తెలిసిందే. అయితే, ఈడీ ఐటీ సంస్థల ద్వారా పూర్తిగా జప్తు చేయబడిన భూములను అధికారికంగా సొంత పేర్లకు మార్చుకోవడం వెనుక ఉన్న వ్యూహం అందరినీ విస్తుగొలుపుతోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఐటీ, ఈడీ కార్యాలయాల నుంచి ఈ భూములు ఎలా బయటపడ్డాయి, ఉన్నతాధికారులు  రిజిస్ట్రేషన్ శాఖ ఇందులో ఏ విధంగా సహకరించారనేది ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు, ప్రదీప్ రెడ్డి స్పందిస్తూ 2019లో చట్టబద్ధంగా ఈ భూములను కొనుగోలు చేసి, తన చిన్ననాటి స్నేహితుడైన కేటీఆర్‌కు లీజుకు ఇచ్చినట్లు చెబుతున్నారు. కానీ అసలు ఆ భూములను ఎవరి వద్ద కొన్నారు, జప్తులో ఉన్నవి ఎలా అమ్ముడుపోయాయి అనే కోణంలో సమగ్ర విచారణ జరిగితేనే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని ప్రజలు చర్చించుకుంటున్నారు.

 

 

 

[ Janwada lands, Ktr farm house, Satyam scam lands, Ed attached properties, Telangana land scam, Ktr news Satyam Scam Lands, Satyam Scandal, KTR Family, KTR, KTR Family Land Deal, Telangana Politics, Telangana Land Scam, Satyam Land Scam ]