TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేటీఆర్ ఫామ్ హౌస్ ముట్టడి యత్నం.. జన్వాడలో ఉద్రిక్తత.!

Published on: Sat Sep 19, 2026 11:21AM

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం పరిధిలోని జన్వాడ మియాఖాన్‌గడ్డ ప్రాంతంలో భారీ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ లీజుకు తీసుకున్న  జన్వాడ ఫాంహౌస్‌ ముట్టడి పిలుపుతో  కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కదిలారు. ఫాంహౌస్ భూముల పరిశీలన పేరుతో కాంగ్రెస్ శ్రేణులు ఛలో జన్వాడకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆ పిలుపులో భాగంగానే పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు, శ్రేణులు అక్కడికి చేరాయి. దీంతో  అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు.  ఫాంహౌస్‌కు దారితీసే అన్నిదారులను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.   జన్వాడ ఫామ్ హౌస్ విషయంగా గత కొన్ని రోజులుగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. అధికారిక లెక్కల ప్రకారం, ఈ ఫాంహౌస్  4 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది.   ఈ ఆస్తి తనదేనని, కేటీఆర్‌కు కేవలం లీజు ప్రాతిపదికన మాత్రమే ఇచ్చానని ఫాంహౌస్ యజమాని ప్రదీప్ రెడ్డి స్పష్టం చేసినప్పటికీ, రాజకీయ వేడి ఇసుమంతైనా చల్లారలేదు.

  ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నాలా కబ్జాలు, బఫర్ జోన్ ఆక్రమణలు జరిగాయని గతంలో రెవెన్యూ, నీటిపారుదల శాఖల సంయుక్త సర్వేలో సుమారు 14 గుంటల మేర నాలా ఆక్రమణ జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో నాలా బెడ్‌పై 2.24 గుంటలు, బఫర్ జోన్‌లో మరో 11 గుంటల భూమి వివాదంలో ఉన్నట్లు తేలడంతో ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రెవెన్యూ యంత్రాంగం ఈ భూముల రికార్డులను  పరిశీలిస్తోంది.   మరోపక్క ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు మాత్రం ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని  మండిపడుతున్నారు.  


[Janwada Farmhouse, KTR, Miyakhangadda, Congress protest, Telangana politics, police security, Telugu One]