జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్: లష్కరే తోయిబా మోస్ట్ వాంటెడ్ కమాండర్ హతం.!
Published on: Wed Sep 30, 2026 9:56AM
.webp)
జమ్మూ కశ్మీర్ బుద్గామ్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిషేధిత లష్కరే తొయిబా ఉగ్ర సంస్థకు చెందిన మోస్ట్ వాంటెడ్ కమాండర్ హతమయ్యాడు. విశ్వసనీయ సమాచారంతో బుద్గామ్ పరిధిలోని యూస్మార్గ్ ప్రాంతంలోని కొరాగ్ సముదాయంలో భద్రతా బలగాలు, జమ్మూ కశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా కూంబింగ్ చేపట్టాయి.

ఆ సందర్భంగా జరిగిన ఎన్ కౌంటర్ లో లష్కరే తోయిబా టాప్ కమాండర్ ఫౌజీ మూసా హతమయ్యాడు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, పలు విధ్వంసకర దాడుల వెనుక ఫౌజీ మూసా హస్తం ఉందని తెలుస్తోంది. ఖాజీ మూసాతో పాటు.. యాసిర్ అనే మరో ఉగ్రవాది కూడా ఈ ఎన్ కౌంటర్ లో మరణించాడు.
జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద మూలాలను పూర్తిగా ఏరివేయడమే లక్ష్యంగా భద్రతా బలగాలు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. స్థానిక ప్రజలకు రక్షణ కల్పించడంతో పాటు, సరిహద్దు అవతల నుంచి ముప్పును తెచ్చిపెట్టే శక్తులను ఏరివేయడమే లక్ష్యంగా భద్రతా బలగాలు ముందుకు కదులుతున్నాయి.
ఇటీవల కాలంలో ఇంటెలిజెన్స్ వర్గాల సమన్వయం మెరుగవడంతో ఉగ్రవాద కదలికలను కట్టడి చేయడంలో భద్రతా బలగాలు విజయం సాధిస్తున్నాయి. తాజా ఎన్‌కౌంటర్‌తో లష్కరే తొయిబా నెట్‌వర్క్ దెబ్బతిన్నదని, కశ్మీర్ లోయలో ఆ సంస్థ ఉనికి నామమాత్రం అయ్యిందని భద్రతా బలగాలు చెబుతున్నాయి.
[Jammu Kashmir Encounter, Lashkare Taiba Commander Killed, Budgam Encounter, Fauzi Musa, Telugu One]


